అర్జీలు స్వీకరిస్తున్న డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, ఏఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు
అనంతపురం అర్బన్ : సమస్యలు పరిష్కారానికి నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతపురంలో డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, ఏఓ విజయలక్ష్మి, ఏడీఏ విద్యావతి, సూపరింటెండెంట్ హరికుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుత్తిలో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై అనంతపురంలో 245 అర్జీలు, గుత్తిలో 250 అర్జీలు అందాయి.
కొన్ని సమస్యలు ఇలా...
♦ కొళాయి కనెక్షన్ కోసం అధికారుల చుట్టూ ఎనిమిది నెలలుగా తీరుగుతున్నా పట్టించుకోలేదని, కలెక్టరేట్‌లో నాలుగు సార్లు అర్జీ ఇచ్చినా కనెక్షన్ మంజూరు కాలేదని
యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన ఓబుళరెడ్డి వాపోయాడు. కనెక్షన్ కోసం పదేపదే వస్తే కేసు పెడతామంటూ అధికారులు నోటీసు ఇచ్చారని వాపోయాడు.
♦ పూట్లూరు మండలం చింతకుంటలో పారితోషికం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నామని కాళభైరవాలయ పూజారులు చంద్రమౌళి, సూర్యప్రకాశ్ మూర్తి విన్నవించారు.
♦ సర్వే నెంబరు 23లో 2.17 సెంట్ల భూమిని పూర్వీకుల నుంచి సాగు చేస్తున్నామని, తమ పేరున పాసపుస్తకం మంజూరు చేయాలని యాడికి మండలం రాయలచెరువు చెందిన ఎం.సరోజమ్మ విన్నవించింది. ♦ తమకు 904–ఎ, 904–1, 893 సర్వే నెంబర్లలో 2.29 ఎకరాల భూమి ఉందని, పాసుపుస్తకం మంజూరు చేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన ఎం.నల్లమ్మ కోరింది.
♦ సర్వేనంబరు 20లో తమకు నాలుగు ఎకరాల భూమి ఉందని, పట్టాదారుపాసుపుస్తకం ఇవ్వలేదని సోమందేపల్లి మండలం నాగినాయనచెరువుకు చెందిన వెంకటేశులు ఫిర్యాదు చేశాడు.
♦ మాభూమిని పక్కనున్న పొలం వారు దౌర్జన్యంగా తమ పొలంలో కలుపుకున్నారని కూడేరుకు చెందిన శివయ్య ఫిర్యాదు చేశాడు. 403–2 సర్వే నంబరులో 4.86 ఎకరాల భూమి తన భార్యపేరు ఉందని, ఇందుకు పాసుపుస్తం కూడా ఉందన్నారు. అయితే పొరుగున ఉన్నవారు తమ భూమిలో కొంతభూమిని ఆక్రమించారన్నారు.
♦ టమోట పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా నివేదికలు పంపాలని పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వి.శివారెడ్డి కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment