Sukesh Gupta
-
MBS Jewellers: నిజాం నగల పెట్టెలు.. విడిపించాక పంచుకుందాం
సాక్షి, హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ నిర్వాహకుడు సుఖేష్ గుప్తపై మరో కేసు నమోదైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిజాం నగలను విడిపించి, పంచుకుందామంటూ నగరానికి చెందిన రాజేష్ అగర్వాల్ అనే వ్యక్తికి ఎర వేసి రూ.50.8 కోట్లు తీసుకుని మోసం చేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం నిరూపించడానికి అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. నిజాంకు చెందిన నగలతో కూడిన ఐదు బాక్సులు సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల కమిషనర్ ఆధీనంలో ఉన్నాయని, వీటిని విడిపిద్దామంటూ సుఖేష్ గుప్తా, మహ్మద్ జకీర్ ఉస్మాన్ అనే వ్యక్తితో కలిసి రాజేష్ అగర్వాల్‌ను సంప్రదించారు. నిజాం వారసుల నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) తీసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందంటూ నమ్మబలికారు. వారితో సంప్రదింపులు జరపడానికి, ఎన్ఓసీలు తీసుకోవడానికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుందంటూ రాజేష్‌ను నమ్మించారు. 5 నగల పెట్టెలు తమ చేతికి వచ్చాక పంచకుందామంటూ పత్రాలు సైతం రాసుకున్నారు. చదవండి: హైదరాబాద్‌లో ఒమిక్రాన్ గుబులు: ఆరుగురిలో నలుగురు చిక్కారు.. ఏ ఏరియా అంటే.. వీరి మాటలు నమ్మిన రాజేష్ ఆషిష్ రియల్టర్స్‌తో పాటు ఎంబీఎస్ జ్యువెలర్స్ సంస్థలకు ఆన్లైన్ ద్వారా రూ.50.8 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం తమ చేతికి వచ్చాక నిందితులు తనను మోసం చేశారంటూ బాధితుడు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో సుఖేష్ గుప్తతో పాటు జకీర్ ఉస్మాన్‌పైనా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఒమిక్రాన్ దడ, థర్డ్‌వేవ్ హెచ్చరిక.. ‘బూస్టర్’ వైపు పరుగులు.. -
ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేతకు ఈడీ షాక్
సాక్షి, హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేష్ గుప్తాకు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కోర్టు సోమవారం షాక్ ఇచ్చింది. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న సుకేశ్ గుప్తాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా పరారీలో ఉన్న సుఖేశ్ గుప్తా ఇండియా నుంచి దుబాయ్‌కి పారిపోయి తలదాచుకున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా 275 కోట్ల రూపాయల స్కాం లో సుకెష్ గుప్తా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై గతంలో సుఖేశ్ గుప్తాకు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేశారు. కాగా ఈడీ ఇచ్చిన సమన్లపై సుఖేశ్ గుప్తా హైకోర్టును ఆశ్రయించి స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ సుఖేశ్ గుప్తా పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అప్పటినుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న సుఖేశ్ గుప్తాకు ఈడీ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్ గుప్తాపై ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేడాది అక్టోబర్ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్‌ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గతేడాది డిసెంబర్లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్ ప్యాలెస్ వేలం వేయాలని ప్రయత్నించగా, నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిస్ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తిం చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుకేశ్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి, వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా రవిప్రకాశ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని సుకేశ్‌గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
ఎంబీఎస్ జ్యువెలరీ అధినేతపై ఛీటింగ్ కేసు
-
సానా సతీష్ ఈడీ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న హైదరాబాద్ పారిశ్రామికవేత్త సానా సతీష్‌బాబు కీలక విషయాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో ఉన్న లింకులపై సానా సతీష్ సమాచారం ఇచ్చారు. సానా సతీష్‌తో సంబంధం ఉన్న ప్రముఖులకు ఈడీ నోటీసులు అందించింది. వీరిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, నగల వ్యాపారి సుఖేష్ గుప్తా, ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్, వ్యాపార వేత్త చాముండిలకు ఉన్నారు. (చదవండి : అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌బాబు అరెస్ట్) మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సతీష్ నిందితుడిగా ఉన్నారు. 2013లో వజ్రాల వ్యాపారీ సుఖేష్ బెయిల్‌కోసం మాంసం వ్యాపారీ మొయిన్ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదయింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో సానా లావాదేవీలు నడిపినట్లు ఈడీ విచారణలో తేలింది. అంతే కాకుండా సుఖేష్ బెయిల్ కోసం షబ్బీర్ అలీ, ఖురేషీ, సానా సీబీఐ కార్యాలయానికి వెళ్లారని విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వారికి ఈడీ నోటీసులు అందించింది. సుఖేష్ గుప్తా కోసం లైజనింగ్ చేసిన ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా తనకు ఎలాంటి నోటీలులు అందలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. -
ఎంబీఎస్ జ్యువెల్లర్స్ డెరైక్టర్ సుఖేష్‌గుప్తా అరెస్ట్
ఎంఎంటీసీ అధికారి రవిప్రసాద్ కూడా ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీ సాక్షి, హైదరాబాద్: బంగారం దిగుమతికి సంబంధించి మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎంటీసీ)ను మోసగించిన కేసులో ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ (ఎంబీఎస్) జ్యువెల్లర్స్ డెరైక్టర్ సుఖేష్‌గుప్తా, ఎంఎంటీసీ సీనియర్ మేనేజర్ రవిప్రసాద్లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం వీరిని సీబీఐ ప్రత్యేక కోర్టుల ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఎంవీ రమణనాయుడు ఎదుట హాజరుపర్చారు. ఆయన వీరిని జనవరి 9 వరకు జ్యుడీషియల్ రిమాం డ్కు తరలిస్తూ ఆదేశాలు జారీచేశారు. సీబీఐ వినతి మేరకు సుఖేష్‌గుప్తా, రవిప్రసాద్లను జనవరి 1 వరకు ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించారు. రూ.194 కోట్లు నష్టం: ఎంఎంటీసీ వ్యాపారులు బ్యాంకు గ్యారంటీనీ పూచీకత్తుగా సమర్పించి బంగారాన్ని ఎంఎంటీసీ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. బంగారం విలువకు అదనంగా 5 శాతం సెక్యూరిటీ మొత్తాన్ని కూడా చెల్లించాలి. ఎంబీఎస్ జ్యువెల్లర్స్ 2011 ఏప్రిల్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య ఎంఎంటీసీ నుంచి 5,813 కేజీల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 5 శాతం ముందస్తు సెక్యూరిటీ డిపాజిట్ చేయలేదు. దీనివల్ల ఎంఎంటీసీకి రూ.194 కోట్లు నష్టం జరిగిందని ఎంఎంటీసీ జీఎం టీఎస్ రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఎంఎంటీసీకి రూ.194 కోట్లు బకాయి ఉండగా రూ.43 కోట్లు మాత్రమే ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని, ఎంఎంటీసీ అధికారులు ఎంబీఎస్ జ్యువెల్లర్స్ యాజమాన్యంతో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. దీనిపై ఈ ఏడాది జనవరి 3న సీబీఐ కేసు నమోదు చేసింది. సుఖేష్గుప్తాతోపాటు 8 మంది ఎంఎంటీసీ అధికారులపై ఐపీసీ సెక్షన్ 120(బి), 409, 420, 471, 477(ఎ)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(డి) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 11 నెలల తర్వాత సుఖేష్‌గుప్తాను, రవిప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఎంఎంటీసీ జీఎం మోహన్రావుతోపాటు ఎంఎంటీసీ ఉన్నతాధికారులు కె.అనంతక్రిష్ణ, కేవీ ప్రకాష్, ఎ.విజయభాస్కర్, వై.రామభీమప్ప, ఎ.శరవణన్, ఎస్.ప్రశాంత్‌లతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులు, వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. -
సుఖేష్ గుప్తాను విచారిస్తున్న సీబీఐ అధికారులు
హైదరాబాద్ : ఎంబీఎస్ జ్యూయలర్స్ అధినేత సుఖేష్ గుప్తాను శుక్రవారం సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 195 కోట్ల విలువైన బంగారం కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులు ఎగవేశారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. గత రాత్రి నుంచి కోఠీ సీబీఐ కార్యాలయంలో సుఖేష్ గుప్తాను అధికారులు విచారిస్తున్నారు. కోట్ల విలువైన బంగారం దిగుమతిలో అక్రమాలకు పాల్పడ్డాడని సుఖేష్ గుప్తా పై ఆరోపణలు ఉండగా, ఈ కేసులో సుఖేష్ గుప్తా ఏ-1గా ఉన్నారు. సుఖేష్ గుప్తాపై ఈ ఏడాది జనవరిలోనే కేసు నమోదైంది. ఆయనపై ఐపీఎస్ 420, 409తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఆయనకు సహకరించారనే ఆరోపణలపై ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీకి చెందిన ఐదుగురు ఉన్నతాధికారులను కూడా సీబీఐ విచారిస్తోంది. వీళ్లందరి ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మొత్తం 100 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టు సీబీఐ గుర్తించింది. వీళ్లను అరెస్టు చేసే అవకాశం ఉంది. తప్పుడు డిపాజిట్లు, బ్యాంకు గ్యారెంటీ ద్వారా ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు సీబీఐ గుర్తించింది. ఇక ప్రభుత్వరంగ స్వర్ణ విక్రయ సంస్థ అయిన ఎంఎంటీసీ (మినరల్స్, మైన్స్ ట్రేడింగ్ కార్పొరేషన్)కి బంగారం కొనుగోళ్లలో పన్ను చెల్లింపులకు సంబంధించి ఎంబీఎస్ జ్యూయలర్స్ కుచ్చుటోపీ పెట్టింది. అరువు బేరం మీద దాని నుంచి టన్నుల కొద్ది బంగారాన్ని కొనుగోలు చేసి.. రూ. 194 కోట్ల మేరకు ముంచింది. బీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సుఖేష్ గుప్తా, ఎంఎంటీసీ ఉద్యోగులు కలిసి సాగించిన ఈ అక్రమాలపై ఎంఎంటీసీ... సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఐపీసీ 120-బీ రెడ్‌విత్ 409, 420, 471, 477 ఏ సెక్షన్లతోపాటు అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి.. సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.