
మినీ మేడారం
సరకాల : అగ్రంపహాడ్ జాతర తర్వాత అతిపెద్ద జాతరగా అగ్రంపహాడ్(రాఘవాపురం) సమ్మక్క, సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. రెండేళ్లకోసారి సంప్రదాయబద్ధంగా జాతర నిర్వహిస్తారు. ఇక్కడ కూడా ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతోంది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ పుట్టినతావు అగ్రంపహాడ్ అని పూర్వీకులు చెప్పుకునేవారు. ఆ నమ్మకంతోనే భక్తులు మేడారంలో అమ్మవార్లను దర్శించుకుని వెళుతూ ఇక్కడ కూడా తల్లులకు మొక్కులు సమర్పిస్తారు.
ఇక్కడికి రాగానే దేవుడు పూనేది..
ప్రస్తుతం జాతర జరుగుతున్న ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే శివసత్తులకు పూనకాలు వచ్చేవని పెద్దలు చెబుతారు. ‘నేను పుట్టింది ఇక్కడే.. నన్నెవరూ పట్టించుకుంటలేరు’ అంటూ పూనకంలో చెప్పేవారట. ఇక్కడ ఓ పుట్ట ఉండేదని, అక్కడ వనం(లంక చెట్టు) మొలిచిందని చెబుతున్నారు. దీంతో ఇక్కడి పెద్దలు బాగా ఆలోచించి ఇక్కడ సమ్మక్క, సారలమ్మలకు గద్దెలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల అటవీ ప్రాంతంగా ఉండేదని, సమ్మక్క, సారమ్మలు కొలువైన తర్వాత ఇక్కడ పాములు, తేళ్లు తిరిగినా తల్లుల దయతో ఎవరినీ ఏమీ చేయలేదని చెబుతున్నారు. ప్రజలను రోగాలబారి నుంచి తల్లులు కాపాడేవారని భక్తుల నమ్మకం. అప్పుడు మొలిచిన వేపచెట్టు ఇప్పటికి గద్దెలో ఉంది. కాగా, అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మలకు మట్టితో వందేళ్ల కింద గోనెల బాలయ్య, సమ్మయ్య, నర్సయ్య, గొల్లపెల్లి నరహరి గద్దెలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు.
ముదిరాజ్‌లే పూజారులు..
అగ్రంపహాడ్ జాతరలో ప్రధాన పూజారులు ముదిరాజ్‌లు కావడం విశేషం. మేడారంలో కోయలు పూజారులు కాగా.. ఇక్కడ ముదిరాజ్‌లు. గోనెల సారంగపాణి, నర్సింహరాములు, రవీందర్, రేగుల బిక్షపతి, గోనెల లక్ష్మి, ఉడుతలబోయిన గోవర్ధన్ ముదిరాజ్‌లు. గొల్లపెల్లి సాంబశివరావు మాత్రం మున్నూరుకాపు కులస్తుడు.
ఎడ్లబండ్లు ఎక్కువగా వచ్చేవి..
గతంలో అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు ఎడ్లబండ్ల పై వచ్చేవారు. ఇప్పుడు వివిధ వాహనాల్లో భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.