తీపి పని.. చేదు బతుకు | Migratory Life Of People For Sugarcane Cutting In Srikakulam | Sakshi
Sakshi News home page

తీపి పని.. చేదు బతుకు

Published Sat, Feb 8 2020 8:50 AM | Last Updated on Sat, Feb 8 2020 8:50 AM

Migratory Life Of People For Sugarcane Cutting In Srikakulam - Sakshi

తాత్కాలికమే తప్ప శాశ్వత చిరునామా అన్నది వారెప్పుడో మర్చిపోయారు. ఉన్నవారితో సందడిగా గడపడమే తప్ప పండగ పూట అన్న పదమే వదిలేశారు. బంధువులెందరో ఉన్నా వారితో బంధాలకు ఎప్పుడో దూరమైపోయారు. వలస బతుకుల చిత్రమిది. చెరుకు కటింగ్‌ పనుల కోసం జిల్లాకు వచ్చే వలస జీవులు ఈ పనులయ్యే వరకు ఇక్కడే ఉంటారు. ఇవయ్యాక మరో పని వెతుక్కుంటూ కొత్త చిరునామా అందుకుంటారు. బతుకంతా ఇలా తిరిగేస్తూ గడిపే ఈ మనుషులకు కాసింత స్థిమితం కోరుకుంటున్నారు. ప్రస్తుతం బూర్జ మండలంలో బూర్జ, నారాయణపురంలో నివాసం ఉంటున్న ఆ కుటుంబాల జీవన విధానం గురించి.

బూర్జ ఆస్పత్రి బయట వేసుకున్న గుడారాలు 

సాక్షి, బూర్జ: దాదాపు వంద మంది. అందరిదీ ఒకే కుటుంబం. ఒంగోలు జిల్లా యరగుండపాలెం మండలం యగోతమ్మడాపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వచ్చారు. అక్టోబర్‌కే వీరంతా జిల్లాకు చేరుకున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో చెరుకు కటింగ్‌ చేయడమే వారికి తెలిసిన విద్య. అదే జీవనాధారం. ఈ పనులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్తుంటారు. ఈ కుటుంబమే కాదు ఇలా వందలాది కుటుంబాలు ఇలా వలస జీవనానికి అలవాటు పడ్డాయి.  పాలకొండ మండలం సంకిలిలో ఉన్న చక్కెర కర్మాగారంతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ ప్రకారం బూర్జ మండలంలోని బూర్జ, వావాం, మామిడివలస, ఉవ్వపేట, కాఖండ్యాం, లంకాం, చినలంకాం, నారాయణపురం, గుత్తావల్లి, లాభాం, గంగంపేట వంటి గ్రామాల్లో ఉన్న చెరుకు కోత పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏడాదిలో దాదాపు ఎనిమిది నెలల ఈ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. గుడారాలు వేసుకొని అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు. మిగిలిన నాలుగు నెలలు మాత్రమే స్వగ్రామాల్లో గడుపుతారు. పొట్టకూటి కోసం సంచార జీవనం వారికి తప్పటం లేదు.

చంటి పిల్లకు గోరుముద్దలు పెడుతున్న చిన్నారి 

ఆదాయం అంతంతమాత్రం  
పుట్టిన ఊరిని, కన్నవారిని వదిలి చంటి పిల్లలను సైతం చంకన వేసుకొని ఇంటిల్లి పాది బూర్జ మండలం చేరుకున్నారు. గుడారా లు వేసుకొని తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు చాలీచాలని వేతనంతో జీవనం సాగిస్తున్నారు. ఈ వలస జీవులు టన్ను చెరుకు కోస్తే 600 రూపాయలు ఇస్తారు. వేరే పనులు చేతకానందున దాంతోనే సంతృప్తి చెందక తప్పటం లేదు.


చంటి పిల్లకు స్నానం చేయిస్తున్న చిన్నారి

పండగలకు దూరం  
పండగలకు, పబ్బాలకు, అనుబంధాలకు, బంధు మిత్రులకు దూరంగా వీరు ఒంటరి జీవితాలు సాగిస్తున్నారు. పనిచేస్తున్న చోటే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే కలో గంజో తాగుతూ చీకటిలోనే జీవితాలు వెల్లదీస్తున్నారు. సొంత గ్రామాల్లో తల్లితండ్రుల నీడలో, అమ్మ ఒడిలో ఇంటి పట్టున ఉంటూ అల్లారు ముధ్దుగా పెరగాల్సిన చిన్నారులు ఈ చీకటిలో మగ్గిపోతున్నారు. ముఖ్యంగా వీరు చదువులకు దూరమవుతున్నారు. అక్షర జ్ఞానం లేని నిరుపేదలుగా మిగిలి పోతున్నారు. ఈ సంచార జీవుల చంటిపిల్లల ఆలనా పాలనా చూసుకునేందుకు గుడారాల వద్ద చిన్నారులే ఉంటున్నారు. వారికి పట్టుమని పదేళ్లు కూడా ఉండవు. ఈ గుడారాల్లో తల్లిపాలు వదలని నెలల పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఏడాది కొందరు మాత్రం అమ్మ ఒడి పథకం వల్ల కొద్దిగా ఎదిగిన పిల్లలను బడికి పంపించారు.


ఊయల ఊపి జోల  పాడుతున్న అమ్మాయి 

అమ్మ ఒడి ఎంతో మేలు చేసింది
కొత్త ప్రభుత్వం అమ్మ ఒడి పథకం అమలు చేయటంతో ఈ ఏడాది చదువుకునే పిల్లలను అక్కడే వదిలి వచ్చాం. ఇంకొంత మందిని మా త్రం ఇక్కడకే తీసుకు రావాల్సి వచ్చింది. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం అందించిన రూ.15000లు మా బ్యాంక్‌ ఖాతాలో జమ అయిందని మా బంధువులు పోన్‌ చేస్తే ఈ మధ్యన మా ఊరు వెళ్లి డబ్బులు తీసుకున్నాం. అమ్మ ఒడి ఎంతో మేలు చేసింది. 
– సన్యాపోగు కూపమ్మ, యరగుండపాలెం, ఒంగోలు  

అనుబంధాలకు దూరం  
ఇదే మాకు జీవనాధారం. చక్కెర కర్మాగారం వారు అడ్వాన్స్‌లు ఇస్తా రు. ఆ డబ్బు చెల్లించే వరకు ఇక్కడ పనులు చేయాల్సిందే. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే మా సొంత గ్రామాల్లో ఉంటాం. మిగిలిన ఎనిమిది నెలలు ఉపాధి కోసం చెరుకు పండించే ఇతర జిల్లాలకు వెళ్తుంటాం. ఆ ఎనిమిది నెలలు ఊరిలో ఎలాంటి శుభ కార్యాలు ఉన్నా వెళ్లలేం. వెళ్లాలని సరదా ఉన్నా బలవంతంగా మా కోర్కెలను చంపుకుంటాం. 
– పూర్ణగంటి గంగయ్య, యగోతమ్మడాపల్లి, ఒంగోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement