అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి
► పెళ్లయిన ఏడాదికే ఆత్మహత్య
► హత్యే అంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు
► ఘటనాస్థలాన్ని పరిశీలించిన
► పోలీసులు, రెవెన్యూ అధికారులు
శ్రీకాకుళం సిటీ /పాతశ్రీకాకుళం : అత్తంటి ఆరళ్లకు ఓ వివాహిత బలైంది. శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరానగర్‌కాలనీ సమీప వంశధారనగర్ కాలనీలో వివాహిత మట్ట కల్పన(24) ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారని.. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన కల్పనకు.. నందిగాం మండలం పెంటూరుకు చెందిన మట్ట యుగంధర్ ఉరఫ్ మూర్తితో గతేడాది మార్చి 22న వివాహమైంది. ప్రస్తుతం కల్పన నాలుగు నెలల గర్భిణి. కల్పన తల్లిదండ్రులు కొంచాడ సరోజిని, లచ్చయ్య వ్యవసాయకూలీలు.
యుగంధర్, కల్పనలు కొంతకాలంగా శ్రీకాకుళంలోని వంశధారనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. యుగంధర్ బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో కాంట్రాక్ట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో గానీ.. శుక్రవారం సాయంత్రం కల్పన ఉరివేసుకొని మృతి చెందిందన్న విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు యుగంధర్ ఫోన్‌లో సమాచారం అందించాడు. దీంతో వారు రాత్రి సమయంలో ఇక్కడికి చేరుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కల్పన విగతజీవిగా పడిఉండడంతో మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు, ఇతర బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటనా స్థలానికి శనివారం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు, శ్రీకాకుళం తహసీల్దార్ సుధాసాగర్, సీఐ ఆర్.అప్పలనాయుడు, ఎస్సై వాసునారాయణలు చేరుకున్నారు. మృతికి గల కారణాలను ఆరా తీశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెళ్లయిన ఏడాదిలోపే..
పెళ్లయిన 11 నెలలకే తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు సరోజిని, లచ్చయ్య ఆరోపిస్తున్నారు. పెళ్లయిన నెలరోజుల నుంచే అదనపు కట్నం తేవాలంటూ యుగంధర్, అతని తల్లిదండ్రులు, ఆడపడుచు తమ కుమార్తెను వేధించే వారని చెప్పారు. పెళ్లి సమయంలో 2.50 లక్షల నగదు, 5 తులాల బంగారం, ఒక ద్విచక్రవాహణాన్ని ఇచ్చామన్నారు. నాలుగు నెలల గర్భిని అని తెలిసి కూడా సరైన తిండి పెట్టకుండా శారీరకంగా, మానసికంగా హింసించేరని వాపోయారు. పెళ్లయిన నాటి నుంచి రెండు, మూడుసార్లు మాత్రమే కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడామని కన్నీటిపర్యంతమయ్యారు. కల్పన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేస్తున్నాం కల్పన మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలిస్తున్నామన్నారు. కల్పన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు యుగంధర్, అతని తల్లిదండ్రులు, ఆడపడుచులపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.