సాక్షినెట్‌వర్క్: మన్యం గజగజ వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో రెండు రోజులుగా చలి ఉధృతమైంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఆదివారం రాత్రి అత్యల్పంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగిలో ‘0’ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 1.5 పాడేరు, మినుములూరు ప్రాంతాల్లో 4డిగ్రీలు, డల్లాపల్లి, మోదాపల్లి ప్రాంతాల్లో 3డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ పరిశోధన విభాగం పర్యవేక్షకుడు దిలీప్ తెలిపారు.
పగటి ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గిపోయాయి. 2012 జనవరి 14న 2 డిగ్రీలు, 15న 1 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఆరేళ్ల తరువాత అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉండడంతో ఆదివాసీలు వణికిపోతున్నారు. రాత్రిళ్లు వర్షంలా మంచు కురుస్తోంది. సాయంత్రం 3 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. ఆరు బయట ప్రాంతాలన్నీ మంచుతో తడిసిముద్దవుతున్నాయి. రాత్రి పూట పచ్చిక బయళ్లు, వాహనాల మీద పడుతున్న మంచు ఉదయానికి ఐస్‌లా మారుతోంది. ఉదయం 10గంటల వరకు సూర్యోదయం కానరావడం లేదు.
జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వృద్ధులు, ఉదయం బారెడు పొద్దెక్కే వరకు కూడలి ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. డిసెంబర్ 27 వరకు చలి తక్కువగానే ఉండేది. వాతావరణంలో మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి పొగమంచు ఉధృతమవ్వడంతో చలి అధికమైంది. వృద్ధులు, చిన్నారులు, ఉదయాన్నే పొలానికి పనికి వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. మరి కొద్ది రోజులు చలి తీవ్రత ఇలాగే ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment