ఏపీలో మెడికల్ వెబ్ ఆప్షన్లకు బ్రేక్ | MedicalWeb options Break in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో మెడికల్ వెబ్ ఆప్షన్లకు బ్రేక్

Published Thu, Jul 28 2016 2:32 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

MedicalWeb options Break in AP

తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ప్రభావం..
తెలంగాణ ఎంసెట్-2పై స్పష్టత వచ్చాకే నిర్ణయానికి అవకాశం
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. వాస్తవానికి ఈ నెల 29, 30 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నిర్వహించి 31వ తేదీలోగా సీట్లు కేటాయించి.. ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు వాయిదా వేశారు. స్థానికేతర కోటా విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్న దృష్ట్యా వారీ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఆ ఇబ్బంది రాకూడదనే..: రాష్ట్రం విడిపోయినప్పటికీ.. విభజన చట్టం ప్రకారం నాన్‌లోకల్ అన్‌రిజర్వుడ్(15శాతం) మెరిట్ సీట్లకోసం తెలంగాణకు చెందిన విద్యార్థులు ఏపీలో పోటీపడవచ్చు. అలాగే ఏపీ అభ్యర్థులు తెలంగాణలో పోటీ పడవచ్చు. అయితే లీకేజీ నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్-2ను రద్దు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా తెలంగాణలో మళ్లీ పరీక్ష నిర్వహించి.. ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతటినీ యుద్ధప్రాతిపదికన నిర్వహించడానికైనా ఎంత కాదన్నా 20 రోజులకు తక్కువ కాదని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను నిర్వహిస్తే.. సాధారణంగా తెలంగాణ అభ్యర్థులు అన్‌రిజర్వుడ్ సీట్లకు ఆప్షన్లు పెట్టి బ్లాక్ చేస్తారు. తరువాత కొన్నిరోజులకు తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే అన్‌రిజర్వుడ్ కింద ఆప్షన్లు పెట్టుకున్న ఈ అభ్యర్థులు తెలంగాణలో లోకల్(85శాతం) కోటా కింద ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందేందుకు మొగ్గుచూపుతారు. ఈ క్రమంలో ఏపీలో తెలంగాణ అభ్యర్థులు సీట్లు బ్లాక్ చేయడంవల్ల గందరగోళ పరిస్థితి ఎదురవుతుందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు ఆలోచనలో పడ్డారు. దీంతో కొద్దిరోజులపాటు వేచిచూడాలనే అభిప్రాయానికి వారు వచ్చారు. తెలంగాణ ఎంసెట్-2పై స్పష్టత వచ్చాకే ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియపై వారు నిర్ణయం తీసుకునే వీలుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement