అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ నాగలక్ష్మి
‘మీ కోసం..’ ప్రతి సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లో జిల్లా అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండే వేదిక. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామన్న ఆశతో వందల మంది జిల్లా కేంద్రానికి వస్తుంటారు. కానీ జిల్లా అధికారులు ఆ అర్జీని మళ్లీ ఆయా మండలాల అధికారులకే సిఫార్సు చేసి సమస్య పరిష్కారమైనట్లు లెక్కల్లో చూపిం చేస్తున్నారు. కానీ సదరు అర్జీలు మండల కార్యాలయాల్లో బుట్టదాఖలవుతున్నాయి. ఫలితం..ఒకే సమస్యపై పదేపదే అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. లెక్కల్లో మాత్రం వచ్చిన అర్జీలన్నీ దాదాపు పరిష్కరించేశామని ఉన్నతాధికారులు చెప్పుకుంటున్నారు. సాధారణ ప్రజలు మాత్రం సమస్య పరిష్కారం కాక..ఇంక ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమాన్ని ‘సాక్షి’ బృందం పరిశీలించగా బాధితుల వేదన వెలుగులోకి వచ్చింది.
ఒంగోలు టౌన్: ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నిర్వహించిన మీకోసంలో జిల్లా వ్యాప్తంగా 2,77,889 మంది బాధితులు అర్జీలను అందించారు. వాటిలో 2,77,276 అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం ఘనంగా ప్రకటించుకొంది. పరిష్కరించిన వాటిలో 1,76,116 అర్జీలు ఆర్ధికపరమైనవి ఉండగా, 37,481 అర్జీలు ఆర్ధికేతరమైనవి ఉన్నాయి. కేవలం 613 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చింది. అంటే మీకోసంలో వచ్చిన ప్రతి రెండు అర్జీల్లో ఒకదానిని పరిష్కరించినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. వచ్చిన అర్జీలన్నింటికీ పరిష్కారం లభిస్తుంటే బాధితులు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో బారులు తీరి ఎందుకు ఉంటున్నారు? పనులు మానుకొని సుదూర ప్రాంతాల నుంచి ఎందుకు వస్తున్నారు? చేతిలో చిల్లి గవ్వ లేకున్నా అప్పు తీసుకొని ఎందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ జిల్లా యంత్రాంగమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
రెవెన్యూ బాధితులే ఎక్కువ: మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల్లో ఎక్కువ భాగం రెవెన్యూ బాధితులకు సంబంధించినవి ఉంటున్నాయి. మండలాల్లో రెవెన్యూ అధికారుల మాయాజాలానికి భూములు గల్లంతవుతున్నాయి. భూమిపై ఒకరు ఉంటుండగా, అదే భూమికి సంబంధించిన వెబ్‌ల్యాండ్‌లో మరొకరు కనిపిస్తుంటారు. దీంతో భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. బాధితులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమకు జరుగుతున్న గోడు అధికారులకు చెప్పుకున్నా వారిది అరణ్యరోదనే అవుతోంది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికే వెళ్లి తన సమస్య చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదు. దాంతో బాధితులు జిల్లా కేంద్రంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిర్వహించే మీకోసం కార్యక్రమానికి ఆర్ధిక వ్యయ ప్రయాసలకోర్చి వస్తే ఎక్కడైతే న్యాయం జరగలేదో తిరిగి అక్కడికే పంపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులను కలిసిన తరువాత వారు ఇచ్చే రసీదును తీసుకొని మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సమాధానం చెప్పేందుకు కూడా కొంత మంది తహసీల్దార్లు ఇష్టపడటం లేదు.
సౌకర్యాలు నిల్:మీకోసం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు గంటలకొద్దీ క్యూలో నిల్చొని అర్జీల అందించాల్సి ఉంటుంది. ఆ సమయంలో అత్యవసరంగా కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బాధితులు పడే అవస్థలు వర్ణనాతీతం. ముఖ్యంగా మహిళలు అయితే వారి అవస్థలు చెప్పనలవిగా ఉంటాయి. సీపీఓ కాన్ఫరెన్స్ ఎంట్రెన్స్‌లో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు. తమ సమస్యల పరిష్కారం మాటేమోగాని అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకోవాలంటే తాము ఎటు వెళ్లాలో తెలియడంలేదని వారు వాపోతున్నారు.
వాళ్లకేమో రాగి జావ.. వీళ్లకేమో నీటి కరువు:మీకోసం కార్యక్రమంలో పాల్గొనే జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రతి సోమవారం యంత్రాంగం రాగి జావ అందిస్తోంది. ఏసీ గదుల్లో కూర్చొని రాగి జావ తాగుతూ అధికారులు రిలాక్స్ అవుతుంటే, ఎర్రటి ఎండల్లో వచ్చిన బాధితులకు గుక్కెడు నీరు ఇచ్చేవారు కరువయ్యారు. గతంలో చల్లటి నీటిని ఏర్పాటు చేసిన యంత్రాంగం ప్రస్తుతం చల్లటి నీరు కాదుగదా గొంతు తడుపుకునేందుకు ఏర్పాట్లు చేయడం లేదు. తాజాగా సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 276 అర్జీలు వచ్చాయి. సామాజిక పరమైన అర్జీలు అందించే సమయంలో పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. అంటే వారందరికీ నీటిని అందించే ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం విఫలమైంది. సోమవారం కేవలం రెండు బబుల్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికే ఆ రెండు బబుల్స్ ఖాళీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment