ఉత్తరాఖండ్‌లోని ఒక కాలేజీ విద్యార్థులు అందరినీ ఆశ్చర్యపరిచే సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయం తెలిసినవారంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల పండిట్ శివరామ్ ప్రభుత్వ కళాశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
ఈ కళాశాలలో బీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలో 92 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 104 మంది విద్యార్థులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే హిందీ పేపర్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపధ్యంలో జవాబు పత్రాలను మరోమారు మూల్యాంకనం చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ ఫలితాలతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఇటీవల ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో 129 మంది విద్యార్థుల్లో 119 మంది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 104 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థులు మాత్రమే హిందీలో ఉత్తీర్ణులయ్యారు. 100 మంది విద్యార్థుల్లో 61 మంది విద్యార్థులు పొలిటికల్ సైన్స్‌లో ఫెయిల్ అయ్యారు. హిస్టరీలో 56 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లీషులో 28 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
సోషియాలజీలో 39 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రమేష్ రావత్ మాట్లాడుతూ ఈ విషయమై ప్రిన్సిపాల్‌తో మాట్లాడామని, జవాబు పత్రాలను మరోమారు పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అంజనా శ్రీవాస్తవ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రాల పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment