పాలమూరు, న్యూస్‌లైన్: ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని, పేదలకు సంక్షేమఫలాలు అందించే విధంగా కృషిచేస్తున్నామని మంత్రి డీకే అరుణ అన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధికి పెద్దపీట వేశామని, అందులో భాగంగానే జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయరంగంలో పురోగతి సాధించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు.
ఈ ఖరీఫ్‌లో 7,07,850 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి ఇప్పటికే 6,64,690 హెక్టార్లలో పంటలు సాగయ్యాయని వెల్లడించారు. 67వ స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని గురువారం జిల్లా పోలీస్‌పరేడ్ మైదానంలో జెండాను ఆవిష్కరించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. ఉత్సవాల్లో కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.
‘మైక్రో ఇరిగేషన్’ అమలుకు
ప్రణాళిక
ఈ ఏడాది రూ.185 కోట్ల వ్యయంతో 64,787 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలుకు ప్రణాళిక చేపట్టామన్నారు. గతేడాది రూ.13 లక్షల సబ్సిడీతో 18 మినీ డెయిరీ యూనిట్లు మంజూరుకు సిద్ధంచేశామని, 1,447 హెక్టార్లలో పండ్లతోటల పెంపకం పథకం కోసం రూ.181 లక్షలు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా 200 పంచాయతీ భవనాల నిర్మాణం కో సం రూ.20 కోట్ల అంచనాతో అనుమతులు మంజూరైనట్లు మంత్రి అరుణ వివరించారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
జిల్లాలో ఎంజీఎల్‌ఐ ద్వారా 22 మండలాల్లోని 3.40 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు అందిస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 8 మండలలోని 148 గ్రామాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ పనులు 85 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ఈ ఏడాది పూర్తవుతుందని, రాజీవ్‌భీమా ఎత్తిపోతల పనులు 99 శాతం పూర్తయినట్లు వివరించారు.
ప్రజలకు సురక్షిత తాగునీరు
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు 793 సింగిల్‌విలేజ్ స్కీమ్‌లు రూ.73కోట్లతో చేపట్టామన్నారు. 1,259 నివాస ప్రాంతాల్లో రూ.612 కోట్లతో 59 సమగ్ర మంచినీటి పథకాలు, ప్రపంచ బ్యాంకు సహకారంతో రూ.145 కోట్లతో 585 ప్రాంతాలకు మంచినీరు అందించే పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం కింద మంచినీటి నాణ్యతను పరిశీలించేందుకు జిల్లాలో 9 ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 28వేల ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం కింద రూ.15 కోట్లు లబ్ధిచేకూరిందన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం ద్వారా రూ.42.57కోట్లతో 3,096 పనులు చేపట్టేందుకు జిల్లా ప్రణాళికా కమిటీ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించామన్నారు. అభయహస్తం పథకం ద్వారా ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్ అభయహస్తంలో 4424 మంది సభ్యులను చేర్పించినట్లు మంత్రి అరుణ తెలిపారు.
ఆదర్శ పాఠశాలలు
ఈ ఏడాది 7 ఆదర్శ పాఠశాలల నిర్మాణానికి రూ.3.2కోట్ల చొప్పున మొత్తం రూ.21 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరంలో రెండో విడతలో 40 పాఠశాలలు, మూడో విడతలో 17 మండలాల్లో ఆదర్శపాఠశాలల ఏర్పాటుకు అనుమతి లభించిందన్నారు. ఈ ఏడాది 3,63,065 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం పంపిణీ చేసేందుకు రూ.1,452 లక్షల బడ్జెట్ మంజూరైందన్నారు. జిల్లా ఆస్పత్రిని 250 నుంచి 350 పడకల స్థాయికి పెంచేందుకు రూ.8.40 కోట్లు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు.
సబ్‌ప్లాన్ కింద వసతిగృహాల నిర్మాణం
ఎస్సీ సబ్‌ప్లాన్ కింద జిల్లాకు ఆరు ఇంటిగ్రేటెడ్ సంక్షేమ వసతిగృహాలు, మూడు సాధారణ, నాలుగు కళాశాల వసతిగృహాలకు రూ.12 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సబ్‌ప్లాన్‌కింద ఆరు గిరిజన సంక్షేమ హాస్టళ్లు, రెండుయూత్ ట్రైనింగ్ సెంటర్లు, ఐదు హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో డార్మిటరీల నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. సబల పథకం ద్వారా జిల్లాలో 1,55,577 మంది బాలికలు లబ్ధిపొందుతున్నారని అన్నారు.
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద 1,404 మంది లబ్ధిదారులకు రూ.421 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని పోలీసుశాఖలోని అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందిని మంత్రి డీకే అరుణ అభినందించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జేసీ శర్మణ్, ఏజీసీ రాజారాం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి పెద్దపీట
Published Fri, Aug 16 2013 3:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement