రచ్చబండపెడదామా? | Minister, MLAs CM talks | Sakshi
Sakshi News home page

రచ్చబండపెడదామా?

Published Mon, Oct 21 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

Minister, MLAs CM talks

 

=మంత్రి, ఎమ్మెల్యేలతో సీఎం చర్చలు
 =రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీతో సమైక్యాంధ్ర ఆగ్రహం చల్లార్చే వ్యూహం
 =ముఖ్యమంత్రి పర్యటనకు డీసీసీ అధ్యక్షుడు దూరం

 
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఉద్యోగులు తప్పుకున్నందువల్ల రచ్చబండ కార్యక్రమం జరిపి ప్రజాగ్రహం తగ్గిద్దామని మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సూర్య నారాయణరాజుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పిచ్చా పాటిగా చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను బాధిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆదివా రం సాయంత్రం 5 గంటలకు సీఎం విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణానికి గంటన్నర సమయం ఉండడంతో వీఐపీ లాంజ్‌లోనే ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు.

రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో పార్టీ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం ఆయన అంగీకరించారని తెలిసింది. పరిస్థితులు కుదు ట పడినందువల్ల వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమం పెడదామా? అని ఆయన అడిగారు. ఇందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే రచ్చబండ జరిపేస్తే మంచిదని స్పందించగా, మిగిలిన వారు మౌనంగా కూర్చున్నారని సమాచారం. రచ్చబండలో పింఛన్లు, రేషన్ కార్డులు అందించడం వల్ల ప్రజల నుంచి సమైక్యాంధ్ర సెగ ఉండదని సీఎం చెబుతూ, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆరోఖ్యరాజ్‌కు సూచించారు.

సమైక్యాంధ్రకు సంబంధించి కొందరు కేంద్ర మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నా అసెంబ్లీ తీర్మానం అయ్యాక పార్టీ హై కమాండ్ మెత్తబడక తప్పదని ఎమ్మెల్యేలకు సీఎం ధైర్యం చెప్పినట్టు  తెలిసింది. పై-లీన్ తుపాను వల్ల శారదా, తాండవ రిజర్వాయర్లకు నష్టం జరిగిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటని ఆయన ఆరా తీశారు. విశాఖ నగరాానికి తాగునీటి సరఫరా ఎలా ఉందంటూ, నీటి కొరత గురించి కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతానికి తాగునీటి సమస్యేమీ లేదని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. సీఎం పర్యటకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మశ్రీ  హాజరు కాలేదు.
 
కె.కోటపాడు మండలంలో సమైక్యాంధ్ర పాదయాత్రలో ఉన్నందువల్లే ఆయన సీఎం పర్యటనకు రాలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, ైతె నాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య,  రమణమూర్తి రాజు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉదయం సీఎంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీఎంను కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement