ఎంఎస్ ఇన్ యూఎస్..! ఆ అవకాశం లభిస్తే.. భవిష్యత్తు బంగారుమయమనే భావన! దీనికోసం ఎన్నో ప్రయత్నాలు.. కోర్సు మూడో ఏడాది నుంచే కసరత్తు ప్రారంభం! ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రవేశం ఖరారయ్యేది మాత్రం కొద్ది మందికే! నిరుత్సాహానికి గురయ్యే వారెందరో!! ఇందుకు వర్సిటీల ఎంపిక నుంచి వీసా ఇంటర్వ్యూ వరకు.. కారణాలెన్నో! అమెరికాలో ఎంఎస్‌లో ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
భారతీయ విద్యార్థులకు స్టడీ అబ్రాడ్ పరంగా తొలి గమ్యం.. అమెరికా. మరి ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారు? అని అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం.. ఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్). ప్రఖ్యాత యూనివర్సిటీలకు నిలయమైన అమెరికా.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఏటా పది లక్షల మందికి పైగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. 2016–17 గణాంకాల ప్రకారం చదువుల కోసం అమెరికాకు పయనమైన వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య 10,78,822. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 1,86,267. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఎంఎస్.
ముందస్తు కసరత్తు
అమెరికాలో ఫాల్ (సెప్టెంబర్–డిసెంబర్), స్ప్రింగ్ (జనవరి–మే), సమ్మర్ (జూన్–ఆగస్ట్).. ఇలా మూడు సెషన్లలో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుంది. అధిక శాతం ప్రోగ్రామ్‌లు ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఫాల్ సెషన్‌లో జరుగుతాయి. విద్యార్థులు తాము చేరదలచుకున్న సెషన్‌కు కనీసం 15 నుంచి 18 నెలల ముందుగా కసరత్తు ప్రారంభించాలి. ముందుగా తమకు ఆసక్తి ఉన్న కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీల జాబితా రూపొందించుకోవాలి. ఆ యూనివర్సిటీలు పేర్కొన్న అర్హత నిబంధనలు, ప్రామాణిక టెస్ట్ స్కోర్‌ల కనీస స్కోరింగ్ వివరాలు తెలుసుకోవాలి. ప్రతి యూనివర్సిటీకి సంబంధించి దరఖాస్తు గడువు తేదీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి.
రోలింగ్ అడ్మిషన్స్
అమెరికాలో ఎర్లీ అడ్మిషన్స్ ప్లాన్, రెగ్యులర్ అడ్మిషన్, రోలింగ్ అడ్మిషన్.. అనే మూడు పద్ధతుల్లో దరఖాస్తు చేసుకునే వీలుంది. రోలింగ్ అడ్మిషన్స్ విధానంలో దరఖాస్తుకు ఎలాంటి గడువు తేదీ ఉండదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత సెషన్లలో సీట్లు భర్తీ కాని సందర్భాల్లో రోలింగ్ అడ్మిషన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఒక యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. రోలింగ్ అడ్మిషన్ సెషన్‌కు కూడా దరఖాస్తు చేసుకోవడం మంచిది.
అర్హత నిబంధనలు
ఎంఎస్ కోర్సుకు అమెరికాలోని యూనివర్సిటీల అర్హత నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. అధికశాతం యూనివర్సిటీలు మాత్రం 16 ఏళ్ల (10+2+4) ఎడ్యుకేషన్ విధానం ద్వారా పొందిన డిగ్రీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కొన్ని యూనివర్సిటీలు మాత్రం 10+2 తర్వాత మూడేళ్ల వ్యవధిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ప్రఖ్యాత యూనివర్సిటీలు (హార్వర్డ్,
ఎంఐటీ, యూసీ, కార్నెగీ మిలన్ తదితర) మాత్రం తప్పనిసరిగా 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారినే అర్హులుగా పేర్కొంటున్నాయి.
స్టాండర్డ్ టెస్ట్‌ల స్కోర్లు
మరో ముఖ్య అర్హత నిబంధన స్టాండర్డ్ టెస్ట్ స్కోర్లు. విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న డొమైన్ ఆధారంగా జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్ స్కోర్లు పొందడం తప్పనిసరి. అంతేకాకుండా జీఆర్‌ఈలో సబ్జెక్ట్ టెస్ట్
స్కోర్లను కూడా అక్కడి ప్రముఖ యూనివర్సిటీలు తప్పనిసరి చేస్తున్నాయి.
- జీఆర్‌ఈలో కనీసం 300 కుపైగా పాయింట్లు సొంతం చేసుకోవడం వల్ల అవకాశాలు మెరుగవుతాయి.
- జీమ్యాట్‌లో 650కు పైగా స్కోర్ ఉంటే ప్రవేశానికి మార్గం సుగమం అవుతుంది..
- టోఫెల్‌లో కనీసం 100 స్కోర్ సొంతం చేసుకుంటే టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది.
అకడమిక్ రికార్డ్
అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు పేర్కొంటున్న నిబంధనల ప్రకారం పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు 60 శాతం పైగా మార్కులు లేదా తత్సమాన జీపీఏతో ఉత్తీర్ణత తప్పనిసరి. హార్వర్డ్, ఎంఐటీ వంటి వర్సిటీల్లో ఎనిమిది జీపీఏ అవసరం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తాము ఎంపిక చేసుకునే యూనివర్సిటీల జాబితాను రూపొందించుకోవాలి.
టెస్ట్ స్కోర్‌తోపాటు మరెన్నో!
అకడమిక్‌గా అద్భుతమైన ఉత్తీర్ణత శాతాలు, టెస్ట్ స్కోర్లు ఉన్నతంగా ఉన్నప్పటికీ.. మరెన్నో అంశాలు అభ్యర్థుల ప్రవేశాన్ని నిర్దేశిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్‌ఓఆర్), స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌ఓపీ). కొన్ని సందర్భాల్లో అకడమిక్, టెస్ట్ స్కోర్లను సైతం కాదని ఎల్‌ఓఆర్, ఎస్‌ఓపీ ఆధారంగా ప్రవేశాలు పొందిన వారు సైతం ఉంటున్నారంటే వీటి ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
లెటర్ ఆఫ్ రికమండేషన్
అభ్యర్థుల సామర్థ్యాన్ని గుర్తిస్తూ సంబంధిత రంగంలోని నిపుణులైన వ్యక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలు.. లెటర్ ఆఫ్ రికమండేషన్. అభ్యర్థులు తాము చదువుకున్న యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ల నుంచి.. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ వారి ఉన్నతాధికారుల నుంచి లెటర్ ఆఫ్ రికమండేషన్ తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. తమ గురించి బాగా తెలిసిన వ్యక్తులతో ఈ సిఫార్సు లేఖలు పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలోని వర్సిటీలు ప్రస్తుతం కనీసం రెండు ఎల్‌ఓఆర్‌లను అడుగుతున్నాయి.
స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్
అమెరికాలో ఎంఎస్‌లో అడ్మిషన్ ఖరారు చేయడంలో అత్యంత కీలకమైంది స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్. అభ్యర్థులు అమెరికాలోని సదరు యూనివర్సిటీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు.. నిర్దిష్టంగా ఆ కోర్సునే ఎంపిక చేసుకోవడానికి కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అనే వివరాలు పేర్కొంటూ.. నిర్దేశిత పదాల్లో ఎస్‌ఓపీని సొంత మాటల్లో రాయాలి. దీన్ని యూనివర్సిటీకి సంబంధించిన అకడమిక్ నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో టెస్ట్ స్కోర్లు, అకడమిక్ పర్సంటేజీలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎస్‌ఓపీలో అభ్యర్థి పొందుపర్చిన సమాచారం, చూపిన నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎస్సే.. రెజ్యూమె సైతం
ఇటీవల కాలంలో అమెరికాలోని పలు యూనివర్సిటీలు.. ఎస్సే (వ్యాస రచన) రాయమని కోరుతున్నాయి. దరఖాస్తు సమయంలోనే ఏదైనా ఒక అంశం పేర్కొని.. నిర్దిష్ట పదాల్లో వ్యాసం రాయమని అడుగుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్లోనే జరుగుతుంది. అభ్యర్థుల అకడమిక్ అర్హతలు, ఇతర స్కోర్లు పొందుపరిచే విధంగా దరఖాస్తు నమూనా ఉంటుంది. అయినప్పటికీ యూనివర్సిటీలు రెజ్యూమె లేదా సీవీని కూడా అప్‌లోడ్ చేయమంటున్నాయి. అభ్యర్థులు అకడమిక్ అర్హతలతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న తీరు, ప్రాజెక్ట్ వర్క్స్ వివరాలు తెలుసుకునేందుకే సమగ్ర రెజ్యూమెను అడుగుతున్నాయి.
వీసాకు దరఖాస్తు
అభ్యర్థులకు ప్రవేశం ఖరారైతే.. యూనివర్సిటీ ఇచ్చే కన్ఫర్మేషన్ లెటర్ ఆధారంగా ఇమిగ్రేషన్ విభాగంలో ఐ–20 ఫామ్‌ను పూర్తిచేసి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన ఇమిగ్రేషన్ విభాగం అధికారులు నిర్దేశిత తేదీల్లో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొచ్చేస్తామనే విధంగానే సమాధానాలు ఇవ్వాలి. అలాకాకుండా కోర్సు పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడాలనే ఉద్దేశం ఉందనే అభిప్రాయం కలిగేలా సమాధానమిస్తే.. వీసా మంజూరు కష్టమే.
ఇలా.. యూనివర్సిటీల అన్వేషణ నుంచి వీసా ఇంటర్వ్యూ వరకు.. అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తేనే యూఎస్‌లో ఎంఎస్ కల సాకారం అవుతుంది.
- 201617 గణాంకాల ప్రకారం చదువుల కోసం అమెరికాకు పయనమైన వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య 10,78,822.
- వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 1,86,267. భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఎంఎస్.
ఫీజులు.. 30 వేల నుంచి 50 వేల డాలర్లు
అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎంఎస్ ప్రోగ్రామ్ ఫీజులు ఏడాదికి 30 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మధ్యలో ఉంటున్నాయి. ఇవి.. ఆయా యూనివర్సిటీల స్థాయి, అభ్యర్థులు ఎంపిక చేసుకున్న
స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటాయి. హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలంటే ఏడాదికి కనీసం 50 వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే.
అవసరమైన డాక్యుమెంట్లు
- అకడమిక్ ట్రాన్స్‌క్రిప్ట్స్ (విద్యార్హతల సర్టిఫికెట్లు).
- జీఆర్‌ఈ/జీమ్యాట్/టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ తదితర టెస్ట్ స్కోర్లు.
- లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్‌ఓఆర్).
- స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌ఓపీ).
- వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్
- ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్(బ్యాంక్ స్టేట్‌మెంట్).
- రెజ్యూమె/సీవీ.
టాప్ యూనివర్సిటీలు
- ఎంఎస్ కోర్సు బోధనలో అమెరికాలో టాప్ యూనివర్సిటీల వివరాలు..
- హార్వర్డ్ యూనివ్సిటీ
- ఎంఐటీ
- స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ
- యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
- కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ
- యూసీ–బర్కిలీ
- యూనివర్సిటీ ఆఫ్ షికాగో
- కార్నెల్ యూనివర్సిటీ
- యేల్ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment