పాలకొండ: మీకోసం కార్యక్రమం ప్రజా విశ్వాసం కోల్పోతోంది. మండల, జిల్లా కేంద్రాల్లో ప్రతినెలా సోమవారం ఇళ్ల బిల్లులు, పింఛన్లు, రేషన్‌కార్డులు, భూ వివాదాలు..ఇలా పలు సమస్యలపై పెట్టుకుంటున్న బాధితుల అర్జీలకు న్యాయం చూపడంలేదు. వేలల్లో దరఖాస్తులు వస్తే వందల్లో పరిష్కారం చూపి మిగిలినవి అధికారులు బుట్టుదాఖలు చేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం అంటేనే ప్రజలు ఏవగించుకునేలా దిగజార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిష్కారమేదీ?
జిల్లాలో ఇప్పటివరకు మీకోసం కార్యక్రమానికి 3 లక్షల 91,979 అర్జీలు అందాయి. ఇందులో ఇంతవరకు పరిష్కరించినవి 2 లక్షల 11 వేలు మాత్రమే. ఇవి ఆన్‌లైన్‌లో నమోదైన అర్జీలు మాత్రమే. వాస్తవంగా ప్రతీ వారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను, వినతులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో నమోదైతే కచ్చితంగా దీనిపై బాధితునికి సమాధానం చెప్పాల్సిన అవసరముంది. దీంతో అర్జీలు స్వీకరించినప్పుడే వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. దీంతో బాధితునికి అసలు ఈ కార్యక్రమం అంటేనే ఎందుకు పనికిరానిదిగా భావించే పరిస్థితి నెలకొల్పారు. కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమంలో ఇంతవరకు 85,744 అర్జీలు అందితే, అందులో 57,194 పరిష్కరించారంటే మండల కేంద్రాల పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా పాలకొండ డివిజన్ నుంచి లక్షా 14 వేలా 127 అర్జీలు అందగా శ్రీకాకుళం డివిజన్ నుంచి లక్షా 4 వేలా 666, టెక్కలి డివిజన్ నుంచి 87,442 అర్జీలు అందినట్టు అధికారుల రికార్డులు చెబుతున్నాయి.
ఇందులో 12 వేల దరఖాస్తులు గడువు దాటిపోయినా పరిష్కారానికి నోచుకోలేదు. మరో 22 వేల దరఖాస్తులు గడువు దాటిపోవడానికి మరో నెల మాత్రమే సమయముంది. దీంతో ఈ సమస్యలపై ఎటువంటి పరిష్కారం దొరకడం లేదని బాధితుల్లో ఆవేదన నెలకొంది.
పేరుమార్చినా...
తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజావాణి కార్యక్రమాన్ని మీకోసంగా పేరు మార్చింది. సీఎం చంద్రబాబునాయుడు దీనిపై ప్రచారం చేస్తూ ప్రతీ సోమవారం మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరిస్తామని, పరిష్కరించకపోతే అందుకుగల కారణాలను బాధితుని ఫోన్‌కు అందిస్తామని ప్రకటించారు. అప్పట్నుంచి ఈ కార్యక్రమంపై ఆశలు పెంచుకున్న బాధితులకు మూడున్నరేళ్లు దాటుతున్నా న్యాయం చేకూరడంలేదు. దీంతో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం మొక్కుబడిగా మారింది. వాస్తవానికి ఎంపీడీవో, తహసీల్దారు కార్యాలయాల్లో మీకోసం కార్యక్రమం పూర్తిగా కనుమరుగైందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment