మీ కోసం కార్యక్రమంలో ఎస్పీ రవిప్రకాష్
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ప్రజలు తమ ఫిర్యాదులను ముందుగా సంబంధిత స్టేషన్లల్లో ఇవ్వాలని, అక్కడ సమస్యల పరిష్కారం కాకుంటే సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. అక్కడ కూడా బాధితులకు న్యాయం జరగకపోతే తమకు తెలియచేయాలని ఆయన సూచించారు. మీ కోసంలో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మీకోసంలో ఎస్‌బీ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు,ఎస్‌బీ సీఐ ఎం.సుబ్బారావు పాల్గొన్నారు. ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను కొంత మంది అధికారులు పరిష్కరించడం లేదని, అటువంటి విషయాల్లో డీఎస్పీ విచారించి సంబంధిత అధికారులపై నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రతి సోమవారం డీఎస్పీ, సీఐ కార్యాలయాల్లో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల పరిష్కార వేదికలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలపై సీఐలను ఇతర జిల్లాలకు, ఎస్సైలను సబ్ డివిజన్ పరిధిలో బదిలీ చేశామని తెలిపారు. అధికారులు ప్రతి రోజూ తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి పరిస్థితులపై అవగాహన తెచ్చుకుని వాటి నివేదికలు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలను నివేదించాలని కోరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పలు సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞప్తులు, ఫిర్యాదులు ఎస్పీకి అందించారు.
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం
జిల్లాలో హోంగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రవి ప్రకాష్ అన్నారు. 2018 మే 6న అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు టి.నాగేశ్వరరావు సతీమణి సత్యవతికి ఎస్పీ రూ. 3,26,200ల చెక్కును అందచేశారు. అనారోగ్య కారణాలు, విధుల్లో ఉంటూ చనిపోయిన హోంగార్డు కుటుంబాలను ఆదుకునేందుకు ఎస్‌పీ ఇప్పటికే ఫ్యామిలీ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఈ నిధులో నుంచి సోమవారం హోంగార్డు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment