విశాఖపట్నం: జిల్లాలో తూనికలు కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. అక్రమ వ్యాపారాలపై కన్నెర్రజేసింది. వరుస దాడులతో హడలెత్తిస్తోంది. ఇటీవల విశాఖలోని ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణాలు, జిల్లావ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులపై దాడులు చేపట్టింది.
పెట్రోల్ బంకుల్లో మోసాలను బయటపెట్టింది. ఇదే ఉత్సాహంతో మరిన్ని తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో కోట్లలో భారీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన వేబ్రిడ్జిల అంతుతేల్చడానికి కసరత్తు చేస్తోంది. లోడ్లతో వచ్చే వాహనాల్లో సరకును అవసరం మేరకు ఎక్కువ, తక్కువ చూపిస్తూ ఇవి కోట్లు గడిస్తున్న విషయాన్ని గ్రహించి వీటిపై దాడులకు సన్నద్ధమవుతోంది.
ఆహార పదార్ధాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు, పెట్రోల్ బంకులు..ఇలా బరువుతో తూచే ఏ విషయంలోనైనా అక్రమాలు జరిగితే దాన్ని అరికట్టాల్సిన బాధ్యత తూనికలు కొలతలశాఖ అధికారులది. కానీ జిల్లాలో మాత్రం ఈ శాఖకు సంబంధించిన విషయాల్లో అనేక అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు ఇప్పటి వరకు చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు క్రమాలకు పాల్పడుతున్నారు.
ఈ శాఖ అధికారులు ఇటీవల నగరంలో అయిదు బ్రాండెడ్ బంగారు ఆభరణాల దుకాణాలపై వరుసగా దాడులు చేశారు. తూనికలు కొలతల్లో మోసాలను గుర్తించి 15 కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులపై దాడులు నిర్వహించారు. మొత్తం ఏడు కేసులు నమోదు చేసి, 26 పంపులు సీజ్ చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా కలవరం మొదలైంది.
వరుస దాడుల నేపథ్యంలో ఊపుమీద ఉన్న ఈ శాఖ అధికారులు త్వరలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 300 వేబ్రిడ్జిలపై దాడులకు కసరతు ్తచేస్తున్నారు. వాస్తవానికి ఈ వేబ్రిడ్జిల్లో ఏటా కోట్లలో అవినీతి జరుగుతోంది. ఉక్కు, ఆహార పదార్థాలు ఇలా రకరకాల సరకుల లోడుతో వెళ్లే వాహనాల బరువును తూచే ఈ వేబ్రిడ్జిలు తూకాల్లో భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ బ్రిడ్జిల్లో కొనేవి, అమ్మేవి రెండు రకాలు ఉండగా, వీటిలో చిన్నతరహా సంస్థల్లో మాత్రం అవినీతి దారుణంగా ఉంటోంది. వస్తువులు, సరకు కొనే వేబ్రిడ్జిలు తక్కువ తూకం చూపిస్తూ మోసం చేస్తే...విక్రయించే వేబ్రిడ్జిలు ఎక్కువ తూకాలతో వినియోగదారులు, వ్యాపారులను మోసం చేస్తున్నాయి. తద్వారా ఏటా కోట్లలో సొమ్ములు వెనకేసుకుంటున్నాయి.
అక్రమాలను గుర్తించిన అధికారులు త్వరలో నగర, గ్రామీణ జిల్లాల్లో దాడులకు సమాయత్తమవుతున్నారు. గాజువాక, గోపాలపట్నం, పరవాడ, పెందుర్తి, భీమిలి, అనకాపల్లి తదితర చోట్ల ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించారు.
ఇటీవల పెట్రోల్ బంకులపై దాడులు చేసిన అధికారులు మరో రెండు నెలల్లో మలివిడత తనిఖీలు చేయాలని నిర్ణయించారు. లోపాలున్న బంకులు రెండు నెలల్లోగా సరిదిద్దుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అప్పటికీ సరిదిద్దుకోని బంకుల సంగతి చూడాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కేసులు నమోదు చేసిన బంకుల విషయంలో కేసు తీవ్రత దృష్ట్యా త్వరలోనే వీటికి జరిమానా విధించనున్నారు. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడకూడదని భావిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో ఈ శాఖకు సరిపడా పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఫలితంగా తరచూ దాడులు జరగడంలేదు. మొత్తం 29 కీలక పోస్టులకు గాను ఏడుకుపైగా ఖాళీగా ఉన్నాయి. అయిదుగురు జిల్లా ఇన్‌స్పెక్టర్లు అవసరమైతే రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్లకు ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్లను నియమించారు. ఫలితంగా అక్కడ ఆకస్మిక తనిఖీలు, దాడులు మొక్కుబడిగానే ఉంటున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ తర్వాత అత్యధిక వ్యాపార లావాదేవీలు జరిగే విశాఖకు అదనపు సిబ్బంది అవసరం. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమర్థవంతంగా ఈ శాఖ పనిచేయడానికి ఇబ్బందులు పడుతోంది.