జ్యోతి ఆరిపోయింది!
♦ పెళ్లైన ఏడాదికే వివాహిత అనుమానాస్పద మృతి
♦ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి బంధువులు
♦ దర్యాప్తు చేస్తున్న పోలీసులు
♦ బాతుపురంలో విషాదం
పెళ్లైన ఏడాదికే వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ సంఘటన వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకోగా.. పసుపురెడ్డి జ్యోతి (22) మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. జ్యోతి చావుకు అత్త వేధింపులే కారణమని కన్నవారు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వజ్రపుకొత్తూరు రూరల్: సోంపేట మండలం లక్కవరం గ్రామానికి చెందిన టేకు వాసుదేవరావు, సరోజినిల పెద్ద కుమార్తె జ్యోతికి బాతుపురం గ్రామానికి చెందిన సింహాచలంతో గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. సింహాచలం ఉపాధి కోసం 10 రోజుల క్రితమే విజయవాడ వెళ్లిపోయాడు. దీంతో ఇంటి వద్ద అత్త లక్ష్మీకాంతం, జ్యోతి మాత్రమే ఉంటున్నారు. కాగా లక్ష్మీకాంతం శనివారం ఉదయం కాశీబుగ్గ వెళ్లి 12 గంటల సమయానికి తిరిగి ఇంటికి వచ్చేసరికి జ్యోతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయి ఉండడాన్ని చూసి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మృతదేహాన్ని కిందకుదించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు, వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ ప్రసా ద్ సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రస్తుతం బిలాయిలో ఉంటున్న జ్యోతి తల్లిదండ్రులు వచ్చే వరకు మృతదేహాన్ని ఉంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. జ్యోతి మృతికి కారణాలు తెలియరాలేదని సీఐ పేర్కొన్నారు. అయితే జ్యోతి మృతదేహం వద్ద హిందీ లో రాసిఉన్న సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అత ్త వేధింపులే జ్యోతి మరణానికి కారణం!
జ్యోతి మరణానికి అత్త వేధింపులే కారణమని కన్నవారు తరఫువారు ఆరోపించా రు. లక్ష్మీకాంతాన్ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అందరితో కలివిడిగా ఉండే జ్యోతి ఇక లేదని తెలియడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీ రుగా విలపించారు. జ్యోతి మృతితో బాతుపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విచారణ చేపడుతున్నాం
జ్యోతి మరణంపై కేసు నమోదు చేసి విచా రణ చేపడుతున్నామని కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు తెలిపారు. జ్యోతి అత్తను విచారించామన్నా రు. బిలాయి నుంచి జ్యోతి తల్లి దండ్రులు వచ్చిన తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తామన్నారు.