సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మిల్లింగ్ మాయ’పై కఠిన చర్యలకు సంబంధిత విభాగాలు కదులుతుంటే.. వాటిని అడ్డుకొనేలా మేనేజ్ చేసేందుకు అదేస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాడు. ‘సీఎంఆర్’ బియ్యం పక్కదారి పడుతున్న ఉదంతంపై ‘మిల్లర్ల మాయ’ శీర్షికతో 9.8.14నాటి సాక్షి జిల్లా సంచికలో ప్రత్యేక వార్తా కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. మిల్లర్లు చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుండడంతో మిల్లింగ్‌తో సంబంధం ఉన్న అన్ని విభాగాలపైనా రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులు కన్నేశారు. మిల్లర్ల అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికలు వెళ్లాయి. అయితే అక్రమార్కులకు ప్రస్తుతం కొన్ని యూనియన్ల నాయకులు తోడయ్యారు.
మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. అధికారులు కొన్నిచోట్ల గుట్టుగా దాడులు చేసినా పత్రికల్లో తమపై వార్తలు వస్తుండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో మిల్లర్లు ఉన్నారు. కొన్ని కేసులు చిన్నవేనంటూ బుకాయిస్తున్నారు. ఇన్నాళ్లూ చూసీ చూడనట్టు వ్యవహరించిన అధికారులు కూడా ఈ భారీ అక్రమాలపై నిఘా అధికారుల దృష్టి పడటం తో కలవరపాటుకు గురవుతున్నారు. మరోవైపు కేసుల్లేకుండా చూసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయించేందుకు కొంతమంది మిల్లర్లు సిద్ధమయ్యారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులను బహిరంగంగానే టార్గెట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడున్న పెద్దలను మచ్చిక చేసుకునేందుకు బయల్దేరారు.
సాధారణంగా బియ్యం అక్రమమార్గంలో రవాణా అవుతున్నా, లెక్కకు మించి స్టాకు కనుగొన్నా అధికారులు ‘6ఏ’ కేసులు నమోదు చేస్తుం టారు. అయితే ఇటీవల జిల్లాలో భారీ ఎత్తున మిల్లర్లు అక్రమాలకు పాల్పడడడంతో ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయించి, ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం మొత్తాన్ని రెవెన్యూ రివకరీ (ఆర్‌ఆర్) యాక్టు కింద వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. అక్రమ నిల్వలను సీజ్ చేశారు. పదుల సంఖ్యలో స్థానిక తహశీల్దార్లు, పోలీసుల ఆధ్వర్యంలో కేసుల నమోదుకు సిద్ధమయ్యారు. ఇక్కడే మిల్లర్లకు కొంతమంది సాయపడేందుకు ముం దుకు వచ్చారు.
డబ్బిస్తే ఏ అధికారి అయినా మెడ వంచాల్సిందేనని, అవసరమైతే ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల్ని మామూళ్లతో కలిస్తే పని అయిపోతోందని భరోసా ఇస్తున్నారు. ఇందుకు మిల్లర్ల పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి యూనియన్ నాయకుల ద్వారా రాజధానిలోని ఓ మంత్రికి ఇప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం. తద్వారా కేసులు లేకుండా మాఫీ చేయాలని, తమకు ఇబ్బంది పెడుడుతున్న అధికారులను ఇక్కడి నుంచి పంపించేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవలే బదిలీలకు పచ్చజెండా ఊపేయడం, నిషేధం ఎత్తేయడంతో ఈ అంశానికి మరింత బలం చేకూరుతోంది.
మొక్కుబడి కేసులతోనే సరిపెట్టండి
అక్రమాలపై 6ఏ కేసులతోనే సరిపెట్టేయాలని మిల్లర్లు కోరుతున్నారు. క్రిమినల్ కేసులైతే కోర్టులు చుట్టూ తిరగాల్సి రావడం, మిల్లులు సీజ్ అయితే తమకు ఆర్థికంగా నష్టం వస్తుందనే ఆలోచనలో మిల్లర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మిల్లర్లు చేసే అక్రమాలకు సీ ఫీజ్ గానీ, ఫైన్ గానీ కట్టించి, ప్రభుత్వ నష్టాన్ని పూరించేందుకు తమకు మరింత గడువిస్తే నష్టపోయిన మొత్తానికి బియ్యమే ఇచ్చేస్తామని, అందువల్ల కేసులు మరెందుకంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కేసుల నుంచి తమకు విముక్తి కలిగిస్తే పెద్ద మొత్తంలో నజరానా ముట్టజెబుతామని ఆశ చూపుతున్నారు.
కేసుల్ని ‘మామూలు’గానే సరిపెట్టేయాలంటూ పెద్దలు రంగంలోకి దిగడంతో దర్యాప్తు చేపట్టిన అధికారులకే ఇప్పుడు కలవరం పుడుతోంది. అంత కష్టపడి కేసులు నమోదు చేయిస్తే మిల్లర్లు డబ్బుతో ప్రభుత్వ పెద్దల్నే మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసుల నుంచి విముక్తి కలగకుండా ఉండేందుకు చట్టంలోని అన్ని నిబంధనల్నీ జోడించేందుకు సిద్ధమవుతున్నారు. కేసు వీగిపోకుండా గట్టిగా నివేదికలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లగా జిల్లాలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీసే పనిలో పడ్డారు. ప్రభుత్వ విభాగాలన్నీ ఒకటై మిల్లర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది.
‘మామూలు’గా సరిపెట్టేద్దాం!
Published Sun, Aug 10 2014 2:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement