
విపత్తు సాయం పెంపు
● కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ● విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ● బాధిత కుటుంబాలకు ఊరట
బెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల కారణంగా మృతిచెందినవారి కుటుంబాల కోసం సానుకూల నిర్ణయం తీసుకుంది. వడగాల్పులు లేదా ఎండ తీవ్రత వల్ల మరణిస్తే, బాధిత కుటుంబాలకు అందించే విపత్తు సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచింది. వడదెబ్బను ప్రత్యేక విపత్తుగా గుర్తించిన ప్రభుత్వం, ఈ సాయం అందించేందుకు విధివిధానాలను నిర్దేశించింది. విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
నిరుపేదలే బాధితులు..
ఎండాకాలంలో వడదెబ్బ కారణంగా ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. గంటల తరబడి ఎండలో పనిచేసే గ్రామీణ ఉపాధి కూలీలు, భ వన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు, యాచకులు ఎక్కువగా బాధితులు అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ నుంచి జూన్ 15 వరకు ఉష్ణోగ్రతలు 35 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతాయి. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతం నిప్పుల కుంపటిగా మారుతుంది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ వడగాల్పులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
మరణ నిర్ధారణకు మండల కమిటీ
వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు మండలస్థాయిలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో తహసీల్దార్(రెవెన్యూ శాఖ), సబ్–ఇన్‌స్పెక్టర్ (పోలీసు శాఖ), మండల వైద్యాధికారి (వైద్య శాఖ) సభ్యులుగా ఉంటారు. కమిటీ మార్గదర్శకాల ప్రకారం మరణాన్ని ధ్రువీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిర్వహిస్తుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆమోదంతో బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తారు.
ఉపశమనం కోసం ప్రభుత్వం చర్యలు
వడదెబ్బ మరణాలకు పరిహారాన్ని గణనీయంగా పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పించనుంది. సత్వర నిర్ధారణ, పారదర్శక పరిహార పంపిణీతో విపత్తు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ నిర్ణయం లక్ష్యం.