
Photo Courtesy: CSK X
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటల్ని లిఖించుకున్న దిగ్గజ కెప్టెన్. రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన ఈ జార్ఖండ్ ‘డైనమైట్’.. తన ఆటతో పేరుప్రఖ్యాతులతో పాటు కోట్ల సంపదను ఆర్జించాడు.
టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. 43 ఏళ్ల తలా రిటైర్మెంట్‌పై ఎప్పటికప్పుడు వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తల్లిదండ్రులు కూడా చెపాక్ స్టేడియానికి రావడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది.
తొలిసారి స్టేడియానికి!
సాధారణంగా ధోని భార్య సాక్షి (Sakshi Singh), కూతురు జీవా (Ziva Dhoni) మాత్రమే స్టేడియానికి వచ్చి సందడి చేస్తూ ఉంటారు. కానీ ఈసారి అతడి తల్లిదండ్రులు కూడా రావడం ఆసక్తిని రేకెత్తించింది. అయితే, రిటైర్మెంట్‌పై నిర్ణయానికి ఇంకా పది నెలల సమయం ఉందంటూ ధోని వదంతులను కొట్టిపారేశాడు.

PC: CSK
ఇదిలా ఉంటే.. ధోని తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడడన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా రాజ్ షమానీ షోలో మాత్రం మొదటిసారి తన బాల్యం, తమ తండ్రి గురించి ధోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఆడంబరాలు లేవు
‘‘మేము చిన్నపిల్లలుగా ఉన్నపుడు జీవితంలో అభద్రతా భావం అన్న మాటకు మాకు అర్థం తెలియదు. రోజులు అలా గడిచిపోతూ ఉండేవి. ఉన్నంతలో దేనికీ లోటు లేకుండా మా తల్లిదండ్రులు చూసుకునేవారు. ఆడంబరాలు లేవు. ఫోన్లు వగైరా లాంటివేమీ లేవు.
అన్నయ్యతో పాటూ నేనూ అక్కడే
మా కాలనీలోనే స్కూల్ ఉండేది. టీచర్లంతా చుట్టుపక్కలే ఉండేవారు. కాబట్టి ఎల్లప్పుడూ గంభీర వాతావరణమే ఉండేది. బద్మాషీ వేషాలు వేసేందుకు ఆస్కారమే లేదు. మా అన్నయ్యకు నాకు వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరమూ ఒకే స్కూల్‌కు వెళ్లేవాళ్లం.
మా కుటుంబం గురించి టీచర్లందరికీ తెలుసు. అయితే, కాలనీలో ఆటలు మాత్రం బాగా ఆడేవాళ్లం. ఒకరోజు ఓడితే.. మరో రోజు గెలవాల్సిందే. అంతలా పట్టుదలకు పోయేవాళ్లం.
నాన్నంటే భయం.. కానీ
అయితే, నాన్నను చూస్తే మాత్రం నేను భయపడిపోయేవాడిని. ఆయన చాలా స్ట్రిక్ట్. క్రమశిక్షణతో ఉండేవారు. సమయపాలన ఎక్కువ. మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ కొట్టలేదు. తిట్టలేదు. కానీ ఆయనను చూస్తే చాలు భయం వేసేది.
బహుశా.. అది ఆయన మీద ఒకరకమైన గౌరవమే అనుకుంటా . మా దోస్తులు చెట్లు ఎక్కుతూ, గెంతుతూ అల్లరి చేసేవాళ్లు. కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆ పనిచేయలేదు. బయట ఉన్నపుడు మా నాన్న ఒక్క చూపు చూశారంటే.. అక్కడి నుంచి మాయమయ్యే వాడిని.
నిజానికి నాన్న ఏమీ అనేవారు కాదు. కానీ అంతే ఆయనంటే ఓ రకమైన భయం ఉండేది. ఆయన క్రమశిక్షణే నాకూ అలవడింది’’ అని ధోని తన మనసులోని భావాలు పంచుకున్నాడు.
కాగా ధోని ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 76 పరుగులే చేశాడు. ఇక ఈ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్.. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మేటి కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్‌కేకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ధోని కుటుంబం ఇదే
ధోని తల్లిదండ్రులు దేవకీ దేవి- పాన్ సింగ్. అన్న నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా. ధోని భార్య సాక్షి సింగ్ ధోని, కుమార్తె జీవా సింగ్ ధోని. ధోని తండ్రి ఉక్కు పరిశ్రమలో జూనియర్ మేనేజర్‌గా పనిచేసేవారు. తల్లి గృహిణి.
చదవండి: సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి: పంత్
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్
The loudest cheer, from the closest hearts! 💛#CSKvDC #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/upbKdG7DZe
— Chennai Super Kings (@ChennaiIPL) April 6, 2025