కాకినాడలోని పలు ప్రైవేటు నర్సింగ్ స్కూల్స్ మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌నే నమ్ముకున్నాయా? ఏదో ఒకటి చేసి నర్సింగ్ కోర్సును పూర్తి చేయిస్తామని విద్యార్థులకు హామీ ఇస్తున్నాయా? రూ.లక్షలు తీసుకొని అధికార సిబ్బందిని మేనేజ్ చేసి పరీక్షలను గట్టెక్కిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసానిస్తున్నాయా? ఆ నమ్మకంతోనే దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చేరుతున్నారా? నాణ్యమైన చదువునివ్వకుండా పక్కదారిలో పాస్ చేయించే ప్రయత్నం చేస్తున్నాయా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సును జిల్లాలో 38 నర్సింగ్ స్కూల్స్ అమలు చేస్తున్నాయి. దేశ నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చేరుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఇక్కడే హాస్టల్స్‌లో ఉంటూ చదువుతుండగా, మరికొంతమంది పరీక్షలకు మాత్రం వచ్చేలా లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈమేరకు విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు పిండుతున్నాయి. కోర్సు పూర్తి చేసినట్టుగా సర్టిఫికెట్ వస్తే చాలు ఆ తర్వాత ఏదో రాష్ట్రానికో, దేశానికో వెళ్లిపోయి మంచి ఉద్యోగం సాధించి, ఖర్చు పెట్టిన సొమ్మును ఇట్టే సంపాదించవచ్చనే ఆలోచనతోవిద్యార్థులు ఏమాత్రం వెనకాడటం లేదు. దేశ నలు మూలల నుంచి వచ్చి ఇక్కడ వాలిపోతున్నారు. అ లా అని అన్ని నర్సింగ్ స్కూల్స్ చేయడం ఈ రకంగా పక్కదారి పట్టడం లేదు. కొన్ని మాత్రమే అడ్డదా రులు తొక్కి విద్యార్థులను తప్పుతోవ పట్టిస్తున్నా యి. ప్రస్తుతం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతున్న జీఎన్‌ఎం పరీక్షల్లో వెలుగు చూస్తు న్న స్లిప్పుల భాగోతం చూస్తుంటే పలు నర్సింగ్ స్కూల్స్‌లో చదువు కన్నా సామూహిక చూసి రాతలపైనే ఎక్కువగా తర్ఫీదునిస్తున్నట్టు తెలుస్తోంది. జి ల్లా వ్యాప్తంగా ఉన్న 38 నర్సింగ్ స్కూల్స్‌కు చెందిన 3494 విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇం దులో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులున్నారు. ముందస్తు తనిఖీల్లోనే పెద్ద ఎత్తున స్లిప్పులతో విద్యార్థులను పట్టుకుంటున్నారు. వాటిన్నింటినీ అధికారులు భద్రపరిచి ఉంచారు.
మాల్ ప్రాక్టీసుకు అనుకూలంగాపరీక్షా కేంద్రాల ఏర్పాట్లు...
తల రాతను మార్చే పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇక్కడ జరుగుతున్న పరీక్షలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. సాధారణ పరీక్షల్లో విద్యార్థుల కోసం టేబుల్స్ ఏర్పాటు చేసి, వాటి మీద పరీక్ష రాసేలా చూస్తారు. వారెటువంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా ఇట్టే కనబడతారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, ఇక్కడ హేండ్‌లెస్ కుర్చీలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. టేబుల్స్ అన్నవే ఏర్పాటు చేయలేదు. దీంతో హ్యాండ్‌లెస్ కుర్చీలపై పరీక్షలు రాయడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెచ్చుకున్న స్లిప్పులతో పరీక్షలు రాయడం అంతే సులువు. మరి, ఎవరి అనుకూలం కోసమో...ఎవరికి లబ్ధి చేకూర్చేందుకో తెలియదు గాని దాదాపు 3500 మంది విద్యార్థులు హాజరవుతున్న పరీక్షలను సరైన కుర్చీల్లేకుండా, టేబుల్స్ ఏర్పాటు చేయకుండా చేయడం వెనుక మర్మమేంటోనని చూసినవారు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఫొటోలో ఉన్న సంచె చూశారా? ఇందులో ఉన్నవి పరీక్షా ప్రశ్న పత్రాలో? సమాధాన పత్రాలో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. చూసి రాసేందుకు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నేరుగా తీసుకొచ్చిన స్లిప్పు (చీటీ)లివీ. అత్యధిక మంది విద్యార్థులు స్లిప్పులు తీసుకొని పరీక్షా హాల్‌లోకి వస్తుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. ముందస్తు తనిఖీల్లో చాలా వరకు పట్టుబడుతున్నాయి. ఇక, తనిఖీలు చేయలేని విధంగా లో దుస్తుల్లో స్లిప్పులను తీసుకురావడంతో పట్టుకోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment