బోధన్, న్యూస్‌లైన్ :
ఎంఐఎం పార్టీ బోధన్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలనే యోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది. బోధన్ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేలా ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ తమ అభ్యర్థిని బరిలో నిలపాలన్న లక్ష్యంతో ఎంఐఎం సాగుతోంది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. శనివారం రాత్రి బోధన్‌లో నిర్వహించిన సభలో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఐక్యతతో సాగి సత్తా చాటుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సభను సద్వినియోగం చేసుకుంటూ..
నిజాం షుగర్స్ ప్రైవేట్ జాయింట్ వెంచర్‌పై శనివారం నాటి సభలో అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రాంత రైతులు, కార్మికుల కష్టాలను ప్రస్తావించారు. తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డి నియమించిన మంత్రి వర్గ ఉప సంఘాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమించిన శాసనసభా సంఘం సిఫారసులను ప్రస్తావించారు. త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో వాటిపై తేల్చుకుంటామన్నారు. నిజాం షుగర్స్‌ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఈ ఫ్యాక్టరీ సమస్యగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
సంప్రదాయ ఓటు బ్యాంక్
నియోజకవర్గంలోని బోధన్, ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాల్లో ఎంఐఎం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. 1999 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయా ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు సహకరించింది. ఇక్కడ ముక్కోణపు పోటీ ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నాయకుడు మహ్మద్ షకీల్, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి కేవలం 1,200 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. షకీల్ ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఘన చరిత్ర
మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఆధిక్యత చాటిన కాంగ్రెస్‌కు 1995 బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం షాక్ ఇచ్చింది. మొత్తం 35 కౌన్సిలర్ స్థానాల్లో ఎంఐఎం 14 స్థానాలు గెలుచుకుంది. చైర్మన్‌గా ఆ పార్టీ అభ్యర్థి ఇబ్రహీం గెలిచారు. ఆ తర్వాత 2000 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2005లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి ఏడుగురు కౌన్సిలర్లు విజయం సాధించారు. ఇటీవల అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఆయనను అరెస్టు చేయించడం వంటి ఘటనలతో కాంగ్రెస్, ఎంఐఎం సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఈసారి బరిలో నిలవాలని ఎంఐఎం యోచిస్తోంది. ఆరు నెలలుగా చాపకింద నీరులా నియోజకవర్గంలో విస్తరిస్తోంది. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి నూతన కమిటీలను ఏర్పాటు చేస్తోంది. నియోజక వర్గం పరిధిలోని మండలాలపైనా దృష్టి సారించింది.
ఎంఐఎం చూపు బోధన్ వైపు
Published Mon, Dec 16 2013 2:49 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement