వెంకటస్వామిని సన్మానిస్తున్న ఏరియా జీఎం మనోహర్, ఏరియా అధికారులు
మంచిర్యాల: బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పతకాలతో బత్తుల వెంకటస్వామి విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. కోలిండియా స్థాయి పోటీల్లో రాణిస్తూ సింగరేణిలోని మందమర్రి ఏరియాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. మందమర్రి ఏరియాలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో ఫోర్‌మెన్‌గా బత్తుల వెంకటస్వామి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 4 నుంచి 6వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కోలిండియా బాడీ బిల్డింగ్(90 కిలోల విభాగం) పోటీల్లో బంగారు పతకం సాధించి సింగరేణి పేరు దేశవ్యాప్తంగా మారుమోగించాడు..
వెంకటస్వామి 2006లో సింగరేణి ఎక్స్‌టర్నల్ ఎలక్ట్రీషియన్ పరీక్షలు ఉత్తీర్ణుడై ఎలక్ట్రీ షియన్‌గా విధుల్లో చేరాడు. 2013లో డిపార్టుమెంటల్ పరీక్షలు ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్ పాసయ్యాడు. వ్యాయామంపై ఆసక్తితో జిమ్‌లో చేరాడు. ప్రతీరోజు రెండున్నర, మూడు గంటల వరకు సాధన చేశాడు. బాడీ బిల్డింగ్ పోటీలపై మక్కువ పెంచుకున్నాడు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ సింగరేణి స్థాయిలో ఐదేళ్లుగా రానిస్తున్నాడు.
అభినందనీయం..
మందమర్రి ఏరియాలో ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వర్తించే వెంకటస్వామికి కోలిండియా పోటీల్లో గోల్డ్‌మెడల్ రావడం అభినందనీయం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెంది మరెన్నో గోల్డ్‌మెడల్స్ సాధించాలి. అందుకు సింగరేణి ప్రోత్సాహం ఉంటుంది. – మనోహర్, ఏరియా జీఎం
ప్రతీ ఏరియాలో జిమ్ ఏర్పాటు చేయాలి!
బంగారు పతకం సాధించడంలో సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహం బాగుంది. పోటీలకు వెళ్లే ముందు ప్రత్యేకంగా మరికొంత సమయం ఇస్తే బాగుంటుంది. యాజమాన్యం మరింత సహకరించి ప్రోత్సహిస్తే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటా. సింగరేణిలో యువ ఉద్యోగులు సుమారు 20 వేల మందికి పైగానే ఉన్నారు. ఫిట్‌నెస్ కోసం సింగరేణి వ్యాప్తంగా ప్రతీ ఏరియాలో జిమ్ ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన కోచ్‌లను నియమించాలి. యువ ఉద్యోగులు ప్రతీరోజు జిమ్‌కు వెళ్లడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు విధులకు గైర్హాజర్ కాకుండా హాజరై సంస్థ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిలో పాలుపంచుకుంటారు. – వెంకటస్వామి, కోలిండియా గోల్డ్ మెడలిస్ట్
సాధించిన పతకాలు
ప్రతీ సంవత్సరం డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో సింగరేణిలో నిర్వహించే బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2018–19, 2019–20, 2020–21, 2022–23 సంవత్సరాల్లో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాలు సాధించాడు.
కోలిండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో సింగరేణి తరఫున 2019లో మధ్యప్రదేశ్‌లోని సింగ్రోళిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని కాంస్య పతకం, 2020లో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నిర్వహించిన కోలిండియా పోటీల్లో కాంస్య పతకం, 2022లో పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కత్తాలో నిర్వహించిన పోటీల్లో వెండి పతకం అందుకున్నాడు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం సాధించి దేశవ్యాప్తంగా మందమర్రి ఏరియాకు గుర్తింపు తెచ్చాడు. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీ బిజీగా ఉండే యువతకు వెంకటస్వామి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏదైనా సాధించాలనే తపన ఉంటే సాధనతో సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా తయారవుతారని నిరూపిస్తున్నాడు.
ఇవి చదవండి: మారు పేర్లు మారేదెప్పుడు? చిక్కుముడి వీడేదెప్పుడు?
Comments
Please login to add a commentAdd a comment