సూర్యాబాగ్ మీసేవకేంద్రం ఆవరణలో నిరసన ప్రదర్శన చేస్తున్న ఆపరేటర్లు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న మీసేవ కేంద్రాల సిబ్బంది మరోసారి సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గతంలో ఆందోళన చేపట్టిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు విశాఖ జిల్లాలో సోమవారం మీసేవ కేంద్రాలు మూతపడ్డాయి. బంద్‌లో భా గంగా చినవాల్తేరు, ఆర్‌కేబీచ్, ఆరిలోవ, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, జ్ఞానాపురం, మాధవధార, బుచ్చిరాజుపాలెం, గాజువాక, చిన,పెద గంట్యా డ, తగరపువలస, అనకాపల్లి ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు మూతపడ్డాయి. ఫలితంగా పలు రకాల పన్నులు, బిల్లుల చెల్లింపు కోసం వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.మీసేవ కేంద్రాల నిర్వహణ చూసే రామ్ ఇన్ఫో సంస్థ ఇప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వకపోయినా కార్మికశాఖ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ మీసేవలు కిటకిట
కాగా, ప్రభుత్వ మీసేవకేంద్రాలు బంద్ కారణంగా నగరంలో,జిల్లాలోనూ ప్రైవేట్ మీసేవ (ఏపీఆన్‌లైన్) కేంద్రాలు ప్రజలతో కిటకిటలాడాయి. జీవీఎంసీ పన్నులు, ఆర్టీఏ పన్నులు, విద్యుత్‌బిల్లులు, తహసీల్దార్ ధ్రువపత్రాలు వంటి సేవల కోసం ప్రజలు ప్రైవేట్ మీసేవ కేంద్రాలను ఆశ్రయించారు. ఇంటిపన్నులు చెల్లించే నెల కావడంతో ప్రభుత్వ మీసేవ కేంద్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది.
ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో 2003 లో మీసేవలు ప్రారంభం కావడం తెలిసిందే. విశాఖలో మీసేవ కేంద్రాలను రామ్‌ఇన్ఫో సంస్థ 2015 సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. గత సంస్థ మాదిరిగానే ఈ సంస్థ కూడా ఇప్పటికీ నియామక పత్రాలు అందజేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా, మేనేజర్లు నుంచి రూ.50 వేలు, ఆపరేటర్ల నుంచి 25వేలు వంతున సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకున్నా రశీదులు మాత్రం ఇవ్వలేదని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ డిపాజిట్లు వాపసు చేయాలని కార్మికశాఖ సమక్షంలో డిమాండ్‌చేసినా ఫలితం లేకపోయింది.
గడువు పొడిగింపు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఈనెల 16వ నుంచి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న మీసేవ కేంద్రాలను ఏపీటీఎస్ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా రామ్‌ఇన్ఫో సంస్థకు మరో రెండునెలలపాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని మీసేవ ఉద్యోగుల సంక్షేమసంఘం అధ్యక్షుడు గోవింద్‘సాక్షి’కి తెలిపారు.
నిర్వహణ అధ్వానం
రామ్ ఇన్ఫో సంస్థ మీసేవ కేంద్రాల నిర్వహణను గాలికి వదిలేసిందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేంద్రాల నిర్వహణకు గాను తెల్లకాగితాలు తదితర సామగ్రిని సొంత సొమ్ముతో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. పలు కేంద్రాలలో సెక్యూరిటీగార్డులు, స్వీపర్లు లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. కంప్యూటర్లు పనిచేయకున్నా సైట్ ఇంజనీర్లు ఇద్దరే కావడంతో సకాలంలో మరమ్మతులు చేయలేని దుస్థితి తుందని సిబ్బంది చెబుతున్నారు. విద్యుత్ బిల్లులుచెల్లించకపోవడంతో చినవాల్తేరు, చినగంట్యాడ, పెదగంట్యాడ, వన్‌టౌన్ రెల్లివీధి ప్రాంతాలలోని మీసేవ కేంద్రాలకు విద్యుత్ నిలిచిపోయింది. జనరేటర్లు కాదుకదా కనీసం యూపీఎస్‌సదుపాయం కూడా లేదు.
వెట్టిచాకిరీ
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 22 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 22 మంది మేనేజర్లు, 50 మంది ఆపరేటర్లు, ఒక సమన్వయకర్త, సైట్‌ఇంజనీర్లు ఇద్దరు ఉన్నారు. గతంలో ఆపరేటర్లు 90 మందికి పైగా ఉండేవారు. ఇప్పుడు కేవలం 50మందే ఉండడంతో తీవ్ర పనిఒత్తిడితో సతమతం అవుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. మేనేజర్‌కి రూ.9,300, ఆపరేటర్లకు రూ.6,400, సెక్యూరిటీ గార్డులకు రూ.4వేలు, స్వీపర్లకు రూ.800 వంతున వేతనాలు ఇస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల వేతనాలు ఇప్పటికీ ఇవ్వకపోవడం గమనార్హం. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని మీసేవ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
మీసేవ కోల్పోతున్న ఆదాయం
సూర్యాబాగ్ రూ.20లక్షలు
ఆశీలమెట్ట రూ.15లక్షలు
సీతమ్మధార రూ.7లక్షలు
దొండపర్తి రూ.15లక్షలు
చినవాల్తేరు, రూ.5లక్షలు
ఎంవీపీ కాలనీ రూ.7లక్షలు
కంచరపాలెం రూ.10లక్షలు
మాధవధార రూ.20లక్షలు
చినగంట్యాడ రూ.25లక్షలు
మల్కాపురం రూ.15లక్షలు
చిట్టివానిపాలెం రూ.12లక్షలు
వడ్లపూడి రూ.10లక్షలు
తగరపువలస రూ.5లక్షలు
అనకాపల్లి 2 కేంద్రాలు రూ.20లక్షలు
Comments
Please login to add a commentAdd a comment