రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా | Mining Mafia In Guntur | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా

Published Sat, Jun 9 2018 1:22 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Mining Mafia In Guntur - Sakshi

ట్రాక్టర్లలో తరలిస్తున్న దృశ్యం

పిడుగురాళ్లటౌన్‌: అధికారమే ఆయుధంగా టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. పల్నాడులోని సీనియర్‌ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండలంలోని కోనంకి గ్రామ పరిధిలో ఉన్న సీతారాంపురం మైన్స్‌ ముగ్గురాయిని అక్రమంగా తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అడ్డగోలుగా భారీ పేలుళ్లు జరుపుతూ, భూగర్బాన్ని చీలుస్తూ ముగ్గురాయిని బహిరంగంగా తరలిస్తున్నా మైనింగ్‌శాఖా పట్టించుకోవడంలేదు. పేలుళ్ల ధాటికి సమీపంలోని పులిచింతల పునరావాస కేంద్రం వణికిపోతుంది. పక్కనే ఉన్న రైల్వేట్రాక్‌కు కూడా ప్రమాదం పొంచివుంది. పులిచింతల కాలనీలో,  కొండమోడు గ్రామంలో ఉండలేమంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. అనుమతి లేకున్నా విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి ఏటా ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.15కోట్లు గండికొడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పిడుగురాళ్ల శివారు కొండమోడు గ్రామ సమీపంలో ఉన్న సుమారు 630 ఎకరాల భూములను గతంలో ఏసీసీ లీజుకు తీసుకుంది. గడువు పూర్తి కావడంతో 30 ఏళ్ల కిత్రం ఆ భూములను రెవెన్యూ శాఖకు అప్పగించి వెళ్లింది. ఆ రోజు నుంచి అక్రమార్కుల కన్ను ఆ క్వారీ భూములపై పడింది. ఆ భూముల్లో విలువైన ముగ్గురాయి నిక్షేపాలు ఉన్నాయని గ్రహించి కొద్ది కొద్దిగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. అయితే అధికారం మారటంతో ముగ్గురాయి క్వారీలపై ఓ ప్రజాప్రతినిధి చూపుపడింది. వెంటనే తెలుగు తమ్ముళ్లకు ముగ్గురాయి క్వారీని సొంతం చేసుకోమని ఆదేశించారు. అప్పటికే సీతారాంపురం మైన్స్‌లో లీజు పొందిన వారిని బెదిరించి క్వారీ గుంతలలోకి రాకుండా చేశారు. ప్రభుత్వం తమదంటూ, ప్రభుత్వ భూములు తమకే చెందుతాయంటూ క్వారీ భూముల్లో తవ్వకాలు ప్రారంభించారు. ఒక్కొక్క ట్రాక్టర్‌కు రూ.1000 వసూలు చేస్తూ ప్రతిరోజు వందల ట్రాక్టర్ల ద్వారా ముగ్గురాయిని తరలిస్తున్నారు.

నిత్యం ట్రాక్టర్‌కు 4 టన్నుల చొప్పున 60 ట్రాక్టర్ల ద్వారా రోజుకు 300 ట్రిప్పులు ముగ్గురాయిని తరలిస్తూ రోజుకు రూ.3లక్షలకు పైగా ఆదాయం గడిస్తున్నారు. ఈ లెక్క చొప్పున నెలకు రూ.3కోట్లు, ఏడాది రూ.15కోట్లకుపైగా అక్రమంగా ఆర్జిస్తున్నారు. రూ. 10వేల జీతం ఇస్తూ 20 మంది యువకులను మీడియా, ప్రతిపక్ష నాయకులు రాకుండా క్వారీ ప్రాంతంలో కాపలాగా పెట్టడం విశేషం. అనుమతులు లేకుండా భారీ  పేలుళ్లు జరుపుతున్నా పట్టించుకునే నాథుడేలేడు. పేలుళ్ల ధాటికి సమీపంలో ఉన్న పులిచింతల పునరావాసకేంద్రంలోని గృహాలు దెబ్బతింటున్నాయి. వందల ట్రాక్టర్లు నిత్యం పునరావాస కేంద్రం గుండా తిరుగుతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నా ప్రశ్నించే అధికారే కరువయ్యారు. ఈ విషయమై నిర్వాసితులు మైనింగ్‌శాఖకు, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులకు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులకు ఫిర్యాదు చేసినా కన్నెత్తి చూడటంలేదు.  ఎటువంటి అనుమతులు లేకుండా ముగ్గురాయిని తరలిస్తున్నా మొన్నటి వరకు పట్టించుకున్న అన్నిశాఖలు ఇప్పుడు మొద్దునిద్ర నటిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement