ఔనా! నిజమేనా? | Minister of Health in the assembly of the new word | Sakshi
Sakshi News home page

ఔనా! నిజమేనా?

Published Wed, Mar 9 2016 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

ఔనా! నిజమేనా?

ఔనా! నిజమేనా?

వచ్చే నెల 7 నుంచి విమ్స్ ఓపీలట!
అసెంబ్లీలో ఆరోగ్యమంత్రి కొత్త మాట
వైద్యులు లేరు.. సిబ్బంది లేరు
పరికరాలు, సౌకర్యాల జాడే లేదు
సేవల ప్రారంభంపై సందేహాలు

 
విశాఖపట్నం: విశాఖ ప్రజలు ఎంతగానో, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వచ్చే నెల నుంచే వైద్య సేవలు ప్రారంభం! నమ్మలేకపోతున్నారా? అసాధ్యం అంటున్నారా? అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పాక కూడా నమ్మలేమంటరా? నిజం! గౌరవనీయ మంత్రి బుధవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు కాబట్టి నమ్మాల్సిందే. విమ్స్‌లో ఓపీ సేవలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభిస్తామని, ప్రయివేటు పరం చేయబోమని ఆరోగ్యమంత్రి కామినేని ప్రకటించారు.

కొత్తేముంది?: ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్, ఇతర మంత్రులు వీలు చిక్కినప్పుడు, విశాఖ వచ్చినప్పుడు చేస్తున్న విమ్స్ గురించి ప్రకటనలు కుమ్మరిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. గోడమీద రాతలా వచ్చే నెలలోనే విమ్స్‌ను ప్రారంభిస్తామని వీరు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అలా ఎన్నో గడచిపోయాయి.దీంతో జనం నమ్మడం మానేశారు. విమ్స్ అసలు ప్రారంభమవుతుందా? అన్న సందేహానికి వచ్చేశారు.  దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన భవనాలు తప్ప అదనపు నిర్మాణాలు చేపట్టలేదు. అవీ శిథిలావస్థకు చేరుకున్నాయి. విలువైన వస్తువులు, సామగ్రి దొంగల పాలవుతున్నాయి. చెట్లు, తుప్పలు బలిసిపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. ఇక సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కేజీహెచ్ వైద్యులను విమ్స్‌కు పంపుతామని ఆరోగ్య మంత్రి అంటే అక్కడికి వెళ్లబోమని డాక్టర్లు తెగేసి చెప్పేశారు. వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఇతర సిబ్బంది కొరత ఉంది. పరికరాలు లేవు. ఇన్ని లోపాలుండగా వచ్చేనెల ఓపీ ఎలా ప్రారంభిస్తారో అంతుపట్టడం లేదు. అప్పటికి ఇంకా నెల వ్యవధి కూడా లేదు. భవనాలు, వైద్యులు, సిబ్బంది, పరికరాలు.. ఇవన్నీ ఎలా సిద్ధం చేస్తారో అర్ధం కావడం లేదు.

ఎన్నో ప్రకటనలు: ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉండగా, మరోవైపు అధికారులు, ఆమాత్యులు ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు. గత నవంబరులో విశాఖ వచ్చిన అప్పటి వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) వెంకటేష్ విమ్స్‌ను జనవరిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. జనవరిలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఫిబ్రవరిలో ప్రారంభిస్తామన్నారు. ఇక వైద్య ఆరోగ్యమంత్రి కామినేని విశాఖ వచ్చినప్పుడల్లా ‘త్వరలోనే విమ్స్ సేవలు’ అంటూ ప్రకటించి వెళ్లిపోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఓపీ ఎలా సాధ్యమో ఏలినవారికే తెలియాలి. డెప్యూటేషన్‌పై తీసుకున్న వైద్యులతో ముందు ఓపీ ప్రారంభిస్తారా? అన్న అంశంపై స్పష్టత రావాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement