
రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు: మేకపాటి
న్యూఢిల్లీ: తిరుమల వెంకన్న సాక్షిగా, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ హామీలను నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో 2017–18 రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో రైల్వే మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. అలాగే పార్లమెంటు సాక్షిగా, తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలి..’ అని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. నడికుడి–శ్రీకాళహస్తి, మాచర్ల–నల్లగొండ, కాకినాడ–పిఠాపురం, కోటిపల్లి–నర్సాపూర్, ఓబులవారిపల్లె–కృష్ణపట్నం, జగ్గయ్యపేట–మేళ్లచెరువు–జాన్‌పహాడ్, తిండివనం–నగరి, రాయదుర్గ్–తూమ్‌కూర్, కడప–బెంగళూర్, అత్తిపట్టు–పుత్తూరు, నంద్యాల–ఎర్రగుంట్ల, గూడూరు–దుగరాజపట్నం, భద్రాచలం–ధర్మవరం, కుంభం–ప్రొద్దుటూరు, కొండపల్లి–కొత్తగూడెం, చిక్‌బళ్లాపూర్–పుట్టపర్తి రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు.
విజయవాడ–బెంగుళూరు మధ్య రైలు నడపాలి..
ఏపీ రాజధానికి సమీపంలోని విజయవాడ నంచి బెంగళూరుకు రైతుల నడపాలని మేకపాటి కోరారు. తిరుపతి, షిర్డీ మధ్య కొత్త రైలు వేశారని, దీనిని వారంలో కనీసం మూడు రోజులైనా నడపాలని కోరారు. దీనిని సూపర్ ఫాస్ట్ రైలుగా మార్చాలని, రాయితీలు వర్తించేలా నడపాలని కోరారు. నెల్లూరు స్టేషన్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై–హజరత్ నిజాముద్దీన్ గరీబ్‌రథ్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గంగాకావేరీ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలని కోరారు. కావలిలో శబరి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని కోరారు.
వేదాయపాలెం స్టేషన్‌లో పినాకిని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలని కోరారు. బిట్రగుంట వద్ద దాదాపు 1500 ఎకరాల రైల్వే స్థలం ఖాళీగా ఉందని, ఇక్కడ రైల్వే ఇంజినీరింగ్ పరిశ్రమ గానీ, సంస్థలు గానీ ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వేలో భద్రతకు సంబంధించి భారీగా ఖాళీలు ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. మొత్తం 2,17,369 ఖాళీల్లో 1,22,763 భద్రత రంగానికి సంబంధించినవే ఉన్నాయని గుర్తుచేశారు.