Master Degree
-
సంతోషాలు పంచిపెట్టె
నరసరావుపేట: వారు రైతు బిడ్డలు. భూమాతను నమ్ముకున్న అన్నదాతల కష్టాలు తెలిసిన మానవతావాదులు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనుకున్నారు. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీలు చేసినా ఉద్యోగం చేయాలనే ఆలోచనలకు స్వస్తి పలికారు. ఉన్న ఊరిలోనే పలువురికి ఉపాధి కలి్పస్తూ సొంతంగా వ్యాపారం చేయాలని సంకలి్పంచారు. ప్యాకింగ్ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రాయితీలతో వ్యాపారాన్ని విస్తరించారు. ఇదీ నరసరావుపేట ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం.ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయప్రస్థానం ∙ స్వయం ఉపాధితో పాటు 40 మందికి బతుకుతెరువుప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారం విస్తరిస్తున్నామన్న యాజమాన్యం ∙ ఉన్నత చదువులు చదివినా ఉన్న ఊరికి మేలు చేయాలనే సంకల్పంఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. అయినా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూడలేదు. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాంత అవసరాలపై దృష్టి కేంద్రీకరించారు. అధ్యయనం చేశారు. ఆయిల్, స్పిన్నింగ్, మిల్క్ యూనిట్లు అనేకం ఉండడంతో ఆయా ఉత్పత్తులు ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అట్ట పెట్టెలు తయారీ పరిశ్రమ నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇదీ నరసరావుపేట పెద్దచెరువు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అధినేత కామిరెడ్డి కృష్ణకిషోర్‌రెడ్డి విజయగాథ.వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాకతో ఉజ్వల ప్రగతి పరిశ్రమ ఏర్పాటుచేసిన కొన్ని నెలలకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీసింది. ఓ వైపు కోవిడ్ తో ప్రభుత్వానికి ఆరి్థక కష్టాలు వెంటాడుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో 2015–20 పాలసీ కింద ఏర్పాటుచేసిన పరిశ్రమలకు చెల్లించాల్సిన సబ్సిడీలను విడుదల చేశారు. దీంతో ఆంజనేయ ఇండస్ట్రీస్ కు రూ. 13 లక్షల సబ్సిడీ లభించింది. దీంతోపాటు విద్యుత్ టారిఫ్‌ల మినహాయింపులు, చెల్లించాల్సిన రుణానికి వడ్డీలో సబ్సిడీ మంజూరు చేశారు. ప్రభుత్వ చర్యలతో యజమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. సుమారు 40 మంది ఉద్యోగులు, కూలీలను నియమించుకొని వ్యాపారాన్ని మరింత విస్తరించారు. మూడు షిప్టులుగా పనిచేస్తున్న సిబ్బందికి ఒకొక్కరికి నెలకు రూ.40వేలు నుంచి రూ.15వేలు వరకు జీతాలు చెల్లించి ఉపాధి చూపించారు. జిల్లాలోని పలు వ్యాపారులు, పరిశ్రమలకు కావాల్సిన అట్టపెట్టెలను ఆర్డర్లు తెప్పించుకొని వారికి నచ్చిన రీతిలో తయారుచేసి సకాలంలో అందిస్తూ వ్యాపారుల మన్ననలు పొందుతున్నారు. ఇంతితై వటుడింతై అన్న చందంగా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. ఐదేళ్ల కాలంలో ఏడాదికి రూ.3 నుంచి 4కోట్ల టర్నోవర్ చేస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రిక్త హస్తం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రచారాలు చేసిన గత టీడీపీ పాలకులు హామీలను తుంగలో తొక్కారు. ఎటువంటి సబ్సిడీని మంజూరు చేయకపోయినా కృష్ణకిషోర్ రెడ్డి ఆటుపోట్లను ఎదుర్కొని సొంత పెట్టుబడితో పరిశ్రమను స్థాపించాడు. సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనుకున్నా ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. దీంతో కష్టంగానే వ్యాపారాన్ని నెట్టుకొచ్చారు.40 మందికి ఉపాధి నరసరావుపేటకు చెందిన కామిరెడ్డి కృష్ణకిషోర్‌రెడ్డి ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. నరసరావుపేటలోనే ఏదైనా పరిశ్రమ పెట్టాలని భావించారు. ఈ ప్రాంతంలో ఆయిల్, స్పిన్నింగ్ మిల్లులు, మిల్క్ యూనిట్లు, లాంటి సంస్థల ఆవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్యాకింగ్‌కు ఉపయోగించే అట్టపెట్టెల పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. 2015 నుంచి 2020 పరిశ్రమల ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పాలసీ కింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన స్నేహితుడు గెల్లి అరుణ్‌రెడ్డిని భాగస్వామిగా చేసుకొని 2019 జనవరిలో పట్టణంలోని పెద్దచెరువు ఇండ్రస్టియల్ ఎస్టేట్‌లో ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అనే చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటు చేశారు. మెషినరీ కోసం రూ.60లక్షలు, మరో రూ.25లక్షల ఓవర్ డ్రాప్‌్టతో సంస్థను ప్రారంభించారు. నా ఆశయం నెరవేరింది మా లాంటి చిన్నతరహ పరిశ్రమలకు ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. ఏ అధికారి వత్తిళ్లు లేవు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తున్నాం. ఉన్న పట్టణంలోనే పదిమందికి ఉపాధి కలి్పంచాలనే నా ఆశయానికి ప్రభుత్వ సహకారం తోడైంది. వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. –కామిరెడ్డి కృష్ణకిషోర్‌రెడ్డి, ఎం.డి. ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీ ఉన్న ఊరిలో ఉపాధి దొరికింది ఈ పరిశ్రమ రావడంతో నాకు ఉన్న ఊరిలోనే ఉపాధి లభించింది. ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 15 వేలు జీతం ఇస్తుండడంతో కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. పనిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా అట్ట పెట్టెలు తయారుచేస్తున్నాను. –కె.కోటేశ్వరరావు, కూలీ యూనిట్ పేరు : ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి : అట్ట పెట్టెల తయారీ యజమానులు : కృష్ణకిషోర్‌రెడ్డి, అజయ్ రెడ్డి పెట్టుబడి : రూ. 85 లక్షలు టర్నోవర్ : రూ. 3 కోట్లుఉపాధి : 40 మంది కేటగిరి : చిన్నతరహా ప్రాంతం : నరసరావుపేట -
పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు..కానీ బతుకుదెరువు కోసం ఆ వ్యక్తి..
ఉన్నత చదువులు చదివినా కొందరూ లైఫ్‌లో తొందరగా సెటిల్ అవ్వలేరు. మంచి ఉద్యోగం రాక నానాపాట్లు పడుతుంటారు. ఉన్నత చదువులు చదివినా అందుకు తగ్గ స్థాయిలో ఉద్యోగాల లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణాల వల్లే ఎంతో మంది ఉన్నత విద్యావంతులు సరైన ఉద్యోగం లేక సతమతమవుతున్నారు. ఇక్కడొక పంజాబ్ వ్యక్తి కూడా అదేకోవకు చెందినవాడు. వివరాల్లోకెళ్తే..పంజాబ్‌కి చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన గత 11 ఏళ్లుగా పంజాబీ యూనివర్సిటీ న్యాయ విభాగంలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పనిచేశారు. కానీ అక్కడ ఇచ్చే అరకొర జీతం అక్కరకు రాక నానాపాట్లు పడ్డాడు. పైగా వేతనం కూడా సకాలంలో రాకపోవడం వంటి సమస్యలతో విసుగు చెంది బతుకుదెరువు కోసం కూరగాయాలు అమ్మడం ప్రారంభించారు. ఆయన న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసిన వ్యక్తి. అంతేగాదు జర్నలిజం, పొలిటికల్ సైన్సు వంటి సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తి. ఈ మేరకు సందీప్ సింగ్ మాట్లాడుతూ..సమాయానికి జీతం రాకపోవడం, ఒకవేళ వచ్చినా..ఆ అరకొర జీతంతో తాను తన కుటుంబం బతకడం కష్టంగా మారడంతో కూరగాయాలు అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన తన కూరగాయాల బండిపై పీహెచ్డీ సబ్జీవాలా అనే బోర్డు పెట్టుకుని మరీ ఇంటి ఇంటికి తిరుగుతూ కూరగాయాలు అమ్ముతుంటాడు. అయితే తాను ప్రొఫెసర్‌గా సంపాదించిన దానికంటే కూరగాయాలు అమ్మడం ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒక పక్కన ఇలా కూరగాయాలు అమ్ముతూనే చదువు కొనసాగిస్తున్నాడు సందీప్ సింగ్. అంతేగాదు తాను తన ప్రొఫెసర్ వృత్తికి బ్రేక్ ఇచ్చినప్పటికీ ఎప్పటికీ తన ఈ ప్రోఫెసర్ వృత్తిని వదలనని ఇది తనకు ఇష్టమని చెబుతున్నాడు. పైగా డబ్బు ఆదా చేసి, ఎప్పటికైనా సొంతంగా ఓ ట్యూషన్ సెంటర్‌ని స్టార్ట్ చేయాలన్నది తన కోరిక అని చెప్పాడు. ఈ ఉన్నత విద్యావంతుడి కోరక నెరవెరాలని ఆశిద్దాం. ఇలాంటి ఘటనలు మన దేశంలో ఉన్న నిరుద్యోగతకు అద్దం పడుతోంది కదా!. కొంగొత్త కోర్సులు వస్తున్నట్లే అంతే స్థాయిలో ఉద్యోగాలు ఉంటే ఇలా సందీప్ లాంటి వాళ్లకు కూరగాయాలమ్మే పరిస్థితి ఏర్పడదు కదా!. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!
చదవాలన్న కోరిక ఉంటే వయసు పెద్ద సమస్య కాదని ప్రూవ్ చేసింది ఈ బామ్మ. వివిధ అనారోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకునే వయసులో పట్టుదలతో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి శభాష్ అనిపించుకుంది. తల్లిదండ్రులు అన్ని సదుపాయాలు సమకూర్చి చదువుకోమన్న చదవని యువతకు ఆదర్శం ఈ బామ్మ. ఈ వయసులో చదువుకోవడానికి కారణం?. ఇంతటి వృధాప్య వయసులో ఏజ్ రీత్యా వచ్చే సమస్యలను అధిగమించి మరీ మాస్టర్ డిగ్రీని ఎలా పూర్తి చేసింది అంటే.. యూఎస్‌కి చెందిన ఈ బామ్మ మిన్నీ పేన్. ఆమె తల్లిదండ్రులు చదువుకోని వస్త్ర కార్మికులు. ఆమె హైస్కూల్ చదువును మాత్రేమ పూర్తి చేసింది. ఆమె దక్షిణ కెరొలిన టెక్స్టైల్ మిల్లు వాతావరణంలోనే పెరిగింది. సరిగ్గా 1950లో తన హైస్కూల్ విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థలో క్లర్క్‌గా పనిచేసింది. అంతకుముందు ఓ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. 1961లో డేల్‌ని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇంట్లో కొన్నాళ్లు తల్లిగా పిల్లల ఆలనాపాలన చూసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యాయురాలిగా కెరియర్ ప్రారంభించింది. ఆ బామ్మ ట్రాన్స్క్రిపషినిస్ట్ వర్డ్ ప్రాసెసర్‌గా 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ కొనసాగించి 68 ఏళ్ల వయసులో విరమణ తీసుకుంది. ఆ తర్వాత టెక్సాస్ ఉమెన్స్ యూనివర్సిటీలో చేరాలనుకుంది. తాను చదవుకోలేకపోయిన కాలేజ్ చదువుని పొందాలనుకుంది. ఇక అండర్ గ్రాడ్యుయేట్లో భాగంగా జర్నలిజం, బిజినెస్ కోర్సులను తీసుకుంది. 73 ఏళ్ల వచ్చేటప్పటికీ అండర్ గ్రాడ్యుయేషన్‌ని పూర్తి చేసింది. ఆ తర్వాత ఆ బామ్మ ఇంటర్ డిసిప్లీనరీ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి, అత్యంత వృద్ధ వయసులో పీజీ చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అంతేగాదు తన మనవడితో కలసి స్టేజ్‌పైకి వెళ్లి డిగ్రీని అందుకోవడం విశేషం. తన తోటి గ్రాడ్యుయేట్లు ఆమెను చూసి స్ఫూర్తి పొందడమేగాక ఎంతగానో అభిమానించేవారు. చదువుకునే వయసులో ఉన్నత చదువులు చదివే అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ తన కోరికను నెరవేర్చుకుంది. చాలామంది నేను అలా చేయాలనుకున్నాను, ఇది చేద్దామనుకున్నా.. అని కబుర్లు చెబుతూ నిటూర్పులు విడుస్తారు. సంయమనం, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు ఏదో రకంగా అవకాశాన్ని దొరకబుచ్చుకుని మరీ తమ కలను సాకారం చేసుకుంటారనడానికీ ఈ బామ్మే ఉదాహరణ. (చదవండి: ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?) -
Jaahnavi Kandula: జాహ్నవికి మరణానంతర డిగ్రీ
వాషింగ్టన్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణానంతర డిగ్రీ అందనుంది. ఈ విషయాన్ని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. జాహ్నవి తరపున ఆమె కుటుంబ సభ్యులకు ఎంఎస్ పట్టా అందజేస్తామని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలువాసి అయిన జాహ్నవి.. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం కింద 2021లో అమెరికా వెళ్లింది. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చేరిందామె. కెరీర్లో త్వరగా సెటిల్ అయ్యి.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని ఆమె కల. ఈ ఏడాది డిసెంబర్లో జాహ్నవి డిగ్రీ పూర్తి కావాల్సి ఉంది. పాపం ఈలోపే ఆమెను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి..ప్రమాద సమయంలో సమాచారం అందుకున్న ఓ అధికారి.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు చులకనగా మాట్లాడిన మాటల్ని తాజాగా అక్కడి పోలీస్ శాఖనే బయటపెట్టింది. దీంతో భారతీయులు భగ్గుమన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. ఇప్పుడు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నార్త్ఈస్ట్రన్ (Northeastern University) ఛాన్సలర్ ‘‘ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో మా క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఈ సమయంలో వారికి మేం అండగా ఉంటాం. అలాగే ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని మేం ఆశిస్తున్నాం. ఇక జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని మేం నిర్ణయించాం. ఆమె కుటుంబంసభ్యులకు దాన్ని అందజేస్తాం’’ అని తెలిపారు. -
హృదయ విదారకం.. చికాగో రోడ్లపై దీనస్థితిలో హైదరాబాద్ మహిళ
ఉన్న ఊరు, దేశం విడిచి విదేశాల్లో సెటిల్ కావాలనే కోరిక కలిగిన వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉన్నత చదువుల కోసం, బెటర్ లైఫ్, లగ్జరీగా బతకాడనికి చాలా మంది విదేశాల బాటపడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, దుబాయ్, యూకే, సింగపూర్ అంటూ ఎంచక్కా ఎగిరిపోతున్నారు. అయితే పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కాదని ముక్కు ముహం తెలియని దేశంలో జీవించడం అంత సులభం కాదు. ఏ ఆపద, కష్టం, విపత్తు ఎదురైనా అండగా నిలిచేందుకు ఎవరూ ఉండరు. తాజాగా అలాంటి ఓ దుర్భర పరిస్థితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన మహిళకు ఎదురైంది. ఎంఎస్ చదవడానికి యూఎస్ వెళ్లిన యువతి చికాగో రోడ్లపై దీనస్థీతిలో కనిపించింది. హైదరాబాద్‌కు చెందిన ‘సైదా లులు మిన్హాజ్ జైదీ’ మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లింది. అయితే ఆమె వస్తువులన్నీ ఎవరో దుండగులు దొంగిలించారు. దీంతో ప్రస్తుతం ఆమె చికాగోలోని రోడ్లపై ఆకలికి అలమటిస్తూ దయనీయ స్థితిలో తిరుగుతోంది. ఆమె పరిస్థితిని తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) పార్టీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టులో యువతి తన పేరు, వివరాలు తెలియజేస్తున్న వీడియో కూడా ఉంది. అయితే ఆమె బక్కచిక్కిపోయి, తినడానికి ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి వహాజ్ ఫాతిమా తీవ్రంగా విలపిస్తున్నారు. ఈ మేరకు విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు. కూతురుని తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు తమకు సాయం చేయాలని అర్థించారు. చదవండి: మొబైల్ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం Syeda Lulu Minhaj Zaidi from Hyd went to persue MS from TRINE University, Detroit was found in a very bad condition in Chicago, her mother appealed @DrSJaishankar to bring back her daughter.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD pic.twitter.com/GIhJGaBA7a — Amjed Ullah Khan MBT (@amjedmbt) July 25, 2023 తల్లి రాసిన లేఖలో.. ‘హైదరాబాద్‌లోని మౌలాలీకి చెందిన మిన్హాజ్ జైదీ ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని ట్రైనీ( TRINE) యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేందుకు యూఎస్ వెళ్లింది. తరుచూ మాతో టచ్‌లోనే ఉంది. కానీ గత రెండు నెలలుగా తనతో సంబంధాలు తెగిపోయాయి. అయితే నా కూతురు డిప్రెషన్లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. చికాగో రోడ్లపై నిరాశ్రయురాలిగా నా కూతురు కనిపించింది. దయచేసి తక్షణమే జోక్యం చేసుకుని, నా కుమార్తెను వీలైనంత త్వరగా తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం, చికాగోలేని ఇండియన్ కాన్సులేట్‌ను కోరుతున్నాను’ అని పేర్కొంది. మహిళ విజ్ఞప్తిపై చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. సయ్యద్ లులు మిన్హాజ్ కేసు గురించి ఇప్పుడే తెలుసుకున్నామని, దీనిపై వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపింది. కాగా మదద్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదైందని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. -
ఎంటెక్ చేశావా.. టీచింగ్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యలో మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ సహా దాని అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉజ్వల భవిష్యత్ ఉండబోతోంది. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు, సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెరుగుతుండటం.. మరోవైపు కొన్నేళ్లుగా ఎంటెక్‌లో ప్రవేశాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ఎంటెక్ చేసిన వారికి బోధన రంగంలో మున్ముందు డిమాండ్ పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో మరో రెండేళ్లలో వేతనాలు రెట్టింపయ్యే అవకాశముందని అంటున్నారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కొరత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు గత మూడేళ్లుగా పెరుగుతున్నాయి. అదనపు సెక్షన్లు వస్తున్నాయి. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఇవి కూడా ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉండే కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవన్నీ ఎంటెక్ అభ్యర్థులకు కలిసి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగినా అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్సిటీల్లోనే దాదాపు 3 వేలకుపైగా ఖాళీలున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చాలా కాలేజీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని ఆహ్వానిస్తున్నా వేతనాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. స్థానికంగా ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 50 వేల లోపే వేతనాలు ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు రూ. లక్షకు పైగా డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లలో భారీగా అవసరం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీసీ) మార్గదర్శకాల ప్రకారం బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులు బోధించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు ఉండాలి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కిందే దాదాపు 80 వేలకు పైగా బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 75 శాతం కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి కోర్సులున్నాయి. మిగతా కోర్సుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) సీట్లు చాలా వరకు మిగులుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు బోధించడానికి 3 వేల మంది సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లు అవసరం. ప్రస్తుతం 2 వేల మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 60 మందితో సెక్షన్లు నిర్వహిస్తున్నారు. 2024–25 నాటికి పెరిగే సీట్లను బట్టి కనీసం 10 వేల మంది కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు బోధించే వాళ్లు కావాలి. కొత్త వర్సిటీలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొరత ఎందుకు? సాధారణంగా విద్యార్థులు బీటెక్ కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి వైపే వెళ్తున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో కొంతమంది ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రారంభంలోనే రూ. 40 వేల నెలసరి వేతనం పొందే వీలుంది. దీంతో ఎంటెక్ చేయాలని విద్యార్థులు ఆలోచించట్లేదు. మరికొంత మంది విదేశాల్లో ఎంఎస్ కోసం వెళ్తున్నారు. ఫలితంగా ఏటా ఎంసెట్‌లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందో.. గుర్తింపునిచ్చే వర్సిటీలూ పట్టించుకోవట్లేదు. నాణ్యమైన అధ్యాపకులు లేరని గుర్తించినా విధిలేక అఫిలియేషన్ ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు అరకొరగా ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాఫ్ట్‌వేర్‌తో సమానంగా వేతనం ఉంటే తప్ప బోధన వైపు మళ్లే అవకాశం కనిపించట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కొరతను ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే. జీతాలు పెంచితే కొంత మార్పు రావొచ్చు ఓవైపు కంప్యూటర్ కోర్సులు పెరుగుతున్నాయి. మరోవైపు సంబంధిత విభాగాల్లో ఎంటెక్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ తేడాను పూడ్చాలి. బీటెక్‌తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంఎస్‌కు విదేశాలకు వెళ్తున్నారు. బోధించేందుకు వారు ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవాలి. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే కొంత మార్పు రావొచ్చు. – ప్రొఫెసర్ వి వెంకటరమణ (ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్) -
అమెరికా డిగ్రీలకు ‘హెచ్1బీ’లో ప్రాధాన్యత
వాషింగ్టన్: నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అమెరికా జారీచేస్తున్న హెచ్1బీ వీసా నిబంధనల్లో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అమెరికాలో మాస్టర్ డిగ్రీలు చదివిన విదేశీ విద్యార్థులకే ఇకపై హెచ్1బీ వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. భారత్, చైనా వంటి దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాలనుకునే ఐటీ నిపుణులపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. యూఎస్సీఐఎస్ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఏటా 65 వేల హెచ్1బీ దరఖాస్తులను జారీచేస్తున్నారు. అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించే విదేశీయుల కోసం మరో 20 వేల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అయితే, హెచ్1బీ వీసా ప్రక్రియలో మార్పులతో 65 వేల వీసాల్లో కూడా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన విదేశీ విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ కొత్త నిర్ణయం 2019, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటి నుంచే దరఖాస్తులను స్వీకరిస్తామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు. దీనివల్ల ఏటా అమెరికాలో మాస్టర్స్ చేసిన 5,340 మంది విదేశీయులు అదనంగా లబ్ధి పొందుతారని వ్యాఖ్యానించారు. -
అమెరికాలో ఎంఎస్ చదవాలంటే?
ఎంఎస్ ఇన్ యూఎస్..! ఆ అవకాశం లభిస్తే.. భవిష్యత్తు బంగారుమయమనే భావన! దీనికోసం ఎన్నో ప్రయత్నాలు.. కోర్సు మూడో ఏడాది నుంచే కసరత్తు ప్రారంభం! ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రవేశం ఖరారయ్యేది మాత్రం కొద్ది మందికే! నిరుత్సాహానికి గురయ్యే వారెందరో!! ఇందుకు వర్సిటీల ఎంపిక నుంచి వీసా ఇంటర్వ్యూ వరకు.. కారణాలెన్నో! అమెరికాలో ఎంఎస్‌లో ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.. భారతీయ విద్యార్థులకు స్టడీ అబ్రాడ్ పరంగా తొలి గమ్యం.. అమెరికా. మరి ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారు? అని అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం.. ఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్). ప్రఖ్యాత యూనివర్సిటీలకు నిలయమైన అమెరికా.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఏటా పది లక్షల మందికి పైగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. 2016–17 గణాంకాల ప్రకారం చదువుల కోసం అమెరికాకు పయనమైన వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య 10,78,822. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 1,86,267. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఎంఎస్. ముందస్తు కసరత్తు అమెరికాలో ఫాల్ (సెప్టెంబర్–డిసెంబర్), స్ప్రింగ్ (జనవరి–మే), సమ్మర్ (జూన్–ఆగస్ట్).. ఇలా మూడు సెషన్లలో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుంది. అధిక శాతం ప్రోగ్రామ్‌లు ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఫాల్ సెషన్లో జరుగుతాయి. విద్యార్థులు తాము చేరదలచుకున్న సెషన్‌కు కనీసం 15 నుంచి 18 నెలల ముందుగా కసరత్తు ప్రారంభించాలి. ముందుగా తమకు ఆసక్తి ఉన్న కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీల జాబితా రూపొందించుకోవాలి. ఆ యూనివర్సిటీలు పేర్కొన్న అర్హత నిబంధనలు, ప్రామాణిక టెస్ట్ స్కోర్ల కనీస స్కోరింగ్ వివరాలు తెలుసుకోవాలి. ప్రతి యూనివర్సిటీకి సంబంధించి దరఖాస్తు గడువు తేదీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి. రోలింగ్ అడ్మిషన్స్ అమెరికాలో ఎర్లీ అడ్మిషన్స్ ప్లాన్, రెగ్యులర్ అడ్మిషన్, రోలింగ్ అడ్మిషన్.. అనే మూడు పద్ధతుల్లో దరఖాస్తు చేసుకునే వీలుంది. రోలింగ్ అడ్మిషన్స్ విధానంలో దరఖాస్తుకు ఎలాంటి గడువు తేదీ ఉండదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత సెషన్లలో సీట్లు భర్తీ కాని సందర్భాల్లో రోలింగ్ అడ్మిషన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఒక యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. రోలింగ్ అడ్మిషన్ సెషన్‌కు కూడా దరఖాస్తు చేసుకోవడం మంచిది. అర్హత నిబంధనలు ఎంఎస్ కోర్సుకు అమెరికాలోని యూనివర్సిటీల అర్హత నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. అధికశాతం యూనివర్సిటీలు మాత్రం 16 ఏళ్ల (10+2+4) ఎడ్యుకేషన్ విధానం ద్వారా పొందిన డిగ్రీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కొన్ని యూనివర్సిటీలు మాత్రం 10+2 తర్వాత మూడేళ్ల వ్యవధిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ప్రఖ్యాత యూనివర్సిటీలు (హార్వర్డ్, ఎంఐటీ, యూసీ, కార్నెగీ మిలన్ తదితర) మాత్రం తప్పనిసరిగా 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారినే అర్హులుగా పేర్కొంటున్నాయి. స్టాండర్డ్ టెస్ట్‌ల స్కోర్లు మరో ముఖ్య అర్హత నిబంధన స్టాండర్డ్ టెస్ట్ స్కోర్లు. విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న డొమైన్ ఆధారంగా జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్ స్కోర్లు పొందడం తప్పనిసరి. అంతేకాకుండా జీఆర్ఈలో సబ్జెక్ట్ టెస్ట్ స్కోర్లను కూడా అక్కడి ప్రముఖ యూనివర్సిటీలు తప్పనిసరి చేస్తున్నాయి. జీఆర్ఈలో కనీసం 300 కుపైగా పాయింట్లు సొంతం చేసుకోవడం వల్ల అవకాశాలు మెరుగవుతాయి. జీమ్యాట్‌లో 650కు పైగా స్కోర్ ఉంటే ప్రవేశానికి మార్గం సుగమం అవుతుంది.. టోఫెల్లో కనీసం 100 స్కోర్ సొంతం చేసుకుంటే టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది. అకడమిక్ రికార్డ్ అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు పేర్కొంటున్న నిబంధనల ప్రకారం పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు 60 శాతం పైగా మార్కులు లేదా తత్సమాన జీపీఏతో ఉత్తీర్ణత తప్పనిసరి. హార్వర్డ్, ఎంఐటీ వంటి వర్సిటీల్లో ఎనిమిది జీపీఏ అవసరం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తాము ఎంపిక చేసుకునే యూనివర్సిటీల జాబితాను రూపొందించుకోవాలి. టెస్ట్ స్కోర్‌తోపాటు మరెన్నో! అకడమిక్‌గా అద్భుతమైన ఉత్తీర్ణత శాతాలు, టెస్ట్ స్కోర్లు ఉన్నతంగా ఉన్నప్పటికీ.. మరెన్నో అంశాలు అభ్యర్థుల ప్రవేశాన్ని నిర్దేశిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్ఓఆర్), స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ). కొన్ని సందర్భాల్లో అకడమిక్, టెస్ట్ స్కోర్లను సైతం కాదని ఎల్ఓఆర్, ఎస్ఓపీ ఆధారంగా ప్రవేశాలు పొందిన వారు సైతం ఉంటున్నారంటే వీటి ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. లెటర్ ఆఫ్ రికమండేషన్ అభ్యర్థుల సామర్థ్యాన్ని గుర్తిస్తూ సంబంధిత రంగంలోని నిపుణులైన వ్యక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలు.. లెటర్ ఆఫ్ రికమండేషన్. అభ్యర్థులు తాము చదువుకున్న యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ల నుంచి.. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ వారి ఉన్నతాధికారుల నుంచి లెటర్ ఆఫ్ రికమండేషన్ తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. తమ గురించి బాగా తెలిసిన వ్యక్తులతో ఈ సిఫార్సు లేఖలు పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలోని వర్సిటీలు ప్రస్తుతం కనీసం రెండు ఎల్‌ఓఆర్‌లను అడుగుతున్నాయి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అమెరికాలో ఎంఎస్‌లో అడ్మిషన్ ఖరారు చేయడంలో అత్యంత కీలకమైంది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అభ్యర్థులు అమెరికాలోని సదరు యూనివర్సిటీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు.. నిర్దిష్టంగా ఆ కోర్సునే ఎంపిక చేసుకోవడానికి కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అనే వివరాలు పేర్కొంటూ.. నిర్దేశిత పదాల్లో ఎస్ఓపీని సొంత మాటల్లో రాయాలి. దీన్ని యూనివర్సిటీకి సంబంధించిన అకడమిక్ నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో టెస్ట్ స్కోర్లు, అకడమిక్ పర్సంటేజీలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎస్ఓపీలో అభ్యర్థి పొందుపర్చిన సమాచారం, చూపిన నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్సే.. రెజ్యూమె సైతం ఇటీవల కాలంలో అమెరికాలోని పలు యూనివర్సిటీలు.. ఎస్సే (వ్యాస రచన) రాయమని కోరుతున్నాయి. దరఖాస్తు సమయంలోనే ఏదైనా ఒక అంశం పేర్కొని.. నిర్దిష్ట పదాల్లో వ్యాసం రాయమని అడుగుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అభ్యర్థుల అకడమిక్ అర్హతలు, ఇతర స్కోర్లు పొందుపరిచే విధంగా దరఖాస్తు నమూనా ఉంటుంది. అయినప్పటికీ యూనివర్సిటీలు రెజ్యూమె లేదా సీవీని కూడా అప్లోడ్ చేయమంటున్నాయి. అభ్యర్థులు అకడమిక్ అర్హతలతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న తీరు, ప్రాజెక్ట్ వర్క్స్ వివరాలు తెలుసుకునేందుకే సమగ్ర రెజ్యూమెను అడుగుతున్నాయి. వీసాకు దరఖాస్తు అభ్యర్థులకు ప్రవేశం ఖరారైతే.. యూనివర్సిటీ ఇచ్చే కన్ఫర్మేషన్ లెటర్ ఆధారంగా ఇమిగ్రేషన్ విభాగంలో ఐ–20 ఫామ్‌ను పూర్తిచేసి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన ఇమిగ్రేషన్ విభాగం అధికారులు నిర్దేశిత తేదీల్లో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొచ్చేస్తామనే విధంగానే సమాధానాలు ఇవ్వాలి. అలాకాకుండా కోర్సు పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడాలనే ఉద్దేశం ఉందనే అభిప్రాయం కలిగేలా సమాధానమిస్తే.. వీసా మంజూరు కష్టమే. ఇలా.. యూనివర్సిటీల అన్వేషణ నుంచి వీసా ఇంటర్వ్యూ వరకు.. అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తేనే యూఎస్‌లో ఎంఎస్ కల సాకారం అవుతుంది. 201617 గణాంకాల ప్రకారం చదువుల కోసం అమెరికాకు పయనమైన వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య 10,78,822. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 1,86,267. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఎంఎస్. ఫీజులు.. 