సాక్షి ప్రతినిధి, గుంటూరు : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం అమలులో మిల్లర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారు. ధాన్యం తీసుకున్న మిల్లర్లు మర ఆడించి 15 రోజుల్లో పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఇవ్వాల్సి ఉంటే, నెలల తరబడి జాప్యం చేస్తూ ఆ బియ్యాన్ని మార్కెట్‌లో అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ఇచ్చిన ధాన్యానికి 91,216 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంటే ఇంకా రూ. 42 కోట్ల విలువైన 7038 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వకుండా మిల్లర్లు ఆ సొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారు.
8 నెలలుగా జాప్యం..
రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్తగా సీఎంఆర్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఐకెపి కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఆన్‌లైన్‌లో నగదు చెల్లించే ఏర్పాటు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుని తమ మిల్లులో మర ఆడించి క్వింటా ధాన్యానికి 67 శాతం బియాన్ని పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాలి. మర అడించినందుకు బస్తాకు రూ.15 లను మిల్లింగ్ ఛార్జీలు ఇవ్వడానికి నిర్ణయించారు. వీటితోపాటు మిల్లరుకు తవుడు, నూక లు మిగులుతాయి. అయితే లోబరుచుకుని తీసుకున్న ధాన్యానికి అనువుగా బియ్యం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఆ బియ్యంతో బయట వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
జిల్లాలో 450 మిల్లర్ల మర ఆడించేందుకు ప్రభుత్వం నుంచి 1,35,909 మెట్రిక్ టన్నులు ధాన్యం తీసుకున్నారు. వీరిలో కొం దరు మిల్లర్లు ఎనిమిది నెలల నుంచి బియ్యం ఇవ్వడం లేదు. 91,216 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు 84,178 మెట్రిక్ టన్నుల భియ్యం ఇచ్చారు. రూ.42 కోట్ల విలువైన 7,038 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. బాపట్ల, పొన్నూరు, వినుకొండ, పిడుగురాళ్లకు చెందిన మిల్లర్లు ఈ బియ్యం ఇవ్వాల్సి ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడంతో బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్లను హెచ్చరించారు. బాపట్లకు చెందిన ఒక మిల్లరు ఒక్కరే రూ.5 కోట్ల విలువైన బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ మిల్లరుకు తెలుగుదేశం నేతల ఆశీస్సులు ఉండటంతో ఎటువంటి చర్యలు తీసుకోకుండా త్వరగా బియ్యం ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల సంస్థ మేనేజరు రంగకుమారిని ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా, ఈ నెల 25 లోపు బియ్యం ఇవ్వడానికి గడువు ఇచ్చామని, ఆ తేదీకి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మిల్లర్లపై పెరుగుతున్న వత్తిడి..
కొందరు మిల్లర్లు చేసిన అక్రమ వ్యవహారం తమపై ప్రభావం చూపుతుందనే భయాన్ని మిగిలిన మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. బియ్యాన్ని ఇవ్వాల్సిన మిల్లర్లు తక్షణమే వాటిని ఇవ్వకపోతే మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు నిలుపుదల చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని,ఎటువంటి చర్యలు తీసుకున్నా ఆసోసియేషన్ పట్టించుకోదని మిగిలిన మిల్లర్లు చెబుతున్నారు.
బొక్కేసి.. నొక్కేసి
Published Sun, Jul 19 2015 2:15 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement