సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ పేరిట సీఎం కిరణ్ సర్కార్ చేస్తున్న కుట్రలకు నిరసనగా జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లా బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో జన జీవనం స్తంభించింది. ఈ సందర్భంగా తెలంగాణవాదులు కదం తొక్కారు. ఊరూరా సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రధాన రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. పటాన్‌చెరు, బొల్లారం పారిశ్రామిక వాడల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. తెల్లవారుఝాము నుంచే టీజేఏసీ, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీతోపాటు విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌ను విజయవంతం చేసేందుకు కదిలాయి.
ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణ వాదులు బైఠాయించారు. కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఏడు డిపోల పరిధిలో 570 బస్సులు నిలిచిపోయాయి. దుబ్బాక డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణవాదులతోపాటు బైఠాయించారు. జిల్లా మీదుగా నడిచే ఇతర రాష్ట్ర సర్వీసులు కూడా రద్దయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు, ఆర్‌సీ పురంలో కూడా సిటీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 44వ నంబరు జాతీయ రహదారిపై మనోహరాబాద్, రామాయంపేట, 65వ నంబరు జాతీయ రహదారిపై ఇస్నాపూర్, రాజీవ్ రహదారిపై కొడకండ్ల, దుద్దెడలో రాస్తారోకో చేశారు. నాందేడ్ అకోలా రహదారిపై జోగిపేట, మాసాన్‌పల్లి, పెద్దశంకరంపేటలో తెలంగాణవాదులు బైఠాయించారు. మెదక్‌లో ఇద్దరు యువకులు టవర్ ఎక్కి సీఎం, డీఐజీని తప్పించాలంటూ నిరసన వ్యక్తం . పటాన్‌చెరు, పాశమైలారం, బొల్లారం పారిశ్రామిక వాడల్లో యాజమాన్యాలు బంద్‌ను పాటించాయి.
ర్యాలీలు, మానవహారాలు..
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టీజేఏసీ, టీఎన్జీఓస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, టీజేఏసీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్, టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్‌తోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమాన్ని సిబ్బంది బహిష్కరించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట సిబ్బంది రాస్తారోకో చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మెదక్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ సంయుక్తంగా మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించాయి. జహీరాబాద్‌లో అన్ని పార్టీల ఆధ్వర్యంలో తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్, గజ్వేల్, నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ వాదులు ర్యాలీలు నిర్వహించడంతోపాటు మానవహారాలు నిర్మించారు. బంద్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఎస్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
జిల్లా బంద్ సంపూర్ణం
Published Sun, Sep 8 2013 3:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement