‘మెట్రో’ నివేదిక బాధ్యత డీఎంఆర్‌సీకి
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. ఆర్థిక శాఖ ఆమోదం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) పరిధిలో, విశాఖ, తిరుపతి ల్లో ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు ప్రాజెక్టుల కీలకమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎంఆర్‌సీ మాజీ ఎండీ శ్రీధరన్ ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు పనిచేసేందుకు ఇటీవలే అంగీకరించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతలను కూడా డీఎంఆర్‌సీకే అప్పజెపితే బావుంటుందన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఇందుకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్‌టీఎస్)లో భాగంగా విజయవాడ (వీజీటీఎం పరిధి), విశాఖపట్నం నగరాల్లో 4 కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో వీజీటీఎం పరిధిలో 49 కిలోమీటర్లు, విశాఖపట్నంలో 20 కిలోమీటర్లు నిర్మించనున్నారు.
వీజీటీఎం, విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్లకు చైర్మన్‌లు, డెరైక్టర్లను గత నెల 13వ తేదీనే ప్రభుత్వం నియమించింది. వీటితోపాటు తిరుపతి నగరంలోనూ ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నగరాల్లో ఎక్కువ జనాభా, రద్దీ (ట్రాఫిక్) ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు తొలి అడుగుగా భావించే డీపీఆర్ బాధ్యతలను డీఎంఆర్సీ చేపట్టనుంది. ఈ సంస్థ మూడు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు రూట్ మ్యాప్, స్థల సేకరణ, భూసార పరీక్ష (సాయిల్ టెస్టింగ్), ప్రాజెక్టు అంచనా వ్యయం తదితరమైనవన్నీ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక వచ్చాకే పనులు మొదలవుతాయి. ఇందుకోసం డీఎంఆర్‌సీ అధికారుల బృందం త్వరలోనే మూడు నగరాలకూ వస్తుందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి మెట్రో రైలు హైదరాబాద్ తరహాలో ఉంటుందా లేక ఢిల్లీ తరహాలోనే భూగర్భంలో నిర్మిస్తే బావుంటుందా అన్నది కూడా డీఎంఆర్‌సీ అధికారులు వారి నివేదికలో తెలుపుతారని చెప్పారు. గతంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తిరుపతి మెట్రో రైలు ప్రస్తావన లేకపోయినా, దీనికి కూడా ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసుకోవాలని, ఆ తర్వాత పరిస్థితినిబట్టి ఇక్కడ ప్రాజెక్టును చేపట్టాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.