
పెదవి విప్పితే టీడీపీకే నష్టం..
ఇన్నాళ్లూ వారు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అనుకున్నారు.
► మంత్రి సుజయ్ భూ దాహంపై నోరుమెదపని టీడీపీ
►నైతికంగా నవ్వులపాలవుతామేమోనన్న భయం
►ప్రత్యేకించి లోలోన సంబరపడుతున్న ఓ వర్గం
►అందుకేనా పార్టీ ఫిరాయించింది అంటూ సామాన్యుడి ఎద్దేవా
‘అవును.... ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత సమస్య. దానికి పదవినీ... పార్టీని అడ్డం పెట్టుకున్నారు. ఇది ముమ్మాటికీ అన్యాయమే.’ తెలుగుదేశం పార్టీలో ఎవరిని కదిపినా ఇదే వ్యాఖ్యానం. ‘అసలు మనమెందుకు దీనిపై మాట్లాడాలి. పూర్తి ఆధారాలతో సాక్షి ప్రచురించాక... ఇక చెప్పేదేం ఉంటుంది. ఏమైనా మాట్లాడితే అందులో మమ్మల్నీ జమకట్టేయరూ...’ ఇది కొందరి మనోగతం. ఇంకా కొందరైతే ఆయన బండారం బట్టబయలైందని సంబరపడుతున్నారు. ‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇలానే ఉంటుంది మరి... ఇప్పటికైనా అధిష్టానం దీనిపై స్పందిస్తే మంచిది’ అని పార్టీలోని ఇంకోవర్గం అభిప్రాయం. మొత్తమ్మీద మంత్రి సుజయ్‌కు... గిరిజనులకు మధ్య జరుగుతున్న వివాదం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇన్నాళ్లూ వారు చెప్పిందే వేదం... చేసిందే చట్టం అనుకున్నారు. అర్థ బలానికి అంగ బలం తోడైతే ఇక తమకు తిరుగే ఉండదని భావించారు. అందుకే అడ్డగోలుగా పార్టీ ఫిరాయించేశారు. ముఖ్యమంత్రితో బేరం కుదుర్చుకుని మంత్రి పదవిని కొట్టేశారు. ఇక ప్రణాళికా బద్ధంగా గతంలో సర్కారు స్వాధీనం చేసుకున్న భూముల్ని లాక్కునేందుకు పావులు కదిపారు. కానీ నిరుపేద గిరిజన రైతులను రోడ్డుపాలు చేయాలనుకునే ప్రయత్నం బెడిసి కొట్టినట్టయింది.
టీడీపీ పరువు కాస్తా గంగలో పడేలా చేసింది. ఎప్పుడో ప్రభుత్వం పంచి పెట్టిన భూములను ఇప్పుడు లేనిపోని సాకులు చెప్పి అన్యాయంగా వారి నుంచి లాగేసుకోవడానికి జరుగుతున్న కుట్రలను ‘సాక్షి’ బయటపెట్టడం... దానికి విపక్షాలు గొంతు కలపడం... ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఖండించడం... సామాన్య మధ్యతరగతి ప్రజలైతే మంత్రుల నిజస్వరూపం ఇదా అని విమర్శించడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తయితే పార్టీలో సైతం దీనిని ఖండించేందుకు... దీనిపై వ్యాఖ్యానించేందుకూ... మంత్రి తరఫున మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
పెదవి విప్పితే పార్టీకే నష్టం
మంత్రికి, గిరిజనులకు మధ్య నడుస్తున్న వివాదంపై మాట్లాడటానికి ఆ పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, అసలే గిరిజనులు, వాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందోనని ఎవరికి వారు కిక్కురుమనకుండా కూర్చుంటున్నారు. అదీగాక సుజయ్ కృష్ణ రంగారావు సొంత వ్యవహారం కావడంతో దీనిపై నోరువిప్పితే తర్వాత ఎదురయ్యే ప్రజా వ్యతిరేకత వల్ల మొత్తం తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుందని భావించి మౌనం వహిస్తున్నారు. ఇక టీడీపీలో మరో వర్గం మాత్రం ‘సాక్షి’ కథనాలు, విపక్షాల విమర్శలతో మంత్రికి తగిన శాస్తి జరిగిందంటున్నారు. కేవలం ఆస్తులు కాపాడుకునేందుకే తమ పార్టీలోకి వచ్చారన్న భావన వారిలో వ్యక్తమవుతోంది.
జనానికి ఎలా చెప్పాలో...
తాము చేసింది తప్పు కాదనీ... కేవలం తమకు చెందిన భూములనే తీసుకుంటున్నామని... జనాన్ని నమ్మించడం ఎలాగో అర్థం కాక బొబ్బి లి రాజులు సతమతం అవుతున్నట్టు తెలిసింది. దీనిపై సుజయ్ తన తమ్ముడు బేబీ నాయనతో చర్చించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం వల్ల జనం వద్ద చులకనైపోతున్నామేమోనన్న బెంగ కూడా వారిలో పట్టుకుంది. ఒకవేళ వాస్తవాలు ఇవీ అని చెప్పినా జనం నమ్మే పరిస్థితిలో ఉంటారా అన్నది వారి సందేహం. అలా అని ఇప్పు డు వెనకడుగు వేసేందుకు కూడా అహం అడ్డొస్తోంది. అందుకే దీనిపై బొబ్బిలి కోట లోనూ తర్జనభర్జనలు సాగుతున్నాయంట.
అధికారులు బెంబేలు
ఈ అన్యాయానికి ప్రత్యక్షంగా సహకరించినవారు... ఏకంగా పాత్రధారులైన అధికారుల్లో ‘సాక్షి’ కథనాలు వణుకు పుట్టించాయనే చెప్పాలి. మంత్రి కదా ఆయన చెప్పినట్లు నడుచుకోవడం వల్ల ప్రజల్లో, పత్రికల్లో చులకనైపోతున్నామని తెలిసినా ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక చివరకు ‘ఏం రాసుకుంటారో రాసుకోండి.. మేం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం’ అని బొబ్బిలి తహసీల్దార్ కోరాడ సూర్యనారాయణ వ్యాఖ్యానించారంటే ఆయనెంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి.లఠ్కర్ ఈ వ్యవహారంపై ఎలా స్పం దిస్తే ఏమవుతుందోనని ఏకంగా తెలియదని చెప్పుకొచ్చారు. గిరిజన రైతులకు ఇచ్చిన డి పట్టా భూములను మంత్రి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి తనకు ఇంత వరకూ తెలియదనీ. దానికి సంబంధించిన ఫైలుగానీ, ఫిర్యాదులు గానీ తమ దగ్గరకు రాలేదనీ, తహసీల్దార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తాననీ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇలా జిల్లా టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కూడా మంత్రి సుజయ కృష్ణ రంగారావు వ్యవహారం రచ్చ రచ్చకావడంతో బెంబేలెత్తిపోతున్నారు.