‘అనగాని' ఇదేందయ్యా !
ఓ వైపు ప్రకృతి..మరో వైపు టీడీపీ పాలకులు రైతులను కష్టాల పాలుజేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు లేక ఆలస్యంగా సాగు చేపట్టిన రైతు అడుగడుగునా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. తీరా పంట పక్వానికి చేరుతున్న దశలో యూరియా లభ్యంకాక ఆందోళనకు గురవుతున్నాడు. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన సహకార పరపతి సంఘాలు సైతం ప్రజాప్రతినిధుల పంచన చేరి రైతులను వంచన చేస్తున్నాయి.
రైతులకు అందించాల్సిన యూరియా బస్తాలను దాచేస్తున్నాయి. ఎరువు కోసం వెళ్లిన రైతులకు ఒట్టి చేతులు చూపుతున్నాయి. ఓ చోటైతే ఏకంగా.. ఎమ్మెల్యేగారి కోసమే లోడు తెచ్చాం... మీరిక వెళ్లండంటూ యూరి యా కోసం క్యూలో నిలుచున్న రైతులను సొసైటీ అధ్యక్షుడు కసురుకున్న సంఘటన బుధవారం ఇసుకపల్లిలో చోటు చేసుకుంది. రైతులను కాదని యూరియా బస్తాలను ఏం చేసుకుంటారో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమాధానం చెప్పాలి..! - రేపల్లె
రేపల్లె: టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రేపల్లె. ఇసుకపల్లి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కూడా పట్టణ పరిధిలోనే ఉంటుంది. బుధవారం ఉదయం యూరియా వచ్చిందన్న కబురు అందడంతో రైతులంతా సొసైటీ వద్దకు చేరుకున్నారు. అయితే సొసైటీ అధ్యక్షుడు దాసరి నాగరాజు మాటలు రైతులను బాధించాయి.‘ఎమ్మెల్యేగారికి ఒక లోడు, రైతులకు ఒక లోడు అందిస్తున్నాం. ప్రస్తుతం ఒక్క బస్తా కూడా యూరియా లేదు. మీరు గొడవ చేస్తే యూరియా తెప్పించను’ ఇలా రైతులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేకి యూరియా కేటాయించటం ఏంటి, ఇంతకు ముందు ఇలా జరగలేదుగదా, ఎరువుల విషయంలో రాజకీయాలేంటి, ఉన్న లోడు(400 బస్తాలు) అందించాలని రైతులు ఎంత కోరినా సొసైటీ అధ్యక్షుడు అంగీకరించకపోగా ‘యూరియా తెప్పించను’ అంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నా ఫలితం లేకపోవటంతో ‘అనగాని ఇదేందయ్యా’ అనుకుంటూ రైతులు వెనుతిరిగారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా యూరియాను ట్రాక్టర్‌లపై తరలించారు.
డిమాండ్‌తో అధిక ధరలకు...
యూరియాకు డిమాండ్ ఏర్పడటంతో బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు జోరందుకున్నాయి. సొసైటీల నుంచి వచ్చిన యూరియానే బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
పంట పక్వానికి చేరుతూ చివరి దశలో ఉన్న తరుణంలో యూరియా అందించకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న రైతులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.
సొసైటీలలో రూ. 290కు లభించే యూరియా బస్తా బ్లాక్ మార్కెట్‌లో రూ. 330 నుంచి రూ. 360 వరకు చెపుతున్నారు.
రైతుల కోసం సొసైటీలు తీసుకువస్తున్న యూరియాను ఎమ్మెల్యే పేరు చెప్పి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియాను రైతులకు సక్రమంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
యూరియూ పంపిణీలోనూ రాజకీయూలా..?
ఎన్నడూ లేనివిధంగా యూరియా అందించడంలో రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బందుల పాలు చేయడం సరైన విధానం కాదు. ఎమ్మెల్యేకి లోడు కేటాయిస్తున్నామని చెబుతూ యూరియాను తరలించడం ఏమిటి? రైతులకు యూరియా అందించడంలో ఇప్పటికైనా రాజకీయాలు మానుకుని సక్రమంగా పంపిణీ చేయాలి.
- జి.శ్రీనివాస్, సొసైటీ డెరైక్టర్
400 బస్తాలున్నా.. లేదంటారేం..?
నాలుగు రోజులుగా యూరియా కోసం రావడం...ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడం... పంట చివరి దశలో యూరియా అందించకపోతే దిగుబడి తగ్గింది. సొసైటీలో 400 బస్తాలు ఉన్నా ఒక్క రైతుకు కూడా అందించకుండా యూరియాను ఎక్కడికి తరలిస్తున్నారు. ఇప్పటికైనా యూరియా సక్రమంగా అందించాలి.
- శ్రీను, రైతు, ఇసుకపల్లి