రాజంపేట : కడప–రేణిగుంట జాతీయరహదారిలో అధికంగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతోందని భావించి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నా«థ్‌రెడ్డి హయాంలో రాజంపేట పెద్దాసుపత్రికి ట్రామాకేర్‌సెంటర్ మంజూరు చేయించారు. దీనిని ఇటీవల సీఎం ప్రారంభించారు. అయితే అది క్షతగాత్రులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారికి సకాలంలో చికిత్స అందకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
సంఘటన ఇలా..
ఆదివారం పెనగలూరు మండలంలోని ఈటమార్పురం గ్రామానికి చెందిన శివరాజు కుమార్తె భవ్యశ్రీ బంధవులతోకలిసి అవ్వగారి ఊరైన రాజంపేట మండలంలోని ఊటుకూరు వచ్చింది. గంగమ్మకు మొక్కులు తీర్చుకొని బంధువులతో కలిసి రోడ్డుపై వెళుతుండగా కారు ఢీకొనడంతో
తీవ్రంగా గాయపడింది. స్థానికులు బైకుమీద ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అందుబాటులేకపోవడంతో డ్యూటీ వైద్యురాలు సుమతికి ఫోన్‌చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.ఇంటివద్దకు వెళ్లి ఆమెను తీసుకొచ్చేలోపే చిన్నారి మృత్యుఒడికి జారుకుంది. సకాలంలో వైద్యం అందకపోవడంవల్లే ఇలా జరిగిందని బంధువులు ఆగ్రహించారు. ఆందోళనకు దిగారు.
ఆకేపాటి ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పట్టణ కన్వీనరు పోలా శ్రీనువాసులరెడ్డి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నిర్వహణతీరుపై పెదవి విరిచారు. చిన్నారు మృతికి కారకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధానకార్యదర్శి ఈశ్వరయ్య, బీసీవిభాగం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్, నాయకులు గోవిందుబాలకృష్ణ, రేవరాజు శ్రీనువాసరాజు, జావిద్‌అలీ పాల్గొన్నారు. సీఐ సూర్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. సీఐతో ఆకేపాటి చర్చించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు మన్నూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ వినోద్ తెలిపారు.
దిగజారుతున్న పెద్దాసుపత్రి పరువు
రాజంపేటలో ఉన్న వైద్య విధానపరిషత్ ఏరియా ఆసుపత్రి పరువు రోజురోజుకు దిగజారిపోతోంది. 50పడకల ఆసుపత్రిగా ఉన్న పెద్దాసుపత్రిలో ట్రామాకేర్‌సెంటర్, ఓపీబ్లాక్‌ను ఇటీవల జిల్లాకు సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. అయితే పూర్తి స్ధాయిలో పేదలకు వైద్యసేవలు అందించడంలో విఫలమైందన్న ఆరోపణలను మూటగట్టుకుంది.
హెడ్‌క్యార్టర్స్‌లో లేని వైద్యులు..
ఈ ఆసుపత్రికి సంబంధించి వైద్యులు స్ధానికంగా లేకపోవడం వల్ల పేదలకు వైద్యసేవలు సరిగా అందడంలేదు. ఇన్‌చార్జి సూపరిండెంట్‌గా ఉన్న వైద్యుడు ఒకరు సమయపాలన పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ పనిచేయడంలేదు. కొందరు వైద్యులు రావల్సిన సమయంలో కాకుండా ఇష్టం వచ్చినట్లు వస్తున్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలో ఈ ఆసుపత్రి ఉంది. అత్యవసర సమయంలో సరిగా చికిత్స అందడంలేదని బాధితులు వాపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం,నిర్వహణ అధ్వానం ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment