సాక్షి, ములుగు: సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్‌తో కూడిన బేస్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేస్ క్యాంప్‌లో 7 కిలో మీటర్ల పొడవునా 50 క్యూ లైన్లను నిర్మించినట్లు వివరించారు.
భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆదివారం నుంచి 25వ తేది వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఈ జాతరకు పని చేస్తున్నారని స్పష్టం చేశారు. సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతరకు అమల్లో ఉందని, మహిళలు పైసా ఖర్చు లేకుండా తల్లులను దర్శించుకోవచ్చన్నారు. గతంలో భక్తులు పెద్ద ఎత్తున కాలినడకన మేడారం జాతరకు వచ్చే వారని, ఉచిత ప్రయాణం వల్ల సురక్షింతంగా బస్సుల్లో వస్తున్నారని పేర్కొన్నారు.
మేడారం జాతరకు బస్సుల్లో వచ్చే భక్తులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు నిబద్దత, క్రమ శిక్షణతో పని చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ రఘునాథ రావు, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment