సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలకు సంబంధించి సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటో డ్రైవర్ల బాధలను దగ్గర నుంచి చూశారని చెప్పారు. ఆటోడ్రైవర్ల కష్టాలను చూసి వారికి ఏడాదికి రూ.10వేలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచినట్టు తెలిపారు. ఆ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు ఇస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు తాగునీటి సరాఫరాకు సంబంధించిన సమస్యలను పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. నెల్లూరు రూరల్‌లో మంచినీటి సమస్య గురించి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రస్తావించారు. తీరప్రాంతంలో మంచినీటి సమస్య తీర్చాలని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు విజ్ఞప్తి చేశారు. వాటిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలుకు నీటి సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీటి సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment