కస్తూరిబాలో ఆకలి కేకలు | meal goods not supply to kasturba gandhi school | Sakshi
Sakshi News home page

కస్తూరిబాలో ఆకలి కేకలు

Published Mon, Jan 27 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

meal goods not supply to kasturba gandhi school

సంతమాగులూరు, న్యూస్‌లైన్:  పేద కుటుంబాల్లోని బాలికలను విద్యావంతులు చేయాలనే  లక్ష్యంతో  ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల లక్ష్యం అటకెక్కుతోంది. సంతమాగులూరు మండలం పత్తేపురం హిందూ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న  కస్తూరిబా పాఠశాలలోని విద్యార్థినులకు సక్రమంగా భోజనం పెట్టకపోవడంతో వారు ఇంటిదారి పడుతున్నారు.

 సంతమాగులూరులో 2011లో కేజీబీవీని అద్దెభవనంలో ప్రారంభించారు. అక్కడ విద్యార్థినులకు కనీస వసతులు కూడా లేకపోవడంతో  2013 లో ఈ పాఠశాలను పత్తేపురం హిందూ ప్రాథమిక పాఠశాలలోకి మార్చారు. పాఠశాల మార్చిన తరువాత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి 185 మందికి చేరింది. కేజీబీవీలకు మహిళా అధ్యాపకులే ఎస్‌ఓలుగా పనిచేయాలనే నిబంధన రావడంతో 2012 నవంబర్‌లో కొరిశపాడు మండలం తిమ్మాయపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మణమ్మ సంతమాగులూరు కేజీబీవీ ఎస్‌ఓగా బాధ్యతలు చేపట్టారు.

 అప్పటి నుంచి అరకొర వసతులతో పాఠశాల నిర్వహిస్తూ వచ్చారు. 2013 విద్యా సంవత్సరంలో కేజీబీవీలకు ఎస్‌ఓలుగా కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అప్పటి నుంచి తనను ఎక్కడ బాధ్యతల నుంచి తొలగిస్తారోనని ఎస్‌ఓ మణమ్మ సిబ్బంది వేతనాలు సకాలంలో చెల్లించకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చారు. గత సెప్టెంబర్ నుంచి ఐదు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. విద్యార్థుల మెనూను కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. రోజూ ఆహారంలో ఇవ్వాల్సిన కోడిగుడ్డు ఇవ్వక మూడు నెలలైంది.

 ఉదయం పూట అల్పాహారం మానేసి కూడా మూడు నెలలు దాటింది. మజ్జిగ పోయక రెండు నెలలు. సాయంత్రం వేళ ఇవ్వాల్సిన ఫలాల విషయం వీరికి అసలు తెలియదు. భోజనంలోకి కూరలు లేక పోవడంతో బాలికలు ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న పచ్చళ్లతో, కారంతో సరిపెట్టుకుంటున్నారు. బియ్యం ఉన్నా కూరలకు మాత్రం ఎస్‌ఓ తగినంత డబ్బు ఇవ్వక పోవడంతో  రెండు మూడు రోజులకు ఒక కూర చేస్తూ వంటవారు తమ పని ముగిస్తున్నారు. ఒక్కో రోజు వంటవారు అన్నం మాత్రం వండుతుండటంతో పచ్చళ్లు వేసుకుని తిని కడుపునింపుకోవాల్సి వ స్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ ఆకలి కేకలు తెలిసిన బాలికల తల్లిదండ్రులు వారిని పాఠశాల మాన్పించి వేస్తుండటంతో 185 మంది పిల్లలకు గాను సంక్రాంతి తరువాత 70 మంది మాత్రమే తిరిగి పాఠశాలకు వచ్చారు.  

 నిధులు లేకే ఇబ్బందులు... ఎస్‌ఓ మణమ్మ, ఎస్‌ఓ
 బడ్జెట్ రాకనే ఇబ్బందులు పడుతున్నా. పాఠశాలలో అంతగా ఇబ్బందులేమీలేవే .  జీతాలకు సంబంధించి సెప్టెంబర్ నిధులు వచ్చినా సిబ్బందికి ఇంకా ఇవ్వలేదు. వాటిని సోమవారంలోగా చెల్లిస్తాను. ప్రభుత్వం నుంచి మూడు నెలలకు  1.50 లక్షలు రావాల్సి ఉంది. పిల్లల ఆహారానికి సంబంధించిన నిధులు ఐదు నెలలకు  4 లక్షలు రావాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement