
'రాజీనామాలు ఆర్బాటపు ప్రచారానికే పరిమితం'
హైదరాబాద్ : మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి రాజీనామా హైడ్రామా తేలిపోయింది. మీడియాలో గత రెండురోజులనుంచి హడావిడి చేస్తున్నవీరిద్దరూ ఆర్భాటపు ప్రచారానికే పరిమితమయ్యారు. సోమవారం ఉదయం సీఎంతోనూ, తర్వాత గవర్నర్‌తోనూ జరిగిన సమావేశాల్లో వారిద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరకు రాజీనామా లేఖలు గవర్నర్‌కు ఇవ్వలేదని చెప్పారు. గవర్నర్తో భేటీ అనంతరం రాజీనామాలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి తమను వారించారని మంత్రులు గంటా, ఏరాసు చెప్పారు.
గవర్నర్కు కూడా రాజీనామా లేఖలు ఇవ్వాలనుకున్నామని, అయితే రాజీమానాలు ఆమోదించాల్సింది ముఖ్యమంత్రేనని గవర్నర్ చెప్పటంతో ఆయనకు రాజీనామా లేఖలు ఇవ్వడాన్ని విరమించుకున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో సీఎం ఢిల్లీ వెళ్తానంటున్నారని, హైకమాండ్తో అన్ని విషయాలు చర్చిస్తామన్నారన్నారు. ఆ తర్వాతే రాజీనామాలపై సమిష్టి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పారని గంటా, ఏరాసు తెలిపారు. రాజీనామాలు చేయొద్దని తమను ముఖ్యమంత్రి వారించారని, అందుకే తాము రాజీనామాలను ఆమోదించాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు.