ఎంఎంటీసీ అధికారి రవిప్రసాద్ కూడా ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: బంగారం దిగుమతికి సంబంధించి మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎంటీసీ)ను మోసగించిన కేసులో ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ (ఎంబీఎస్) జ్యువెల్లర్స్ డెరైక్టర్ సుఖేష్‌గుప్తా, ఎంఎంటీసీ సీనియర్ మేనేజర్ రవిప్రసాద్‌లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం వీరిని సీబీఐ ప్రత్యేక కోర్టుల ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి ఎంవీ రమణనాయుడు ఎదుట హాజరుపర్చారు. ఆయన వీరిని జనవరి 9 వరకు జ్యుడీషియల్ రిమాం డ్‌కు తరలిస్తూ ఆదేశాలు జారీచేశారు. సీబీఐ వినతి మేరకు సుఖేష్‌గుప్తా, రవిప్రసాద్‌లను జనవరి 1 వరకు ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించారు.
రూ.194 కోట్లు నష్టం: ఎంఎంటీసీ
వ్యాపారులు బ్యాంకు గ్యారంటీనీ పూచీకత్తుగా సమర్పించి బంగారాన్ని ఎంఎంటీసీ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. బంగారం విలువకు అదనంగా 5 శాతం సెక్యూరిటీ మొత్తాన్ని కూడా చెల్లించాలి. ఎంబీఎస్ జ్యువెల్లర్స్ 2011 ఏప్రిల్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య ఎంఎంటీసీ నుంచి 5,813 కేజీల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 5 శాతం ముందస్తు సెక్యూరిటీ డిపాజిట్ చేయలేదు. దీనివల్ల ఎంఎంటీసీకి రూ.194 కోట్లు నష్టం జరిగిందని ఎంఎంటీసీ జీఎం టీఎస్ రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు.
ఎంఎంటీసీకి రూ.194 కోట్లు బకాయి ఉండగా రూ.43 కోట్లు మాత్రమే ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని, ఎంఎంటీసీ అధికారులు ఎంబీఎస్ జ్యువెల్లర్స్ యాజమాన్యంతో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. దీనిపై ఈ ఏడాది జనవరి 3న సీబీఐ కేసు నమోదు చేసింది. సుఖేష్‌గుప్తాతోపాటు 8 మంది ఎంఎంటీసీ అధికారులపై ఐపీసీ సెక్షన్ 120(బి), 409, 420, 471, 477(ఎ)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(డి) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 11 నెలల తర్వాత సుఖేష్‌గుప్తాను, రవిప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఎంఎంటీసీ జీఎం మోహన్‌రావుతోపాటు ఎంఎంటీసీ ఉన్నతాధికారులు కె.అనంతక్రిష్ణ, కేవీ ప్రకాష్, ఎ.విజయభాస్కర్, వై.రామభీమప్ప, ఎ.శరవణన్, ఎస్.ప్రశాంత్‌లతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులు, వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు.