మంచిర్యాల మున్సిపాలిటీలో గృహలక్ష్మి దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు(ఫైల్)
మంచిర్యాల: రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆ పథకాలతో కొంతమంది లబ్ధి పొందగా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు బీసీబంధు, మైనారిటీ బంధు పథకాలు ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు.
మొదటి విడతలో కొందరు లబ్ధి పొందారు. ఇక సొంత ఇంటి కలను తీర్చేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి దరఖాస్తులను తీసుకున్నా అర్హులకు ఎలాంటి సాయం అందించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. పథకాలు కొనసాగుతాయా.. కొనసాగినా తమకు వర్తిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
బీసీ, మైనారిటీ బంధు కొందరికే..
జిల్లా వ్యాప్తంగా బీసీబంధు కోసం దరఖాస్తు చేసుకున్న 11,107 మందిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హులుగా 7,734 మందిని గుర్తించారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది చొప్పున మూడు నియోజకవర్గాల నుంచి 900 మందికి రూ. లక్ష సాయం అందించారు. రెండో విడతలో మరో 900 మందిని గుర్తించినా, వారికి అందించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో పథకానికి బ్రేక్ పడింది. ఇక మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 2,709 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మందిని మొదటి విడతలో గుర్తించి, వారికి రూ.లక్ష చొప్పున అందించారు. మిగతావారికి సాయం అందించేందుకు నిధులు విడుదల చేయలేదు.
‘గృహలక్ష్మి’పై సందిగ్ధం..
సొంత ఇంటి స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 51,764 మంది దరఖాస్తు చేసుకోగా, 40,501 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.3 లక్షల అందించాల్సి ఉంది. నిర్మాణాలకు అనుగుణంగా మూ డు విడతల్లో దీనిని అందించాలని భావించింది. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50, జనరల్ కేటగిరీలకు 20 శాతం రిజర్వు చేశారు. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇవ్వాలని భావించినా గుర్తించడంలో జరిగిన ఆలస్యంతో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదు.
Comments
Please login to add a commentAdd a comment