meekosam programme
-
డీఎస్పీ, సీఐల కార్యాలయాల్లోనూ ‘మీ కోసం’
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ప్రజలు తమ ఫిర్యాదులను ముందుగా సంబంధిత స్టేషన్లల్లో ఇవ్వాలని, అక్కడ సమస్యల పరిష్కారం కాకుంటే సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. అక్కడ కూడా బాధితులకు న్యాయం జరగకపోతే తమకు తెలియచేయాలని ఆయన సూచించారు. మీ కోసంలో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మీకోసంలో ఎస్బీ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు,ఎస్బీ సీఐ ఎం.సుబ్బారావు పాల్గొన్నారు. ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను కొంత మంది అధికారులు పరిష్కరించడం లేదని, అటువంటి విషయాల్లో డీఎస్పీ విచారించి సంబంధిత అధికారులపై నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రతి సోమవారం డీఎస్పీ, సీఐ కార్యాలయాల్లో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల పరిష్కార వేదికలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలపై సీఐలను ఇతర జిల్లాలకు, ఎస్సైలను సబ్ డివిజన్ పరిధిలో బదిలీ చేశామని తెలిపారు. అధికారులు ప్రతి రోజూ తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి పరిస్థితులపై అవగాహన తెచ్చుకుని వాటి నివేదికలు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలను నివేదించాలని కోరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పలు సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞప్తులు, ఫిర్యాదులు ఎస్పీకి అందించారు. హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం జిల్లాలో హోంగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రవి ప్రకాష్ అన్నారు. 2018 మే 6న అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు టి.నాగేశ్వరరావు సతీమణి సత్యవతికి ఎస్పీ రూ. 3,26,200ల చెక్కును అందచేశారు. అనారోగ్య కారణాలు, విధుల్లో ఉంటూ చనిపోయిన హోంగార్డు కుటుంబాలను ఆదుకునేందుకు ఎస్పీ ఇప్పటికే ఫ్యామిలీ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఈ నిధులో నుంచి సోమవారం హోంగార్డు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేశారు. -
సమస్యల పరిష్కార వేదికే ‘మీ కోసం’
కృష్ణాజిల్లా, కంకిపాడు (పెనమలూరు) : సమస్యల పరిష్కార వేదిక.. ‘మీ కోసం’ అని జిల్లా కలెక్టరు బి. లక్ష్మీకాంతం అన్నారు. పట్టణంలోని శ్రీకృష్ణా కల్యాణ మండపంలో సోమవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మచిలీపట్నం కేంద్రంగా సాగే మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు రావాల్సి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న నేపథ్యంలో ప్రజల వద్దకే మీ కోసం తీసుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే 13 నియోజకవర్గాల్లో మీ కోసం పూర్తయ్యిందని చెప్పారు. ఏపీ ఫైబర్ బ్రోచర్ విడుదల ఏపీ ఫైబర్‌నెట్ బ్రోచర్‌ను కలెక్టరు ఆవిష్కరించారు. వినోదంతో పాటు, ఇంటర్నెట్, బిల్లుల చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ, కార్యాలయాల్లోనూ, దుకాణాల్లోనూ ప్రతి రంగంలోనూ కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే, మార్క్‌ఫెడ్ ద్వారా కంకిపాడు మార్కెట్ యార్డులోనూ మినుము కొనుగోలు కేంద్రం తెరిపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జేసీ కె. విజయకృష్ణన్, జేసీ–2 పి. బాబూరావు, సబ్ కలెక్టరు మిషాసింగ్, ట్రైనీ కలెక్టరు ఖాజావలి, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, డీఈవో రాజ్యలక్ష్మి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీ కోసంలో వచ్చిన కొన్ని సమస్యలు.. ♦ పెనమలూరు నియోజకవర్గంలోని ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, భూ సేకరణ చేయాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, బీసీ విభా గం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. సబ్ ప్లాన్ నిధులతో రహదారుల నిర్మాణాలు వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని, ఆక్రమణలను తొలగించి శ్మశాన వాటికలను అందుబాటులోకి తేవాలని కోరారు. ♦ కంకిపాడు మండలం కోమటిగుంటలో 1943లో సేద్యం నిమిత్తం ఇచ్చిన 50 సెంట్ల బిట్ ఎసెంట్ భూమికి పట్టా మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన మున్నంగి జయలక్ష్మి అర్జీ సమర్పించారు. ♦ బాపులపాడు మండలంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు విన్నవించారు. ♦ తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంకు చెందిన రైతు దేవరపల్లి రామకృష్ణ, రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా పనలపై ఉన్న సుమారు 100 ఎకరాల్లో వరి పంట దెబ్బతిని ధాన్యం మొలక వచ్చిందని, ఆదుకోవాలని కోరారు. ♦ బీసీ కార్పొరేషన్ నుంచి ఎడ్ల బండికి రుణం తీసుకోగా, సబ్సిడీ రుణం జమ కాలేదని పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన రైతు బోయి రామనారాయణరెడ్డి అర్జీ ఇచ్చారు. ‘జన్మభూమి–మా ఊరు’కు సిద్ధంగా ఉండండి.. విజయవాడ : జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించే జన్మభూమి – మా ఊరు కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సూచించారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో జన్మభూమి నిర్వహణపై ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 27వ తేదీనాటికి మండల, వార్డుస్థాయిల్లో నిర్వహించే షెడ్యూల్‌ను రూపొందించాలన్నారు. ఈనెల 26న అన్ని మండల, మున్సిపాల్టీలు, గ్రామ, వార్డులలో కార్యక్రమంపై సమావేశం నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీలు, 277 వార్డులలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముందస్తు షెడ్యూల్‌ను రూపొందించుకుని ఆర్టీజీఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. జన్మభూమి సభలలో స్పెషలాఫీసర్ల పాలనలో శానిటేషన్, మౌలిక సదుపాయాలు, వీధి దీపాలు, తాగునీటికి వెచ్చించిన నిధుల వివరాలను తెలపాలన్నారు. జనవరి 11న గ్రామస్థాయిలో విద్యాశాఖ ఆధ్యర్యంలో పెయింటింగ్, రంగోలి తదితర పోటీలు నిర్వహించి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానించాలన్నారు. మండల, మున్సిపల్ లెవెల్ విజిటింగ్ టీమ్ గ్రామ సభ నిర్వహించాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కె. విజయ్‌కృష్ణన్, జేసీ–2 పి. బాబూరావు, జెడ్పీ సీఈవో షేక్ సలాం, వివిధ Ôశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన మీకోసం
అనంతపురం అర్బన్ : సమస్యలు పరిష్కారానికి నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతపురంలో డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, ఏఓ విజయలక్ష్మి, ఏడీఏ విద్యావతి, సూపరింటెండెంట్ హరికుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుత్తిలో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై అనంతపురంలో 245 అర్జీలు, గుత్తిలో 250 అర్జీలు అందాయి. కొన్ని సమస్యలు ఇలా... ♦ కొళాయి కనెక్షన్ కోసం అధికారుల చుట్టూ ఎనిమిది నెలలుగా తీరుగుతున్నా పట్టించుకోలేదని, కలెక్టరేట్లో నాలుగు సార్లు అర్జీ ఇచ్చినా కనెక్షన్ మంజూరు కాలేదని యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన ఓబుళరెడ్డి వాపోయాడు. కనెక్షన్ కోసం పదేపదే వస్తే కేసు పెడతామంటూ అధికారులు నోటీసు ఇచ్చారని వాపోయాడు. ♦ పూట్లూరు మండలం చింతకుంటలో పారితోషికం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నామని కాళభైరవాలయ పూజారులు చంద్రమౌళి, సూర్యప్రకాశ్ మూర్తి విన్నవించారు. ♦ సర్వే నెంబరు 23లో 2.17 సెంట్ల భూమిని పూర్వీకుల నుంచి సాగు చేస్తున్నామని, తమ పేరున పాసపుస్తకం మంజూరు చేయాలని యాడికి మండలం రాయలచెరువు చెందిన ఎం.సరోజమ్మ విన్నవించింది. ♦ తమకు 904–ఎ, 904–1, 893 సర్వే నెంబర్లలో 2.29 ఎకరాల భూమి ఉందని, పాసుపుస్తకం మంజూరు చేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన ఎం.నల్లమ్మ కోరింది. ♦ సర్వేనంబరు 20లో తమకు నాలుగు ఎకరాల భూమి ఉందని, పట్టాదారుపాసుపుస్తకం ఇవ్వలేదని సోమందేపల్లి మండలం నాగినాయనచెరువుకు చెందిన వెంకటేశులు ఫిర్యాదు చేశాడు. ♦ మాభూమిని పక్కనున్న పొలం వారు దౌర్జన్యంగా తమ పొలంలో కలుపుకున్నారని కూడేరుకు చెందిన శివయ్య ఫిర్యాదు చేశాడు. 403–2 సర్వే నంబరులో 4.86 ఎకరాల భూమి తన భార్యపేరు ఉందని, ఇందుకు పాసుపుస్తం కూడా ఉందన్నారు. అయితే పొరుగున ఉన్నవారు తమ భూమిలో కొంతభూమిని ఆక్రమించారన్నారు. ♦ టమోట పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా నివేదికలు పంపాలని పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వి.శివారెడ్డి కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. -
కష్టాలకు కాలంచెల్లేదెన్నడో?
అనంతపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లోనూ, కుందుర్పి మండలం కేంద్రాల్లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమాల్లో ప్రజల నుం చి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఈ రెండు చోట్ల మొత్తం వివిధ సమస్యలపై 786 అర్జీలు వచ్చాయి. అనంతపురంలో డీఆర్ఓ ఎస్.రఘునాథ్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, పాలనాధికారి విజయలక్ష్మి, సెక్షన్ తహసీల్దారులు హరికుమార్, నాగరాజు, ఏడీఏ విద్యావతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇక్కడ వివిధ సమస్యలపై 260 అర్జీలు వచ్చాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ‘మీ కోసం’లో ప్రజల నుంచి 526 అర్జీలు అందాయి. కొన్ని సమస్యలు ఇలా.. ♦ ఆలయం భూమిలో (సర్వేనంబర్‌లో 547లో 8.20 ఎకరాల భూమి) శ్మశానవాటిక ఏర్పాటుకు సిద్ధపడ్డారని, ఈ చర్యను నిలుపుదల చేయిం చాలని విడపనకల్లు మండలం విడపనకల్లు గ్రామానికి చెందిన ఎం.శివరుద్రస్వామి విన్నవించారు. ♦ తన భూమి (సర్వే నంబర్లు 145, 146, 139లో)ని ఆన్లైన్లో నమోదు చేయడం లేదని నల్లమాడకు చెందిన పి.ఖాదర్‌బాషా ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయాడు. ♦ అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆపాస్ (ఏపీ ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరప్రసాద్, టి.నారాయణస్వామి విన్నవించారు. ♦ సర్వే నెంబరు 442–3ఎలో తమకు 3.22 ఎకరాల భూమి ఉందని, మోటారు, పైప్‌లైన్ కోసం ఎస్టీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని నూతిమడగు పంచాయతీ తిప్పేపల్లికి చెందిన ఇ.కదిరయ్య ఫిర్యాదు చేశాడు. ♦ ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన తనకు మాజీ సైనికుల కోటాలో వ్యవసాయ భూమిని మంజూరు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని పెనుకొండ మండలం వెంకట రెడ్డిపల్లికి చెందిన మాజీ సైని కోద్యోగి కె.భాస్కర్ ఫిర్యాదు చే శాడు. ♦ ఏడాదిన్నర క్రితం విశాఖపట్నంలో సెలక్షన్స్‌లో త్రిపుర స్టేట్ రైఫిల్స్‌కు ఎంపికయ్యామని, అయినా నియామక ఉత్తర్వులు అందలేదని నీలకంఠ, సురేశ్, ప్రశాంత్, కిరణ్‌కుమార్, శ్రీనివాసులు విన్నవించారు. ♦ ఇతని పేరు మేకల గంగన్న. బత్తలపల్లిలో నివాసముంటున్నాడు. ముదిగుబ్బ మండలం గుంజేపల్లిలో ఇతనికి 827 సర్వే నంబరులో 4.35 ఎకరాలు, 429–4లో 3.03 ఎకరాల భూమి పిత్రార్జితంగా వచ్చింది. తాను చనిపోయినట్లుగా తన సోదరులు డెత్ సర్టిఫికెట్ ఉంచి తనకు రావాల్సిన భూమికి పట్టాపుస్తకాలు చేసుకున్నారని వాపోయాడు. ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరించాలంటూ ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అప్పటి నుంచి తహసీల్దారు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదన్నాడు. -
విన్నపాలు వినవలె..!
ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు సానా వెంకట లక్ష్మిదేవి. చింతకొమ్మదిన్నె మండలం మూలవంక. భర్త సానా ప్రసాద్ లారీడ్రైవరుగా పనిచేస్తుండేవారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. దీంతో కడుపు చేతపట్టుకుని కువైట్ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. జూన్ 13వ తేదీ మృతి చెందారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే ఇక్కడికి పంపారు. భర్త శవంగా మారి రావడంతో భార్య వెంకట లక్ష్మిదేవి కన్నీరుమున్నీరైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నారు. ఊరిలో సొంత ఇల్లు కూడా లేదు. పిల్లలను ప్రయోజకులను చేయాలనే పట్టుదలతో ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ ఇంగ్లీషు చదువుతోంది. కమలాపురంలో బీఈడీ కూడా చేస్తోంది. ఈ మధ్యకాలంలో కర్నూలులో పోలీసు సెలెక్షన్లకు కూడా వెళ్లింది. ప్రిలిమ్స్, ఈవెంట్స్‌లో ఉత్తీర్ణురాలైంది. మెయిన్స్‌లో నెగ్గలేక పోవడంతో వెనుదిరిగి వచ్చింది. తన భర్త మృతి చెందాడు గనుక కువైట్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఆమెకు రావాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఓమారు కలెక్టర్‌కు మొర పెట్టుకుంది. త్వరగా తమ ఫైలు పైకి పంపి నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. కడప సెవెన్‌రోడ్స్: స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు విన్నవించారు. ఎన్ని సార్లు అర్జీలు సమర్పించినా పింఛన్లు అందలేదని కొందరు, వస్తున్న పింఛన్లను అర్ధాంతరంగా ఆపివేశారని మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రేషన్‌కార్డులు, చంద్రన్న బీమా, వ్యవసాయ భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఎన్టీఆర్ గృహాలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని, సర్వే నిర్వహించి హద్దులు చూపించాలని.. ఇలా వివిధ రకాల సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. పెన్షన్ నిలిపేశారు నా కుమారుడు నాగసుబ్బయ్య మానసిక వికలాంగుడు. కుమారుని అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకోవాలి. మాకు వెనకా ముందు ఎవరూ లేరు. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నా కుమారునికి రూ.1500 పెన్షన్ వస్తుండేది. ఎనిమిది నెలల నుంచి నిలిపివేశారు. ఎందుకిలా చేశారని అధికారులను అడిగాను. ఇప్పటికే నీకు వితంతు పెన్షన్ వస్తోంది గనుక నీ కుమారుడి పెన్షన్ నిలిపివేశామని చెప్పారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛన్ ఇవ్వరాదనే నిబంధన ఉన్నప్పుడు నా పెన్షన్ తొలగించి కుమారుని పెన్షన్ పునరుద్ధరించాలని కోరేందుకు వచ్చాను. – వీరమ్మ, బాలిరెడ్డిపల్లె, కమలాపురం మండలం ఇంటి స్థలాలు క్రమబద్ధీకరించాలి 19 ఏళ్ల నుంచి కడప తిలక్‌నగర్‌లో మేము కాపురముంటున్నాము. మాతోపాటే చాలా కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. అందరూ కూలీ పని, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మేము అక్కడ నివాసమున్నట్లు నిర్ధారించే విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను రశీదులు, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు అన్నీ ఉన్నాయి. మాకు ఇళ్ల స్థలా పట్టాలు మాత్రం లేవు. ఈ విషయంపై అనేక ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. 1994లో అప్పటి తహసీల్దార్ టి.కృష్ణమూర్తి ఇచ్చిన లే అవుట్ రద్దు చేయలేదు గనుక మేము మీ ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించలేమని తహసీల్దార్ అంటున్నారు. నిబంధనలు అంగీకరించనపుడు గతంలో తహసీల్దార్‌గా పని చేసిన నాగరాజు కొంత మందికి పొసెషన్ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని మేము ప్రశ్నించగా, అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి జీఓ నంబర్ 388 ప్రకారం ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరేందుకు వచ్చాము. – ఎస్.మోహన్‌కుమార్, తిలక్‌నగర్, కడప పింఛన్ ఇప్పించి ఆదుకోండి నేను కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. వయసు పైబడడంతో ఇప్పుడు పనులు చేయడానికి శరీరం సహకరించే పరిస్థితిలో లేదు. నాకు ఆస్తిపాస్తులు గానీ, వెనకా ముందు గానీ ఎవరూ లేరు. ప్రభుత్వం కనీసం వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తే ఏదో కొంత ఆసరాగా ఉంటుంది. ఇప్పటికి పది సార్లు పెన్షన్ కోసం అర్జీలు సమర్పించాను. అయితే ఇంత వరకు మంజూరు కాలేదు. ఈ విషయాన్ని కిందిస్థాయి అధికారులను అడగ్గా, వారు సరైన సమాధానం చెప్పడం లేదు. నా సమస్యను కలెక్టర్ అయినా పట్టించుకుంటారనే ఆశతో వచ్చాను. – చెన్నప్ప, ఆజాద్‌నగర్, కడప. -
పదే పదే ఒకే అర్జీ..!
‘మీ కోసం..’ ప్రతి సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండే వేదిక. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామన్న ఆశతో వందల మంది జిల్లా కేంద్రానికి వస్తుంటారు. కానీ జిల్లా అధికారులు ఆ అర్జీని మళ్లీ ఆయా మండలాల అధికారులకే సిఫార్సు చేసి సమస్య పరిష్కారమైనట్లు లెక్కల్లో చూపిం చేస్తున్నారు. కానీ సదరు అర్జీలు మండల కార్యాలయాల్లో బుట్టదాఖలవుతున్నాయి. ఫలితం..ఒకే సమస్యపై పదేపదే అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. లెక్కల్లో మాత్రం వచ్చిన అర్జీలన్నీ దాదాపు పరిష్కరించేశామని ఉన్నతాధికారులు చెప్పుకుంటున్నారు. సాధారణ ప్రజలు మాత్రం సమస్య పరిష్కారం కాక..ఇంక ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమాన్ని ‘సాక్షి’ బృందం పరిశీలించగా బాధితుల వేదన వెలుగులోకి వచ్చింది. ఒంగోలు టౌన్: ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నిర్వహించిన మీకోసంలో జిల్లా వ్యాప్తంగా 2,77,889 మంది బాధితులు అర్జీలను అందించారు. వాటిలో 2,77,276 అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం ఘనంగా ప్రకటించుకొంది. పరిష్కరించిన వాటిలో 1,76,116 అర్జీలు ఆర్ధికపరమైనవి ఉండగా, 37,481 అర్జీలు ఆర్ధికేతరమైనవి ఉన్నాయి. కేవలం 613 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చింది. అంటే మీకోసంలో వచ్చిన ప్రతి రెండు అర్జీల్లో ఒకదానిని పరిష్కరించినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. వచ్చిన అర్జీలన్నింటికీ పరిష్కారం లభిస్తుంటే బాధితులు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో బారులు తీరి ఎందుకు ఉంటున్నారు? పనులు మానుకొని సుదూర ప్రాంతాల నుంచి ఎందుకు వస్తున్నారు? చేతిలో చిల్లి గవ్వ లేకున్నా అప్పు తీసుకొని ఎందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ జిల్లా యంత్రాంగమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రెవెన్యూ బాధితులే ఎక్కువ: మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల్లో ఎక్కువ భాగం రెవెన్యూ బాధితులకు సంబంధించినవి ఉంటున్నాయి. మండలాల్లో రెవెన్యూ అధికారుల మాయాజాలానికి భూములు గల్లంతవుతున్నాయి. భూమిపై ఒకరు ఉంటుండగా, అదే భూమికి సంబంధించిన వెబ్‌ల్యాండ్‌లో మరొకరు కనిపిస్తుంటారు. దీంతో భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. బాధితులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమకు జరుగుతున్న గోడు అధికారులకు చెప్పుకున్నా వారిది అరణ్యరోదనే అవుతోంది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికే వెళ్లి తన సమస్య చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదు. దాంతో బాధితులు జిల్లా కేంద్రంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిర్వహించే మీకోసం కార్యక్రమానికి ఆర్ధిక వ్యయ ప్రయాసలకోర్చి వస్తే ఎక్కడైతే న్యాయం జరగలేదో తిరిగి అక్కడికే పంపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులను కలిసిన తరువాత వారు ఇచ్చే రసీదును తీసుకొని మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సమాధానం చెప్పేందుకు కూడా కొంత మంది తహసీల్దార్లు ఇష్టపడటం లేదు. సౌకర్యాలు నిల్:మీకోసం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు గంటలకొద్దీ క్యూలో నిల్చొని అర్జీల అందించాల్సి ఉంటుంది. ఆ సమయంలో అత్యవసరంగా కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బాధితులు పడే అవస్థలు వర్ణనాతీతం. ముఖ్యంగా మహిళలు అయితే వారి అవస్థలు చెప్పనలవిగా ఉంటాయి. సీపీఓ కాన్ఫరెన్స్ ఎంట్రెన్స్‌లో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు. తమ సమస్యల పరిష్కారం మాటేమోగాని అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకోవాలంటే తాము ఎటు వెళ్లాలో తెలియడంలేదని వారు వాపోతున్నారు. వాళ్లకేమో రాగి జావ.. వీళ్లకేమో నీటి కరువు:మీకోసం కార్యక్రమంలో పాల్గొనే జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రతి సోమవారం యంత్రాంగం రాగి జావ అందిస్తోంది. ఏసీ గదుల్లో కూర్చొని రాగి జావ తాగుతూ అధికారులు రిలాక్స్ అవుతుంటే, ఎర్రటి ఎండల్లో వచ్చిన బాధితులకు గుక్కెడు నీరు ఇచ్చేవారు కరువయ్యారు. గతంలో చల్లటి నీటిని ఏర్పాటు చేసిన యంత్రాంగం ప్రస్తుతం చల్లటి నీరు కాదుగదా గొంతు తడుపుకునేందుకు ఏర్పాట్లు చేయడం లేదు. తాజాగా సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 276 అర్జీలు వచ్చాయి. సామాజిక పరమైన అర్జీలు అందించే సమయంలో పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. అంటే వారందరికీ నీటిని అందించే ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం విఫలమైంది. సోమవారం కేవలం రెండు బబుల్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికే ఆ రెండు బబుల్స్ ఖాళీ అయ్యాయి. -
మీకోసం – ఎవరికోసం?
పాలకొండ: మీకోసం కార్యక్రమం ప్రజా విశ్వాసం కోల్పోతోంది. మండల, జిల్లా కేంద్రాల్లో ప్రతినెలా సోమవారం ఇళ్ల బిల్లులు, పింఛన్లు, రేషన్‌కార్డులు, భూ వివాదాలు..ఇలా పలు సమస్యలపై పెట్టుకుంటున్న బాధితుల అర్జీలకు న్యాయం చూపడంలేదు. వేలల్లో దరఖాస్తులు వస్తే వందల్లో పరిష్కారం చూపి మిగిలినవి అధికారులు బుట్టుదాఖలు చేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం అంటేనే ప్రజలు ఏవగించుకునేలా దిగజార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిష్కారమేదీ? జిల్లాలో ఇప్పటివరకు మీకోసం కార్యక్రమానికి 3 లక్షల 91,979 అర్జీలు అందాయి. ఇందులో ఇంతవరకు పరిష్కరించినవి 2 లక్షల 11 వేలు మాత్రమే. ఇవి ఆన్లైన్లో నమోదైన అర్జీలు మాత్రమే. వాస్తవంగా ప్రతీ వారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను, వినతులను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో నమోదైతే కచ్చితంగా దీనిపై బాధితునికి సమాధానం చెప్పాల్సిన అవసరముంది. దీంతో అర్జీలు స్వీకరించినప్పుడే వీటిని ఆన్లైన్లో నమోదు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. దీంతో బాధితునికి అసలు ఈ కార్యక్రమం అంటేనే ఎందుకు పనికిరానిదిగా భావించే పరిస్థితి నెలకొల్పారు. కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమంలో ఇంతవరకు 85,744 అర్జీలు అందితే, అందులో 57,194 పరిష్కరించారంటే మండల కేంద్రాల పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా పాలకొండ డివిజన్ నుంచి లక్షా 14 వేలా 127 అర్జీలు అందగా శ్రీకాకుళం డివిజన్ నుంచి లక్షా 4 వేలా 666, టెక్కలి డివిజన్ నుంచి 87,442 అర్జీలు అందినట్టు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 12 వేల దరఖాస్తులు గడువు దాటిపోయినా పరిష్కారానికి నోచుకోలేదు. మరో 22 వేల దరఖాస్తులు గడువు దాటిపోవడానికి మరో నెల మాత్రమే సమయముంది. దీంతో ఈ సమస్యలపై ఎటువంటి పరిష్కారం దొరకడం లేదని బాధితుల్లో ఆవేదన నెలకొంది. పేరుమార్చినా... తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజావాణి కార్యక్రమాన్ని మీకోసంగా పేరు మార్చింది. సీఎం చంద్రబాబునాయుడు దీనిపై ప్రచారం చేస్తూ ప్రతీ సోమవారం మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరిస్తామని, పరిష్కరించకపోతే అందుకుగల కారణాలను బాధితుని ఫోన్‌కు అందిస్తామని ప్రకటించారు. అప్పట్నుంచి ఈ కార్యక్రమంపై ఆశలు పెంచుకున్న బాధితులకు మూడున్నరేళ్లు దాటుతున్నా న్యాయం చేకూరడంలేదు. దీంతో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం మొక్కుబడిగా మారింది. వాస్తవానికి ఎంపీడీవో, తహసీల్దారు కార్యాలయాల్లో మీకోసం కార్యక్రమం పూర్తిగా కనుమరుగైందని చెప్పవచ్చు. -
వెల్లువలా వినతులు
- వినతులు వెంటనే పరిష్కరించాలి - మీకోసంలో అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం - ప్రజల నుంచి వినతులు స్వీకరణ అనంతపురం అర్బన్ : ప్రజల నుంచి వారి సమస్యలపై స్వీకరించే మీ కోసం, జన్మభూమి, తదితర అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి అర్జీలు స్వీకరించారు. ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయినగర్‌లో పరిధిలో పలు విద్యుత్ స్తంబాలు పాడయ్యాయని, కొన్ని ఇనుప స్తంభాలు తుప్పుపట్టాయని జాయింట్ కలెక్టర్‌కు ప్రసన్నాయపల్లి సర్పంచ్ భూమిరెడ్డి సావిత్రి చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న వీటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేసేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశాలించాలని కోరారు. అదేవిధంగా మీ కోసంలో వివిధ సమస్యలపై మొత్తం 452 అర్జీలు వచ్చాయి. బధిరులు కోటా భర్తీ చేయాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో వికలాంగుల రిజర్వేషన్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన బధిరులతో భర్తీ చేయాలని బధిరులు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యర్శులు ఎం.మోహన్‌బాబు, బి.రాఘవేంద్ర కోరారు. పోర్జీ సంతకాలతో నిధులు స్వాహా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరులోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మహిళ సంఘం లీడర్లు, సభ్యులకు తెలియకుండా యానిమేటర్ పోర్జీర సంతతకాలో నిధులు స్వాహా చేశారని సంఘం అధ్యక్షురాలు లక్ష్మిదేవి, సభ్యులు సుశీలమ్మ, అంజనమ్మ, తదితరులు ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ నేమ్ బోర్డులను పునర్నిర్మించాలి రాంనగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ నేమ్ బోర్డులు రైల్వే బ్రిడ్జి నిర్మాణ క్రమంలో ద్వంసం అయ్యాయని, వాటిని పునర్మించాలని అంబేద్కర్ మిలినీయం కమిటీ కన్వీనర్ నాగలింగమయ్య, వైఎసార్సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబుళేసు, దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు. శ్మశాన స్థలం కబ్జా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం వేపచర్ల గ్రామంలోని శ్మశాన స్థలాన్ని కొందరు ఆక్రమించారని పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. శ్మశానానికి ప్రహరీ నిర్మించి స్థలాన్ని పరిరక్షించాలని కోరారు.