ఆ భారం ఆమెపైనే...! | Men Fear on Family Planning Oparations | Sakshi
Sakshi News home page

ఆ భారం ఆమెపైనే...!

Published Sat, May 11 2019 2:00 PM | Last Updated on Sat, May 11 2019 2:00 PM

Men Fear on Family Planning Oparations - Sakshi

కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులు

కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సచేయించుకుంటే ఇక బరువైనపనులేమీ చేయకూడదనీ...ముందు ముందు ఏదైనా అనుకోనిసమస్య ఎదురైతే ప్రాణాలకే ముప్పువాటిల్లుతుందనీ... శస్త్రచికిత్సఫెయిలయ్యే ప్రమాదం ఉందనీమగవారిలో కాస్త అనుమానాలుఎక్కువవుతున్నాయి. ఈ కారణంగా శస్త్రచికిత్సలకు వారు దూరంగా ఉంటున్నారు. ప్రసవ వేదనఅనుభవించే మాతృమూర్తే దీనికిముందుకు రావాల్సి వస్తోంది.
ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్నగణాంకాలు ఈ విషయాన్నిరుజువు చేస్తున్నాయి.

విజయనగరం ఫోర్ట్‌:
మాతృమూర్తులకు ప్రసవ వేదనతో పాటు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల బాధ్యతా తప్పడం లేదు. ఇప్పటికే సాధారణ ప్రసవాలు తగ్గిపోయి సిజేరియన్ల సంఖ్య పెరుతుండగా మహిళలకు కడుపుకోతలు తప్పడం లేదు. దీనికితోడు కుటుం బ సంక్షేమ శస్త్రచికిత్సలకు పురుషులు ఆసక్తి చూపకపోవడంతోఆ భారం మహిళలపైనే పడుతోంది. 99 శాతం మహిళలు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేసుకుంటుండగా, ఒకశాతం మంది పురుషులు మాత్రమే శస్త్రచికిత్సలు చేసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అవగాహన లేకపోవడంవల్లే...
కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు ఆడవారి కంటే మగవారికే సుల భం. పైగా పారితోషకం కూడ మగవారికే ప్రభుత్వం ఎక్కువగా ఇస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు. అయినా పురషులు ముందుకు రావడం లేదు. కేవలం కొద్ది మంది మాత్రమే దానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ శస్త్రచికిత్స చేయించుకుంటే సమాజంలో తమను చిన్న చూపు చూస్తారని, హేళన చేస్తారనే భావంతో కొందరు, దాంపత్య జీవి తంలో ఇబ్బందులు ఉంటాయని మరి కొందరు పురుషులు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... వ్యాయామం చేసేటపుడు, బరువైన పనులు చేసేటపుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయని కొందరు భావిస్తుండగా... ఇంకొందరు ఉద్యోగానికి లేదా పనికి సెలవు పెట్టాల్సివస్తుందన్న భయం కూడ ఉంది.

పురుషులకే పారితోషికం ఎక్కువ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయడంతో పాటు ప్రభుత్వం పారితోషకం  కూడా ఇస్తుంది. మహిళలకు రూ.600లు, పురుషులకు రూ.1100లు చొప్పున అందిస్తున్నారు. మహిళలు చేయించుకునే శస్త్రచికిత్సకు ట్యూబెక్టమీ అని, మగవారికి చేసే శస్త్రచికిత్సను వేసెక్టమీ అని అంటారు. వాస్తవానికి ఈ శస్త్రచికిత్స ఆడవారికంటే మగవారు చేయించుకుంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్‌ చేయించుకున్న పురుషులు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కూడా తక్కువే అని, మహిళలు దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు మహిళలు మూడు నెలల వరకు బరువు పనులు చేయ కూడదని కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. తొందరగా వారు బలహీనులు కావడం... ఎక్కువ పనిచేస్తే అలసట ఎక్కువగా ఉండటం... దూరం నడవలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు మహిళలే చెబుతున్నారు.

మూఢ నమ్మకాలే కారణం
కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలపై అపోహలు, మూఢ నమ్మకాలు చాలా మందిలో ఉన్నాయి. అందువల్లే పురుషులు వీటికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి పురుషులకు వేసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులభంగా చేయొచ్చు. ఉదయం ఆపరేషన్‌ చేయించుకోవడానికి వస్తే సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవచ్చు. మరునాటి నుంచి యాధావిధిగా పనులు చేసుకోవచ్చు.– డాక్టర్‌ సి.పద్మజ, అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement