సుఖేష్ గుప్తాను విచారిస్తున్న సీబీఐ అధికారులు
హైదరాబాద్ : ఎంబీఎస్ జ్యూయలర్స్ అధినేత సుఖేష్ గుప్తాను శుక్రవారం సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 195 కోట్ల విలువైన బంగారం కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులు ఎగవేశారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. గత రాత్రి నుంచి కోఠీ సీబీఐ కార్యాలయంలో సుఖేష్ గుప్తాను అధికారులు విచారిస్తున్నారు. కోట్ల విలువైన బంగారం దిగుమతిలో అక్రమాలకు పాల్పడ్డాడని సుఖేష్ గుప్తా పై ఆరోపణలు ఉండగా, ఈ కేసులో సుఖేష్ గుప్తా ఏ-1గా ఉన్నారు.
సుఖేష్ గుప్తాపై ఈ ఏడాది జనవరిలోనే కేసు నమోదైంది. ఆయనపై ఐపీఎస్ 420, 409తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఆయనకు సహకరించారనే ఆరోపణలపై ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీకి చెందిన ఐదుగురు ఉన్నతాధికారులను కూడా సీబీఐ విచారిస్తోంది. వీళ్లందరి ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మొత్తం 100 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టు సీబీఐ గుర్తించింది. వీళ్లను అరెస్టు చేసే అవకాశం ఉంది. తప్పుడు డిపాజిట్లు, బ్యాంకు గ్యారెంటీ ద్వారా ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు సీబీఐ గుర్తించింది.
ఇక ప్రభుత్వరంగ స్వర్ణ విక్రయ సంస్థ అయిన ఎంఎంటీసీ (మినరల్స్, మైన్స్ ట్రేడింగ్ కార్పొరేషన్)కి బంగారం కొనుగోళ్లలో పన్ను చెల్లింపులకు సంబంధించి ఎంబీఎస్ జ్యూయలర్స్ కుచ్చుటోపీ పెట్టింది. అరువు బేరం మీద దాని నుంచి టన్నుల కొద్ది బంగారాన్ని కొనుగోలు చేసి.. రూ. 194 కోట్ల మేరకు ముంచింది.
బీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సుఖేష్ గుప్తా, ఎంఎంటీసీ ఉద్యోగులు కలిసి సాగించిన ఈ అక్రమాలపై ఎంఎంటీసీ... సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఐపీసీ 120-బీ రెడ్‌విత్ 409, 420, 471, 477 ఏ సెక్షన్లతోపాటు అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి.. సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.