ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు సానా వెంకట లక్ష్మిదేవి. చింతకొమ్మదిన్నె మండలం మూలవంక. భర్త సానా ప్రసాద్ లారీడ్రైవరుగా పనిచేస్తుండేవారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. దీంతో కడుపు చేతపట్టుకుని కువైట్ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. జూన్ 13వ తేదీ మృతి చెందారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే ఇక్కడికి పంపారు. భర్త శవంగా మారి రావడంతో భార్య వెంకట లక్ష్మిదేవి కన్నీరుమున్నీరైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నారు. ఊరిలో సొంత ఇల్లు కూడా లేదు. పిల్లలను ప్రయోజకులను చేయాలనే పట్టుదలతో ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ ఇంగ్లీషు చదువుతోంది. కమలాపురంలో బీఈడీ కూడా చేస్తోంది. ఈ మధ్యకాలంలో కర్నూలులో పోలీసు సెలెక్షన్లకు కూడా వెళ్లింది. ప్రిలిమ్స్, ఈవెంట్స్‌లో ఉత్తీర్ణురాలైంది. మెయిన్స్‌లో నెగ్గలేక పోవడంతో వెనుదిరిగి వచ్చింది. తన భర్త మృతి చెందాడు గనుక కువైట్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఆమెకు రావాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఓమారు కలెక్టర్‌కు మొర పెట్టుకుంది. త్వరగా తమ ఫైలు పైకి పంపి నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.
కడప సెవెన్‌రోడ్స్: స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు విన్నవించారు. ఎన్ని సార్లు అర్జీలు సమర్పించినా పింఛన్లు అందలేదని కొందరు, వస్తున్న పింఛన్లను అర్ధాంతరంగా ఆపివేశారని మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రేషన్‌కార్డులు, చంద్రన్న బీమా, వ్యవసాయ భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఎన్టీఆర్ గృహాలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని, సర్వే నిర్వహించి హద్దులు చూపించాలని.. ఇలా వివిధ రకాల సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు.
పెన్షన్ నిలిపేశారు
నా కుమారుడు నాగసుబ్బయ్య మానసిక వికలాంగుడు. కుమారుని అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకోవాలి. మాకు వెనకా ముందు ఎవరూ లేరు. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నా కుమారునికి రూ.1500 పెన్షన్ వస్తుండేది. ఎనిమిది నెలల నుంచి నిలిపివేశారు. ఎందుకిలా చేశారని అధికారులను అడిగాను. ఇప్పటికే నీకు వితంతు పెన్షన్ వస్తోంది గనుక నీ కుమారుడి పెన్షన్ నిలిపివేశామని చెప్పారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛన్ ఇవ్వరాదనే నిబంధన ఉన్నప్పుడు నా పెన్షన్ తొలగించి కుమారుని పెన్షన్ పునరుద్ధరించాలని కోరేందుకు వచ్చాను. – వీరమ్మ, బాలిరెడ్డిపల్లె, కమలాపురం మండలం
ఇంటి స్థలాలు క్రమబద్ధీకరించాలి
19 ఏళ్ల నుంచి కడప తిలక్‌నగర్‌లో మేము కాపురముంటున్నాము. మాతోపాటే చాలా కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. అందరూ కూలీ పని, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మేము అక్కడ నివాసమున్నట్లు నిర్ధారించే విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను రశీదులు, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు అన్నీ ఉన్నాయి. మాకు ఇళ్ల స్థలా పట్టాలు మాత్రం లేవు. ఈ విషయంపై అనేక ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. 1994లో అప్పటి తహసీల్దార్ టి.కృష్ణమూర్తి ఇచ్చిన లే అవుట్ రద్దు చేయలేదు గనుక మేము మీ ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించలేమని తహసీల్దార్ అంటున్నారు. నిబంధనలు అంగీకరించనపుడు గతంలో తహసీల్దార్‌గా పని చేసిన నాగరాజు కొంత మందికి పొసెషన్ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని మేము ప్రశ్నించగా, అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి జీఓ నంబర్ 388 ప్రకారం ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరేందుకు వచ్చాము. – ఎస్.మోహన్‌కుమార్, తిలక్‌నగర్, కడప
పింఛన్ ఇప్పించి ఆదుకోండి
నేను కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. వయసు పైబడడంతో ఇప్పుడు పనులు చేయడానికి శరీరం సహకరించే పరిస్థితిలో లేదు. నాకు ఆస్తిపాస్తులు గానీ, వెనకా ముందు గానీ ఎవరూ లేరు. ప్రభుత్వం కనీసం వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తే ఏదో కొంత ఆసరాగా ఉంటుంది. ఇప్పటికి పది సార్లు పెన్షన్ కోసం అర్జీలు సమర్పించాను. అయితే ఇంత వరకు మంజూరు కాలేదు. ఈ విషయాన్ని కిందిస్థాయి అధికారులను అడగ్గా, వారు సరైన సమాధానం చెప్పడం లేదు. నా సమస్యను కలెక్టర్ అయినా పట్టించుకుంటారనే ఆశతో వచ్చాను. – చెన్నప్ప, ఆజాద్‌నగర్, కడప.
Comments
Please login to add a commentAdd a comment