- చర్చలు తుది దశలో ఉన్నాయి
- వైఎస్సార్‌సీపీ ఆందోళనతో లోక్‌సభలో ఆర్థిక మంత్రి ప్రకటన
- ప్రత్యేక హోదా తప్ప మరేదీ పరిష్కారం కాజాలదు
- సభలో మేకపాటి ఆందోళన
- పార్లమెంటులో కొనసాగిన వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశానికి పరిష్కార మార్గం వెతుకుతున్నామని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, అవి తుది దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి లోక్‌సభలో ప్రకటన చేశారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ ఆందోళనను ఉధృతం చేయడం, వివిధ పార్టీల సీనియర్ నేతలు వీరికి దన్నుగా నిలవడంతో ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు.
తొలుత ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, బుట్టా రేణుక ప్రత్యేక హోదా అమలుచేయాలంటూ ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం 11.00 సభ ప్రారంభం కాగానే సభాపతి ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయసాగారు. దీంతో సభాపతి ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మీకు జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తాను. మీ సీట్లలోకి వెళ్లండి. ఏంటి ఇది? రోజూ ఇదే పనా? వెల్‌లోకి రావడం, సభకు అంతరాయం కలిగించడమేనా? ఇది సరైన విధానం కాదు. ప్లకార్డులు ప్రదర్శించకండి.. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ స్థానాల్లోకి వెళ్లండి..’ అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని పదే పదే సూచించారు. అయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ నిరసన కొనసాగించారు.
పలుమార్లు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్‌తో వెల్ నుంచే వాగ్వాదానికి దిగారు. ‘ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ సభ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందా? ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కులేదా? ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా?’ అని వాదించారు. దీంతో స్పీకర్ మరింత ఆగ్రహం వ్యక్తంచే స్తూ ‘సభ్యులు ఇలా ప్రవర్తించరాదు. ఆర్థిక మంత్రి ఇదివరకే సమాధానం చెప్పారు.. ఇలాగే చేస్తే నేను చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది..’ అంటూ హెచ్చరించారు.
ప్రభుత్వం వెనక్కిపోరాదుః మేకపాటి
జీరో అవర్ కొద్దిసేపట్లో ముగస్తుందనగా సభాపతి సుమిత్రా మహాజన్ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరారు. దీంతో వెల్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ తమ స్థానాల్లోకి వెళ్లి నిలుచున్నారు. ఈ సందర్భంలో మేకపాటి మాట్లాడారు. ‘మేం వినయపూర్వకంగా మా సమస్యను మీముందుంచుతున్నాం. రాష్ట్ర విభజన సమయంలో ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ప్రత్యేక హోదాపై ప్రకటన చేశారు.
నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ అంశంపై మద్దతు పలకడమే కాకుండా పదేళ్లు అమలుచేయాలన్నారు. అంతేకాకుండా తాము ఎలాగూ అధికారంలోకి వస్తున్నామని, పదేళ్లు అమలుచేస్తామని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా టీడీపీ, బీజేపీ ఈ అంశాన్ని పెట్టి పదేళ్లు అమలుచేస్తామన్నాయి. ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఆనాడు తిరుపతిలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా మాట ఇచ్చారు. నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నంలో కూడా హామీ ఇచ్చారు.
ప్రజలు ఈ హామీని నమ్మి ఓటేసి అధికారం కట్టపెట్టారు. ఐదు కోట్ల ఆంధ్రులు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. తీవ్ర అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తున్నారు. హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వెనక్కిపోరాదు. ప్రత్యేక హోదాకు బదులుగా ఏ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా అందుకు అది ప్రత్యామ్నాయం కాదు. ప్రజలు ఆమోదించరు.. ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. త్వరితగతిన ప్రత్యేక హోదా ప్రకటించి అమలుచేయాలి..’ అని పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి సమాధానం
మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తడంతో దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ సభ్యులు, ఇతర సభ్యులు ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు. ఇదివరకు పలు సందర్భాల్లో నేను సభకు హామీ ఇచ్చాను. కేంద్రం ఈ అంశంపై పూర్తిగా దృష్టిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఆదాయం, ఆర్థిక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని భర్తీ చేయాలన్న సభ్యుల వాదనతో మేం ఏకీభవిస్తున్నాం. చట్టపరంగా, ఇతరత్రా అనేక హామీలు ఇచ్చాం.
ప్రతి ఒక్క అంశాన్ని మేం పరిశీలిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నాం. ఇవి తుది దశలో ఉన్నాయి. త్వరలోనే ఒక పరిష్కారానికి వస్తాం..’ అని పేర్కొన్నారు. ఈ సమాధానానికి సంతృప్తి చెందని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక హోదా మాత్రమే పరిష్కారమార్గం కావాలని పట్టుపట్టారు. టీడీపీ సభ్యులు లేచి పరిష్కారానికి ఇంకెంత కాలం పడుతుందంటూ ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం
Published Mon, Aug 8 2016 8:28 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement