మోసంలో చంద్రబాబుకు మాస్టర్ డిగ్రీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ప్రజాపాలనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొలమానంగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్కొన్నారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలనలో వివిధ పార్టీలకు వైఎస్ హయాం, వైఎస్ అనంతర కాలం అనే విధంగా చెప్పుకునేంత ప్రజారంజకంగా వైఎస్ పాలన కొనసాగిందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారు అడుగకుండానే ప్రజలకోసం వైఎస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిమానానికి పాత్రుడయ్యారన్నారు. అటువంటి నేత వారసునిగా రాజకీయాల్లోకి ప్రవేశించి అనతికాలంలోనే రాష్ట్ర ప్రజలపై తనదైన చెరగని ముద్ర వేసిన ఘనత తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం మాకొద్దు బాబోయ్ అని ప్రజలే అంటున్నారని, ఎన్నికల వాగ్దానాల అమలులో ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు విఫలమైన తీరుతో ప్రజలు తాము ఆయన చేతిలో మరోసారి మోసపోయామని గ్రహించారన్నారన్నారు. కాగా ఆదిలో సొంతమామను, అనంతరం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మోసపోయిన ప్రజలనే మళ్లీ మోసం చేయడంలో మాస్టర్ డిగ్రీ సాధించారని ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చకపోవడంతో టీడీపీపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, దానిని తమ పార్టీకి అనుకూలంగా మలచడానికి కృషి చేస్తామన్నారు. ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. వీరితో పార్టీ ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని అధ్యక్షత వహించగా, పార్టీ నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు, గ్రంధి శ్రీనివాస్, చీర్ల రాధయ్య, తలారి వెంకట్రావు, తోట గోపి, మరడాని రంగారావు, పుప్పాల వాసుబాబు, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొనగా పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ సభకు ఆహ్వానం పలికారు.
ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు వీరే..
పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వందనపు సాయిబాల పద్మ, యువజన విభాగం అధ్యక్షునిగా పేరిచర్ల విజయ నరసింహరాజు, రైతు విభాగం అధ్యక్షునిగా ఆత్కూరు దొరయ్య, బీసీ విభాగం అధ్యక్షునిగా ఘంటా ప్రసాదరావు, ఎస్సీ విభాగం అధ్యక్షునిగా చెల్లెం ఆనందప్రకాష్, ఎస్టీ విభాగం అధ్యక్షునిగా కొవ్వాసి నారాయణ, మైనార్టీ విభాగ అధ్యక్షునిగా ఎండీ అస్లాం, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా కౌరు వెంకటేశ్వరరావు, లీగల్ సెల్ అధ్యక్షునిగా కామన బాల సత్యనారాయణ, డాక్టర్ల విభాగ అధ్యక్షునిగా పల్లాపు సత్యవేదం, విద్యార్థి విభాగం అధ్యక్షునిగా గుణ్ణం సుభాష్, పార్టీ జిల్లా కోశాధికారి, పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శిగా డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు జిల్లా క్రమశిక్షణ సంఘం సభ్యులుగా పోతుల రామతిరుపతిరెడ్డి, పటగర్ల రామ్మోహనరావు, ప్రసాద్ ప్రమాణం చేశారు. అలాగే పార్టీ జిల్లా అధికార ప్రతినిధులుగా పొలనాటి శ్రీనివాస్, గంపల బ్రహ్మావతి, కొఠారు రామచంద్రరావు, ముప్పిడి సంపత్‌కుమార్, మాజేటి సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు.
హుద్‌హుద్ సహాయ నిధికి విరాళం
హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయనిధికి పార్టీ కార్యకర్త సీహెచ్‌ఎన్‌వీ సత్యనారాయణ రూ.3 వేల నగదును ధర్మాన ప్రసాదరావుకు అందజేశారు.