మీ కోసం కార్యక్రమంలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టరు లక్ష్మీకాంతం
కృష్ణాజిల్లా, కంకిపాడు (పెనమలూరు) : సమస్యల పరిష్కార వేదిక.. ‘మీ కోసం’ అని జిల్లా కలెక్టరు బి. లక్ష్మీకాంతం అన్నారు. పట్టణంలోని శ్రీకృష్ణా కల్యాణ మండపంలో సోమవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మచిలీపట్నం కేంద్రంగా సాగే మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు రావాల్సి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న నేపథ్యంలో ప్రజల వద్దకే మీ కోసం తీసుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే 13 నియోజకవర్గాల్లో మీ కోసం పూర్తయ్యిందని చెప్పారు.
ఏపీ ఫైబర్ బ్రోచర్ విడుదల
ఏపీ ఫైబర్‌నెట్ బ్రోచర్‌ను కలెక్టరు ఆవిష్కరించారు. వినోదంతో పాటు, ఇంటర్నెట్, బిల్లుల చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ, కార్యాలయాల్లోనూ, దుకాణాల్లోనూ ప్రతి రంగంలోనూ కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే, మార్క్‌ఫెడ్ ద్వారా కంకిపాడు మార్కెట్ యార్డులోనూ మినుము కొనుగోలు కేంద్రం తెరిపిస్తామన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జేసీ కె. విజయకృష్ణన్, జేసీ–2 పి. బాబూరావు, సబ్ కలెక్టరు మిషాసింగ్, ట్రైనీ కలెక్టరు ఖాజావలి, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, డీఈవో రాజ్యలక్ష్మి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మీ కోసంలో వచ్చిన కొన్ని సమస్యలు..
♦ పెనమలూరు నియోజకవర్గంలోని ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, భూ సేకరణ చేయాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, బీసీ విభా గం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. సబ్ ప్లాన్ నిధులతో రహదారుల నిర్మాణాలు వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని, ఆక్రమణలను తొలగించి శ్మశాన వాటికలను అందుబాటులోకి తేవాలని కోరారు.
♦ కంకిపాడు మండలం కోమటిగుంటలో 1943లో సేద్యం నిమిత్తం ఇచ్చిన 50 సెంట్ల బిట్ ఎసెంట్ భూమికి పట్టా మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన మున్నంగి జయలక్ష్మి అర్జీ సమర్పించారు.
♦ బాపులపాడు మండలంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు విన్నవించారు.
♦ తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంకు చెందిన రైతు దేవరపల్లి రామకృష్ణ, రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా పనలపై ఉన్న సుమారు 100 ఎకరాల్లో వరి పంట దెబ్బతిని ధాన్యం మొలక వచ్చిందని, ఆదుకోవాలని కోరారు.
♦ బీసీ కార్పొరేషన్ నుంచి ఎడ్ల బండికి రుణం తీసుకోగా, సబ్సిడీ రుణం జమ కాలేదని పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన రైతు బోయి రామనారాయణరెడ్డి అర్జీ ఇచ్చారు.
‘జన్మభూమి–మా ఊరు’కు సిద్ధంగా ఉండండి..
విజయవాడ : జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించే జన్మభూమి – మా ఊరు కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సూచించారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో జన్మభూమి నిర్వహణపై ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 27వ తేదీనాటికి మండల, వార్డుస్థాయిల్లో నిర్వహించే షెడ్యూల్‌ను రూపొందించాలన్నారు. ఈనెల 26న అన్ని మండల, మున్సిపాల్టీలు, గ్రామ, వార్డులలో కార్యక్రమంపై సమావేశం నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీలు, 277 వార్డులలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముందస్తు షెడ్యూల్‌ను రూపొందించుకుని ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. జన్మభూమి సభలలో స్పెషలాఫీసర్ల పాలనలో శానిటేషన్, మౌలిక సదుపాయాలు, వీధి దీపాలు, తాగునీటికి వెచ్చించిన నిధుల వివరాలను తెలపాలన్నారు. జనవరి 11న గ్రామస్థాయిలో విద్యాశాఖ ఆధ్యర్యంలో పెయింటింగ్, రంగోలి తదితర పోటీలు నిర్వహించి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానించాలన్నారు. మండల, మున్సిపల్ లెవెల్ విజిటింగ్ టీమ్ గ్రామ సభ నిర్వహించాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కె. విజయ్‌కృష్ణన్, జేసీ–2 పి. బాబూరావు, జెడ్పీ సీఈవో షేక్ సలాం, వివిధ Ôశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment