
నందిగామ: ‘‘పశ్చిమ కృష్ణా ప్రాంతంలో రైతులు 45 వేల ఎకరాల్లో సుబాబుల్ పంట వేశారు. వరి ఎలాగైతే సోమరిపోతు పంటో సుబాబుల్ కూడా అలాంటిదే. మనకు గతి లేక, మరో పంట పండక, నీటి ఎద్దడి వల్ల సుబాబుల్ పంటకు అలవాటుపడ్డాం. రైతులు సుబా బుల్ నుంచి బయటకు వచ్చి వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి’’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామలో నూతన పోలీసుస్టేషన్ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మంత్రి చినరాజప్ప, మంత్రి దేవినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి, సుబాబుల్ పంటల గురించి దేవినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాంతి భద్రతలను అదుపులో ఉంచుతున్నామని చినరాజప్ప చెప్పారు.
వ్యవసాయం, రైతులంటే టీడీపీకి చిన్నచూపే : ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి, అమరావతి/విజయవాడ సిటీ: వరి, సుబాబుల్ పంటల రైతులపై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఖండించారు. ‘‘రైతుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడూ చిన్నచూపే. వ్యవసాయం దండుగని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం మర్చిపోలేం. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోని దేవినేనిఉమ వరి సాగుదారులను సోమరిపోతులు అనడం దారుణం. మొత్తం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో వరి ప్రధాన పంటగా ఉంది. కృష్ణా–గోదావరి కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాతో ఏపీని అన్నపూర్ణగా, దక్షిణభారత ధాన్యాగారంగా పిలుస్తారు. ఏపీలో 90శాతం మంది వరి అన్నం తింటారు. వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడేటప్పడు ఎవరికైనా ఇంగితజ్ఞానం ఉండాలి. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ధనదోపిడీ కొనసాగించడం తప్ప రైతుల పట్ల గౌరవం, వ్యవసాయం రంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు’’ అని తీవ్రంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment