జీడితోటలో కొమ్మకు వేలాడుతున్న మృతదేహం
భర్తే చంపాడంటున్న మృతురాలి తల్లిదండ్రులు
తనకు తెలియదంటున్న భర్త
దబ్బగుంట(శృంగవరపుకోట) : నూతన సంవత్సర వేడుకలు ముగియకముందే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. శృంగవరపుకోట మండలం దబ్బగుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మూలబొడ్డవర పంచాయతీ దబ్బగుంట గ్రామానికి చెందిన కొర్ర జమరాజు, ఎరుకులమ్మ దంపతుల మూడో కుమార్తె కన్నమ్మ(21)కు, వేపాడ మండలం కొండగంగుబూడి పంచాయతీ పరిధిలోని ఎస్.కోట సీతారాంపురం గ్రామానికి చెందిన కందుల రాముతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నూతన సంవత్సర వేడుకల కోసం జమరాజు సీతారాంపురంలో ఉంటున్న తన కుమార్తె కన్నమ్మను గురువారం సాయంత్రం దబ్బగుంట తీసుకొచ్చారు.
కన్నమ్మ భర్త రాము శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అత్తారింటికి వచ్చాడు. అదే సమయంలో జమరాజు గ్రామంలోని తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. ఇష్టానుసారంగా పిక్నిక్‌లకు వెళుతూ డబ్బు ఖర్చు చేస్తున్నావంటూ రాత్రి 9 గంటల సమయంలో జమరాజుతో అల్లుడు రాము గొడవపడ్డాడు. ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో రాము తన భార్య కన్నమ్మను తీసుకుని వెళ్లిపోయాడు. అయితే రాము రాత్రి 11 గంటల సమయంలో జమరాజు ఇంటికి వచ్చి తన భార్య ఎక్కడుంది... పరిగెత్తుకు వచ్చింది.. మీరే దాచారు.. అంటూ మళ్లీ గొడవపడి వెళ్లిపోయాడు. ఆ రాత్రికి గ్రామంలోని తామల కన్నబాబు ఇంటి వద్ద నిద్రించాడు.
కన్నమ్మ కుటుంబ సభ్యులు రాత్రంతా ఆమె కోసం వెదికినా కనిపించలేదు. శనివారం ఉదయం జమరాజు ఇంటి వెనుక వంద గజాల దూరంలో ఉన్న జీడితోటలో చెట్టు కొమ్మకు చున్నీతో వేలాడుతున్న కన్నమ్మ మృతదేహం ఆమె తల్లి ఎరుకులమ్మకు కనిపించింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా... భర్త రాము పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడ్ని గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తమ కుమార్తెను రాము హత్య చేసి నమ్మించటం కోసమే రాత్రి గ్రామంలో బస చేశాడని కన్నమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను భార్యను హత్య చేయలేదని, ఆమె తనతో సఖ్యతగా ఉండేదని రాము చెబుతున్నాడు. ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యాన కన్నమ్మ మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ గొడవల నేపథ్యంలో కన్నమ్మ ఆత్మహత్య చేసుకుందా.. హత్యకు గురైందా.. అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
Published Sun, Jan 3 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM
Advertisement
Advertisement