30 వేల నుంచి 50 వేల డాలర్లు అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎంఎస్ ప్రోగ్రామ్ ఫీజులు ఏడాదికి 30 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మధ్యలో ఉంటున్నాయి. ఇవి.. ఆయా యూనివర్సిటీల స్థాయి, అభ్యర్థులు ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటాయి. హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో చదవాలంటే ఏడాదికి కనీసం 50 వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే. అవసరమైన డాక్యుమెంట్లు అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ (విద్యార్హతల సర్టిఫికెట్లు). జీఆర్ఈ/జీమ్యాట్/టోఫెల్/ఐఈఎల్టీఎస్ తదితర టెస్ట్ స్కోర్లు. లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్ఓఆర్). స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ). వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్(బ్యాంక్ స్టేట్మెంట్). రెజ్యూమె/సీవీ. టాప్ యూనివర్సిటీలు ఎంఎస్ కోర్సు బోధనలో అమెరికాలో టాప్ యూనివర్సిటీల వివరాలు.. హార్వర్డ్ యూనివ్సిటీ ఎంఐటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ యూసీ–బర్కిలీ యూనివర్సిటీ ఆఫ్ షికాగో కార్నెల్ యూనివర్సిటీ యేల్ యూనివర్సిటీ -
మోసంలో చంద్రబాబుకు మాస్టర్ డిగ్రీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ప్రజాపాలనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొలమానంగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్కొన్నారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలనలో వివిధ పార్టీలకు వైఎస్ హయాం, వైఎస్ అనంతర కాలం అనే విధంగా చెప్పుకునేంత ప్రజారంజకంగా వైఎస్ పాలన కొనసాగిందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారు అడుగకుండానే ప్రజలకోసం వైఎస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిమానానికి పాత్రుడయ్యారన్నారు. అటువంటి నేత వారసునిగా రాజకీయాల్లోకి ప్రవేశించి అనతికాలంలోనే రాష్ట్ర ప్రజలపై తనదైన చెరగని ముద్ర వేసిన ఘనత తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం మాకొద్దు బాబోయ్ అని ప్రజలే అంటున్నారని, ఎన్నికల వాగ్దానాల అమలులో ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు విఫలమైన తీరుతో ప్రజలు తాము ఆయన చేతిలో మరోసారి మోసపోయామని గ్రహించారన్నారన్నారు. కాగా ఆదిలో సొంతమామను, అనంతరం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మోసపోయిన ప్రజలనే మళ్లీ మోసం చేయడంలో మాస్టర్ డిగ్రీ సాధించారని ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చకపోవడంతో టీడీపీపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, దానిని తమ పార్టీకి అనుకూలంగా మలచడానికి కృషి చేస్తామన్నారు. ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. వీరితో పార్టీ ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని అధ్యక్షత వహించగా, పార్టీ నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు, గ్రంధి శ్రీనివాస్, చీర్ల రాధయ్య, తలారి వెంకట్రావు, తోట గోపి, మరడాని రంగారావు, పుప్పాల వాసుబాబు, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొనగా పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాస్ సభకు ఆహ్వానం పలికారు. ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు వీరే.. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వందనపు సాయిబాల పద్మ, యువజన విభాగం అధ్యక్షునిగా పేరిచర్ల విజయ నరసింహరాజు, రైతు విభాగం అధ్యక్షునిగా ఆత్కూరు దొరయ్య, బీసీ విభాగం అధ్యక్షునిగా ఘంటా ప్రసాదరావు, ఎస్సీ విభాగం అధ్యక్షునిగా చెల్లెం ఆనందప్రకాష్, ఎస్టీ విభాగం అధ్యక్షునిగా కొవ్వాసి నారాయణ, మైనార్టీ విభాగ అధ్యక్షునిగా ఎండీ అస్లాం, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా కౌరు వెంకటేశ్వరరావు, లీగల్ సెల్ అధ్యక్షునిగా కామన బాల సత్యనారాయణ, డాక్టర్ల విభాగ అధ్యక్షునిగా పల్లాపు సత్యవేదం, విద్యార్థి విభాగం అధ్యక్షునిగా గుణ్ణం సుభాష్, పార్టీ జిల్లా కోశాధికారి, పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శిగా డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు జిల్లా క్రమశిక్షణ సంఘం సభ్యులుగా పోతుల రామతిరుపతిరెడ్డి, పటగర్ల రామ్మోహనరావు, ప్రసాద్ ప్రమాణం చేశారు. అలాగే పార్టీ జిల్లా అధికార ప్రతినిధులుగా పొలనాటి శ్రీనివాస్, గంపల బ్రహ్మావతి, కొఠారు రామచంద్రరావు, ముప్పిడి సంపత్‌కుమార్, మాజేటి సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు. హుద్‌హుద్ సహాయ నిధికి విరాళం హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయనిధికి పార్టీ కార్యకర్త సీహెచ్ఎన్వీ సత్యనారాయణ రూ.3 వేల నగదును ధర్మాన ప్రసాదరావుకు అందజేశారు.