► మానమ్మ హత్యకేసును ఛేదించిన పోలీసులు
► నగల కోసమే బీరు బాటిల్‌తో పొడిచి హత్య
కొందుర్గు: మానమ్మను హత్యచేసిన నిందితుడిని ఫోన్ డేటా ఆధారంగా గుర్తించిన పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 21న మంగన్నగారి మానమ్మ(45) మృతిచెందగా పర్వతాపూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు షాద్‌నగర్ రూరల్ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం... పర్వతాపూర్ గ్రామానికి చెందిన మంగన్నగారి మానమ్మ, అదే గ్రామానికి చెందిన కొంగ రామ్‌రెడ్డి(25) పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా రామ్‌రెడ్డి కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు.
ఈ నెల 19న సాయంత్రం మానమ్మ కొందుర్గు స్వామి వద్దకు వెళ్లొస్తానని ఇంటి నుంచి బయలుదేరింది. ఇరువురు కలిసి కొందుర్గుకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి, ఓ కల్లు ప్యాకెట్, బీరుబాటిల్ వెంటతెచ్చుకున్నారు. ఇంటికి తిరిగి వస్తూ పర్వతాపూర్ శివారులో కూర్చొని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న మానమ్మ ఒంటిపై బంగారు పుస్తెలతాడు, కమ్మలు, వెండి పట్టీలు ఉండటంతో ఆ భరణాలపై ఆశపడ్డ రామ్‌రెడ్డి బీరు బాటిల్ పగలగొట్టి మానమ్మ కడుపులో పొడిచాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను లాక్కున్నాడు. మాన మ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగానే ఆమెను ఎత్తుకొని గ్రామశివారులోని పాడుబడి న బావిలో పడేశాడు.
కాల్ డేటాతో నిందితుడి గుర్తింపు
మానమ్మ ఫోన్ కాల్స్ డాటా ఆధారంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గురుప్రసాద్, కృష్ణ నింది తుడి ఆధారాలు సేకరిస్తుండగా తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న రామ్‌రెడ్డి సోమవారం గ్రామ రెవెన్యూ అధికారిణి జయమ్మ ఎదుట లొంగిపోయాడు. దీంతో జయమ్మ నిందితుడిని పోలీసులకు అప్పగించా రు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, లింగం పాల్గొన్నారు.