కోడ్ ఉల్లంఘించి టీచర్లతో మంత్రి గంటా భేటీ
కోడ్ ఉల్లంఘించి టీచర్లతో మంత్రి గంటా భేటీ
Published Mon, Aug 28 2017 3:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల వేళ ఎన్జీవో, ఉపాధ్యాయ సంఘం నేతలు కాకినాడలో హడావుడి పర్యటనచేశారు. ఏపీ జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు ఓ వైపు, పీఆర్‌టీయూ నేత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మరోవైపు చాటుమాటు రాజకీయాలు నడిపారు. శనివారం రాత్రి అశోక్‌బాబు తన అనుయాయులను కలిసి ప్రభుత్వానికి మద్దతుగా సంప్రదింపులు చేయగా, ఆదివారం పీఆర్‌టీయూ నేతలతో గాదె సమావేశమై స్వామిభక్తిని చాటుకున్నారు. కాకపోతే, ఎన్నికల వేళ ఉపాధ్యాయులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం కావడం కాస్తా వివాదాస్పదంగా మారింది.
ఏం జరిగిందంటే..: కాకినాడలో శనివారం రాత్రి ఎన్జీవో సంఘం సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు హాజరయ్యారు. ఎన్నికల వేళ అశోక్‌బాబు టీడీపీకి మద్దతు కూడగట్టేలా పరోక్షంగా పావులు కదిపారన్న అభిప్రాయం వ్యక్తమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసిన పేరు అశోక్‌బాబుకు వెళ్లిపోతుందని పీఆర్‌టీయూ సంఘం ఉపాధ్యాయులతో నరసన్ననగర్‌లోని తిరుమల ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి, దానికి మంత్రి గంటాను ఆహ్వానించారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. దీంట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉపాధ్యాయులతో మంత్రి గంటా , ఎంపీ పండుల రవీంద్రబాబు సమావేశం కావడం వివాదాస్పదమైంది.
ఎన్నికల్లో సహకరించాలని పిలుపు: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, పది రోజుల్లో పరిష్కారమవుతాయని, కార్పొరేషన్ ఎన్నికల్లో సహకరించాలని మంత్రి గంటా సమావేశంలో విజ్ఞప్తిచేశారు. ప్రైవేటు సంస్థలు, ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఒక సందర్భంలో హుకుం కూడా జారీచేశారు. ఈ విషయం బయటకు రావడంతో మిగతా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉపాధ్యాయ సంఘాలతో ఇలా సమావేశాలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశమైంది.
Advertisement
Advertisement